THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

మూవీ రివ్యూ :‘నారప్ప’

thesakshiadmin by thesakshiadmin
July 20, 2021
in Latest, Movies, Reviews
0
మూవీ రివ్యూ :‘నారప్ప’
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on Twitter

చిత్రం :‘నారప్ప’

నటీనటులు: వెంకటేష్-ప్రియమణి-కార్తీక్ రత్నం-రాజీవ్ కనకాల-రాఖీ, నరేన్-శ్రీతేజ్-అమ్ము అభిరామి-బ్రహ్మాజీ-రావు రమేష్-నాజర్-వశిష్ఠ సింహా తదితరులు
సంగీతం: మణిశర్మ

ఛాయాగ్రహణం: శ్యామ్ కె.నాయుడు
నిర్మాతలు: సురేష్ బాబు-కలైపులి ఎస్.థాను
కథ-స్క్రీన్ ప్లే: వెట్రిమారన్
మాటలు-దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల

కరోనా వేళ థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతి పెద్ద తెలుగు చిత్రం ‘నారప్ప’. గత ఏడాది వి, నిశ్శబ్దం లాంటి పేరున్న చిత్రాలు అమేజాన్ ప్రైమ్ ద్వారా రిలీజైతే.. ఇప్పుడు వెంకటేష్ నటించిన ‘నారప్ప’ అదే ఓటీటీ ద్వారా విడుదలైంది. తమిళ బ్లాక్‌బస్టర్ ‘అసురన్’ ఆధారంగా శ్రీకాంత్ అడ్డాల రూపొందించిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

నారప్ప (వెంకటేష్) రాయలసీమలోని అనంతపురంలో తనకున్న మూడెకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ కుటుంబంతో సాధారణ జీవితం గడిపే వ్యక్తి. ఊర్లో పెద్ద కులానికి చెందిన పండుస్వామి (నరేన్) కుటుంబం సిమెంట్ ఫ్యాక్టరీ కట్టడం కోసం.. నారప్ప పొలాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని చూస్తుంటుంది. కానీ నారప్ప కుటుంబం అందుకే ససేమిరా అంటుంది. ఐతే పొలం దగ్గర జరిగిన ఓ గొడవ చినికి చినికి గాలివానై నారప్ప పెద్ద కొడుకు మునికన్న (కార్తీక్ రత్నం)ను పండుస్వామి కుటుంబీకులు చంపేస్తారు. దీంతో నారప్ప చిన్న కొడుకు సినబ్బ (రాఖీ) అన్న మరణం.. తదనంత పరిణామాలతో రగిలిపోయి ఒక అనూహ్యమైన పని చేస్తాడు. అదేంటి.. దాని వల్ల నారప్ప కుటుంబం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది.. వాటి నుంచి బయటపడటానికి నారప్ప ఏం చేశాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

వేరే భాషల్లో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని బ్లాక్‌బస్టర్లయిన సినిమాలను రీమేక్ చేస్తున్నపుడు చాలా వరకు ఒరిజినల్ ను యాజిటీజ్ ఫాలో అయిపోవడానికే చూస్తారు వాటి మేకర్స్. ‘జిరాక్స్ కాపీ’ అని కామెంట్లు వస్తాయి అనిపించినా కూడా ఈ విషయంలో సాహసాలకు పోరు. ‘అసురన్’ సినిమా చూసిన వాళ్లు ఎవరైనా సరే.. రీమేక్ లో మార్పులు ఉండాలనుకోరు. అంత బలమైన కథ.. ఎమోషన్లు.. మలుపులు.. సందేశం ఉన్న సినిమాను పెద్దగా మార్చాల్సిన అవసరం ఏముంటుంది? ఐతే ఉన్నదున్నట్లు తీసినా సరే.. ఒరిజినల్ చూపించిన ఇంపాక్ట్ ను ఇక్కడ ఎంత మేర తీసుకు వచ్చారు అన్నది కీలకమైన విషయం. కానీ ఈ విషయంలో ‘నారప్ప’ సగం వరకే విజయవంతమైంది. ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేసినా.. మాతృక తరహాలో ఇది ప్రేక్షకుల మీద బలమైన ముద్ర వేయడంలో కాస్త వెనుకపడింది . కథ పరంగా ఒరిజినల్లో ఉన్న బలం.. సగం వరకు ఆసక్తికరంగా సాగే కథనం.. ఎమోషనల్ సీన్లు.. వెంకీ పెర్ఫామెన్స్ ప్రేక్షకులను మెప్పించినా.. తర్వాత మాత్రం ‘నారప్ప’ ఎంగేజ్ చేయలేకపోయాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ‘నారప్ప’కు బలహీనతగా మారింది. ప్రథమార్ధం వరకు అంచనాలకు తగ్గట్లే సాగినా.. చివరికొచ్చేసరికి ప్రేక్షకులపై అంత బలమైన ముద్ర వేయలేదు .

కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా సినిమాలో ఎంత ప్రతికూలంగా మారిపోతాయో చెప్పడానికి ‘నారప్ప’ ఫ్లాష్ బ్యాక్ ఒక ఉదాహరణ. ఇందులో హీరో తక్కువ కులానికి చెందిన వాడు. ఒక పెద్ద కులం వ్యక్తి దగ్గర సారా కాసే పనిలో ఉంటాడు. అతడి దగ్గర డబ్బులుండవు. ఆస్తిపాస్తులేమీ ఉండవు. కథానాయకుడిని అవసరానికి వాడుకునే యజమాని.. తర్వాత తన కుల దురహంకారాన్ని చూపించి అతడి కుటుంబాన్ని నాశనం చేస్తాడు. ఈ నేపథ్యమంతా చదువుతున్నపుడు పేదవాడిగా హీరో ఎలా ఉండాలో ఒక అంచనా వస్తుంది. కానీ తెరపైన ఆ పాత్రలో వెంకటేష్ మాత్రం మంచి డిజైనర్ షర్టులేసుకుని.. ఇస్త్రీ నలగని పంచెలు కట్టుకుని.. చక్కగా స్టైలింగ్ చేయించుకున్న హేర్ స్టైల్.. క్లీన్ షేవ్ తో సోగ్గాడిలా తిరుగుతుంటాడు. హీరో ఇలా కనిపిస్తున్నపుడు అతడి కష్టాన్ని మనం ఎలా ఫీలవుతాం? ఒక పెద్ద సామాజిక సమస్యను చర్చిస్తుంటే దాని తాలూకు ఎమోషన్.. సెంటిమెంటును ఎలా మనసుకు తీసుకుంటాం? అదీ కాక వెంకీకి జోడీగా చాలా చిన్నమ్మాయిలా కనిపించే అమ్ము అభిరామి జోడీ. వీరి మధ్య రొమాన్స్ ను ఎలా ఫీలవ్వాలి? మాతృకలోనే ఫ్లాష్ బ్యాక్ కొంచెం వీక్ గా.. కొంత అసహజంగా అనిపిస్తే.. ‘నారప్ప’లోకి వచ్చేసరికి అది మరింత వీక్ అయిపోయింది.

‘నారప్ప’కు కచ్చితంగా ప్రథమార్ధం పెద్ద బలం. కథలోని కీలక మలుపులన్నీ తొలి సగంలోనే చూస్తాం. కార్తీక్ రత్నం పాత్రతో ముడిపడ్డ సన్నివేశాలు ప్రేక్షకులపై బలమైన ప్రభావం చూపిస్తాయి. ఆ పాత్రను ముగించే సన్నివేశం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. హీరో కుటుంబం మీద ప్రేక్షకుల్లో సానుభూతి కలిగి.. హృదయం బరువెక్కేలా చేస్తాయి తొలి 40 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు. ఆ తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ కూడా కలుగుతుంది. తన తండ్రి ఒక చేతకానివాడు అనుకునే కొడుక్కి.. ఆ తండ్రిలోని మరో కోణాన్ని చూపించే యాక్షన్ ఘట్టం ‘నారప్ప’కు హైలైట్. అప్పటిదాకా తన పాత్రతో సెంటిమెంటును చక్కగా పండించిన వెంకీ.. తన వీరత్వాన్ని చూపించే ఇంటర్వెల్ ఎపిసోెడ్లోనూ మెప్పించాడు. మాతృకలో ధనుష్ ఎంతో కష్టపడి మధ్య వయస్కుడి పాత్రలో మెప్పించే ప్రయత్నం చేస్తే.. వెంకీకిది వయసుకు తగ్గ పాత్ర కావడంతో అందులో సులువుగా ఒదిగిపోయి నారప్ప పాత్ర ద్వారా ఎంత ప్రభావం చూపించాలో అంతా చూపించాడు. ఇక కథ పరంగా మలుపులు.. ఆసక్తి రేకెత్తించే సన్నివేశాలు.. బలమైన ఎమోషన్లకు కూడా ప్రథమార్ధంలో లోటు లేకపోవడంతో ‘నారప్ప’ సగం వరకు ప్రేక్షకుల ఆసక్తిని బాగానే నిలబెడుతుంది.

