THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

మూవీ రివ్యూ : ‘మిషన్ ఇంపాజిబుల్’

thesakshiadmin by thesakshiadmin
April 1, 2022
in Latest, Movies, Reviews
0
మూవీ రివ్యూ : ‘మిషన్ ఇంపాజిబుల్’
0
SHARES
66
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :   మూవీ రివ్యూ : ‘మిషన్ ఇంపాజిబుల్’

చిత్రం : ‘మిషన్ ఇంపాజిబుల్’
నటీనటులు: మాస్టర్ హర్ష్ రోషన్-మాస్టర్ భాను ప్రక్షన్-మాస్టర్ జయతీర్థ మొలుగు-తాప్సి పన్ను-రవీంద్ర విజయ్-హరీష్ పేరాది-హర్షవర్ధన్-రిషబ్ శెట్టి-సుహాస్-సందీప్ రాజ్ తదితరులు
సంగీతం: మార్క్ కె.రాబిన్
ఛాయాగ్రహణం: దీపక్ ఎరగార
మాటలు: స్వరూప ఆర్.ఎస్.జె-మనోరంజితం దివ్య
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి-అన్వేష్ రెడ్డి
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: స్వరూప్ ఆర్.ఎస్.జె

తొలి చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో ఆశ్చర్యపరిచిన దర్శకుడు స్వరూప్ ఆర్.ఎస్.జె ఇప్పుడు ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ముగ్గురు పిల్లలు ప్రధాన పాత్రధారులుగా అతను రూపొందించిన ఈ చిత్రం ట్రైలర్ తో బాగా ఆకట్టుకుంది. మరి సినిమా కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను మెప్పించేలా ఉందేమో చూద్దాం పదండి.
:

రఘుపతి (మాస్టర్ హర్ష్ రోషన్).. రాఘవ (భాను ప్రక్షన్).. రాజారాం (జయతీర్థ మొలుగు).. తిరుపతి సమీపంలోని వడమాల పేట అనే పల్లెటూరికి చెందిన కుర్రాళ్లు పది పన్నెండేళ్ల వయసుండే ఈ ముగ్గురికీ చదువు మీద పెద్దగా ధ్యాస ఉండదు. కానీ చిన్న వయసులోనే ఏదో సాధించేయాలని.. తమ ఫొటోలు పేపర్లలో పడాలని.. అందరూ తమ గురించే మాట్లాడుకోవాలని.. బోలెడు డబ్బులు సంపాదించాలని.. ఇలా పెద్ద పెద్ద కలలే కంటుంటారు. అప్పుడే వీరికి మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకుని ప్రభుత్వం ఇచ్చే 50 లక్షల రివార్డు అందుకోవాలన్న ఆలోచన పుడుతుంది. దీంతో ముగ్గురూ కలిసి ఊరు విడిచి వెళ్లిపోయి బెంగళూరులో తేలుతారు. అక్కడ రాజారాం కిడ్నాప్ అవుతాడు. ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డ మిగతా ఇద్దరూ.. చిన్నపిల్లల అక్రమ రవాణా చేసే ముఠాను పట్టుకోవడానికి ఒక టీంతో కలిసి కష్టపడుతున్న జర్నలిస్టు శైలజ (తాప్సి)కు తారసపడతారు. మరి ఈ చిన్న పిల్లల్ని తన మిషన్ కోసం శైలజ ఎలా ఉపయోగించుకుంది.. కిడ్నాపర్ల నుంచి రాజారాం బయటపడ్డాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ అనే చిన్న సినిమాతో పెద్ద విజయం అందుకున్న దర్శకుడు స్వరూప్. ఆ సినిమాతో వచ్చిన పేరుతో ఒక స్టార్ హీరోను ఒప్పించి మంచి బడ్జెట్లో సినిమా చేయడానికి అతడికి అవకాశముంది. కానీ అతను మాత్రం ముగ్గురు చిన్నపిల్లల్ని పెట్టి మళ్లీ ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే చిన్న సినిమా చేసే సాహసానికి పూనుకున్నాడు. ఇది కచ్చితంగా అభినందించదగ్గ విషయం. దీన్ని బట్టి చూస్తే అతను స్టార్ల కంటే కథనే ఎక్కువ నమ్ముతాడనిపించింది. ‘మిషన్ ఇంపాజిబుల్’ ట్రైలర్ చూశాక.. స్వరూప్ మీద ప్రశంసల జల్లు కురిసింది. భలే పాయింట్ పట్టుకున్నాడే.. ఈ మిషనేదో భలే ఆసక్తికరంగా అనిపిస్తోందే అని.. అభిరుచి ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమాపై పెరిగాయి. ఐతే చాలామంది దర్శకుల్లాగే స్వరూప్ సైతం ట్రైలర్ వరకు మెరుపులు మెరిపించి సినిమాతో అంచనాలు అందుకోలేకపోయాడు. బేసిక్ స్టోరీ ఐడియా బాగున్నా.. లీడ్ రోల్స్ చేసిన ముగ్గురు పిల్లల పాత్రలు-వారి నటన ఆకట్టుకున్నా.. సీరియస్నెస్ లేని కథనం.. నమ్మశక్యం కాని విధంగా.. చాలా సిల్లీగా అనిపించే సన్నివేశాలు సినిమా గ్రాఫ్ ను కిందికి పడేశాయి.

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకుని ప్రభుత్వం ఇచ్చే 50 లక్షల రివార్డు అందుకోవాలని ప్రయత్నించే ముగ్గురు పిల్లల కథ ఇది. ఎప్పుడో 90వ దశకంలో బాంబు దాడులు చేసి పాకిస్థాన్లో వెళ్లి సెటిలైపోయిన దావూద్ ను చిత్తూరు జిల్లాలోని ఒక పల్లెటూరిలో ఉండే పిల్లలు వెళ్లి పట్టేసుకోవాలనుకోవడం సిల్లీగా అనిపిస్తుంది. ఐతే ఈ ఆలోచన చేసింది పది పన్నెండేళ్ల పిల్లలు కాబట్టి.. వాళ్ల అమాయకత్వానికి నవ్వుకోవాలే తప్ప ఇక్కడ లాజిక్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఈ ఐడియా చుట్టూ దర్శకుడు కామెడీ పండించే ప్రయత్నం చేస్తున్నపుడు లాజిక్కులు పక్కన పెట్టేసి ఓపెన్ మైండ్ తోనే చూస్తాం. పైగా దర్శకుడు ఈ విషయంలో మొదట్నుంచే ప్రేక్షకులను ప్రిపేర్ చేస్తాడు కూడా. ముగ్గురు పిల్లల ఇంట్రోలను చాలా సరదాగా చూపించడం ద్వారా ఆరంభంలో బాగానే ఇంప్రెస్ చేస్తాడు స్వరూప్. రామ్ గోపాల్ వర్మ స్ఫూర్తితో దర్శకుడవ్వాలనుకునే రఘుపతి.. ఆరో క్లాసులోనే స్కూల్ మానేసి మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంలో కోటి రూపాయలు గెలిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్న రాఘవ.. ఊర్లో ప్రతి ఒక్కరితోనూ సిక్సర్లు బాదించుకుని తనకు తాను పెద్ద ఫాస్ట్ బౌలర్లా ఫీలయ్యే రాజారాం.. ఇలా ముగ్గురి పిల్లల నేపథ్యాలు ఆసక్తికరంగా.. వినోదాత్మకంగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఇద్దరు పిల్లలు కలిసి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాం కోసం ప్రోమో రెడీ చేసే ఎపిసోడ్ భలేగా అనిపిస్తుంది. ఇక్కడ దర్శకుడి సెన్సాఫ్ హ్యూమర్ చూసి నవ్వుల విందుకు రెడీ అయిపోతాం.

ఐతే పాత్రల పరిచయాలు.. కొన్ని సన్నివేశాల వరకు మెప్పించి.. అసలు కథలోకి దిగగానే గాడి తప్పే చాలా సినిమాల జాబితాలోకే ‘మిషన్ ఇంపాజిబుల్’ కూడా చేరుతుంది. దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడాలన్న పిల్లల ఆలోచన.. అందుకోసం వాళ్లు ప్రిపేరయ్యే తీరు కొంత వరకు సరదాగా అనిపించినా.. ఆ తర్వాత వ్యవహారం నాన్ సీరియస్ అయిపోతుంది. పిల్లల అమాయకత్వం మీద కామెడీ ఒక దశ దాటాక మరీ సిల్లీగా అనిపిస్తుంది. బొంబాయి పేరు ముంబయిగా మారి ఎన్నో ఏళ్లయింది. కానీ పిల్లలేమో ముంబయి బస్సు వచ్చి ఆగితే బొంబాయి బస్సెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఇక అనుకోకుండా బెంగళూరులో దిగి.. బొంబాయి పేరును బెంగళూరుగా మార్చారు అనుకుని దావూద్ వేటకు రెడీ అయిపోవడం అతికే అతిగా అనిపిస్తుంది. ఎంత పిల్లలైనా సరే.. పల్లెటూరి వాళ్లయినా సరే.. ఇంత సినిమాటిక్ లిబర్టీ తీసుకోవడం టూమచ్. ఇదే అతి అంటే.. ఇంతటి వాళ్లను పిల్లల్ని విదేశాలకు అక్రమ రవాణా చేసే ముఠాను పట్టుకోవడానికి సరైనోళ్లు అని జర్నలిస్ట్ అయిన తాప్సి ఆమె టీం ఫిక్సవడం.. వాళ్లను ప్రమాదకర మిషన్ కి రెడీ చేయడం విడ్డూరంగా అనిపిస్తుంది.

ప్రథమార్ధంలో కాస్తో కూస్తో ఉన్న సీరియస్నెస్ కూడా రెండో అర్ధంలో పోయేలా సాగుతుంది ‘మిషన్ ఇంపాజిబుల్’. విలన్ డెన్లోకి పిల్లల ప్రవేశం.. వెనుక నుంచి తాప్సి అండ్ కో ముఠాను పట్టుకోవడానికి చేసే ప్లానింగ్.. ఈ నేపథ్యంలో నడిచే సన్నివేశాలేవీ కూడా నమ్మశక్యంగా.. సీరియస్ గా అనిపించవు. అంతకంతకూ పెరిగిపోతున్న సిల్లీ నెస్ తో పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోవాల్సిందే. బాలీవుడ్లో మంచి మంచి సినిమాలు చేస్తూ తన అభిరుచిని చాటుకుంటున్న తాప్సి.. ఎలా నమ్మి కొన్ని సన్నివేశాల్లో నటించిందో అర్థం కాని విధంగా అవి నడుస్తాయి. కొన్ని సీన్లయితే మరీ ఇల్లాజికల్ గా అనిపిస్తాయి. పతాక ఘట్టం దగ్గరికొచ్చేసరికి పూర్తిగా ఆసక్తిని కోల్పోవడం ఖాయం. పిల్లలకు ఎంత ఎలివేషన్ ఇద్దామని చూసినా.. అవేవీ ఫలితాన్నివ్వలేదు. విలన్ని చూస్తే భయం కలగదు. మన లిటిల్ హీరోలను చూస్తే ఎగ్జైట్మెంటూ ఉండదు. నిజంగా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ దర్శకుడే ఈ సినిమా తీశాడా అని ఆశ్చర్యపోతూ థియేటర్ల నుంచి బయటపడటం తప్పం ఏం చేయలేం.

నటీనటులు:

ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ విషయానికి వస్తే ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన ముగ్గురు పిల్లల గురించే. హర్ష్ రోషన్.. భాను ప్రక్షన్.. రామతీర్థ ములుగు.. ముగ్గురిలో ఎవరూ ఎవరికీ తీసిపోని విధంగా నటించారు. ఈ వయసులో ఏ తడబాటు లేకుండా.. అతి అనిపించకుండా ఈ ముగ్గురూ నటించిన తీరుకు ఫిదా అయిపోతాం. పాత్రల్లోని అమాయకత్వాన్ని ముగ్గురూ చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. నటుడిగా ఇప్పటికే అనుభవం ఉండటం వల్ల హర్ష్ మరింతగా ఆకట్టుకుంటాడు. భవిష్యత్తులో హీరోగా రాణించే లక్షణాలున్నాయి అతడిలో. తాప్సి పన్ను స్థాయికి తన స్థాయికి తగ్గ పాత్ర చేయలేదిందులో. ఆమెది అతిథి పాత్రలా అనిపిస్తుంది. తన క్యారెక్టర్ని దర్శకుడు చాలా సాధారణంగా తీర్చిదిద్దాడు. నటన పరంగా కూడా తాప్సి ప్రత్యేకంగా చేయడానికేమీ లేదిందులో. విలన్ పాత్ర మరీ బలహీనంగా ఉండటంతో మలయాళ నటుడు హరీష్ పేరాది తేలిపోయాడు. రవీంద్ర విజయ్ క్యారెక్టర్ కూడా అంతంతమాత్రమే. చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన సందీప్ రాజ్.. సుహాస్.. రిషబ్ శెట్టిల వల్ల సినిమాకు పెద్దగా ప్రయోజనం లేకపోయింది.

సాంకేతిక వర్గం:

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సహా కొన్ని థ్రిల్లర్ సినిమాలకు మంచి సంగీతంతో ఆకట్టుకున్న మార్క్ కె.రాబిన్ ఈ చిత్రంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అతడి నేపథ్య సంగీతం సినిమాలో చెప్పుకోదగ్గ ఆకర్షణల్లో ఒకటి. ఒక డిఫరెంట్ ఫీల్ ఇచ్చేలా సాగింది ఆర్ఆర్. పాటలకు అంతగా ప్రాధాన్యం లేదు కానీ.. ఉన్న ఒకట్రెండు ఓకే అనిపిస్తాయి. దీపక్ ఎరగార ఛాయాగ్రహణం కూడా ఆకట్టుకుంటుంది. విజువల్స్ బాగున్నాయి. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలోనే ఉన్నాయి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ తర్వాత దర్శకుడు స్వరూప్ ఆర్.ఎస్.జె స్టార్లతో సినిమాలు చేసే అవకాశం ఉన్నప్పటికీ.. అలా కాకుండా ముగ్గురు పిల్లల్ని పెట్టి ఇలాంటి సినిమా తీయాలనుకోవడం అభినందనీయమే. అతను ఎంచుకున్న స్టోరీ ఐడియా కూడా బాగుంది. పిల్లల పాత్రల్ని తీర్చిదిద్దిన తీరు కూడా ఓకే. కానీ నమ్మశక్యంగా అనిపించే సన్నివేశాలు.. పకడ్బందీ కథనం తీర్చిదిద్దుకోవడంలో అతను విఫలమయ్యాడు. ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలను వినోదభరితంగా తీర్చిదిద్దడం మినహాయిస్తే.. స్వరూప్ తొలి సినిమా స్థాయిని ఎక్కడా అందుకోలేకపోయాడు.

చివరగా: మిషన్ ఇంపాజిబుల్.. మిషన్ మిడిల్ డ్రాప్

రేటింగ్-3.5/5

Tags: #BhanuPrakash#FilmNews#HarshRoshan#JayateerthaMolugu#MishanImpossible#MishanImpossiblemoviereview#TaapseePannu
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info