కానీ రెండో అర్ధంలో మాత్రం ఊహించని విధంగా ‘నారప్ప’ ట్రాక్ తప్పిపోయాడు. యువకుడి పాత్రలో వెంకీ ఏమేర సూటయ్యాడో అన్న సందేహాలకు తగ్గట్లే ఆయన మిస్ ఫిట్ కావడం.. ఆ పాత్ర విషయంలో దర్శకుడు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం.. మాతృకలో ఉన్న ఇంటెన్సిటీ ఇక్కడ మిస్సయిపోవడంతో ‘నారప్ప’ ఇంపాక్ట్ తగ్గిపోయింది.

చివరికొచ్చేసరికి ఎమోషన్ క్యారీ అవ్వలేదు. తమిళనాడులో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ‘అసురన్’ తెరకెక్కడంతో అక్కడి ప్రేక్షకులు దానికి బాగా కనెక్టయి ఉండొచ్చు. కానీ రాయలసీమ నేపథ్యం ఎంచుకుని అక్కడ ఎన్నడూ చూడని ఉదంతాలను చూపించడం.. పైగా భాష.. యాస.. నేటివిటీ విషయంలో కన్సిస్టెన్సీ మిస్ కావడం ‘నారప్ప’కు ప్రతికూలతలే. మొత్తంగా చెప్పాలంటే.. ‘అసురన్’ను ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఫాలో అయినప్పటికీ.. దాని స్థాయిలో ఇంపాక్ట్ చూపించడంలో ‘నారప్ప’ విఫలమైంది. మధ్య వయస్కుడిగా వెంకీ నటన.. ప్రథమార్ధంలో వచ్చే ఆసక్తికర సన్నివేశాలు.. ఎమోషన్ల కోసం ‘నారప్ప’పై ఓ లుక్కేయొచ్చు.

నటీనటులు:

జాలి గొల్పే.. సెంటిమెంట్ పండించడానికి అవకాశమున్న పాత్రల్లో వెంకటేష్ బాగా చేస్తాడని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వయసు మీద పడ్డ నారప్ప పాత్రలో ఆయన చాలా సులువుగా ఒదిగిపోయాడు. అది ఆయన వయసుకు తగ్గ పాత్రలాగా కూడా అనిపించింది. ఆ పాత్ర ఆహార్యం, వెంకీ నటన చక్కగా కుదరడంతో వర్తమానంలో అంతటా ఆ క్యారెక్టర్‌ ఆకట్టుకుంటుంది. దాంతో ట్రావెల్ అవుతాం. కానీ ఫ్లాష్ బ్యాక్‌ లో వచ్చే యువకుడి పాత్రకు వెంకీ అంతగా సూట్ కాలేదు. పాత్ర నేపథ్యానికి తగ్గ లుక్ కూడా సెట్ చేసుకోకపోవడం మైనస్ అయింది. ఫ్లాష్ బ్యాక్ లో కొన్ని చోట్ల నటన కూడా అసహజంగా అనిపిస్తుంది. ముఖ్యంగా కత్తి పట్టి నాజర్ ఇంట్లో వీరంగం చేసే సన్నివేశాల్లో వెంకీ హావభావాలు ఎబ్బెట్టుగా ఉన్నాయి. మిగతా నటీనటుల్లో వెంకీ చిన్న కొడుకుగా నటించిన రాఖీ అనే చిన్న కుర్రాడికి ఎక్కువ మార్కులు పడతాయి. సినిమాలో అందరి కంటే సహజంగా, నిలకడగా నటించిందంటే అతనే. ఆ కుర్రాడు అసలు నటిస్తున్న ఫీలింగే కలగదు. అంత సహజంగా కనిపించాడు. సుందరమ్మ పాత్రలో ప్రియమణి కూడా చక్కగా ఒదిగిపోయింది. ఎమోషనల్ సీన్లలో ఆమె ఆకట్టుకుంది. కార్తీక్ రత్నం కనిపించిన కాసేపు మంచి ఇంపాక్టే ఇచ్చాడు. లాయర్ పాత్రలో రావు రమేష్ తన అనుభవాన్ని చూపించాడు. రాజీవ్ కనకాల కూడా బాగా చేశాడు. నాజర్.. నరేన్.. శ్రీతేజ్.. వశిష్ఠ సింహా.. బ్రహ్మాజీ.. ఝాన్సీ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. అమ్ము అభిరామి ఓకే.

సాంకేతిక వర్గం:

‘నారప్ప’కు నేపథ్య సంగీతం బాగా కుదిరింది. ‘నారప్ప’ థీమ్ మ్యూజిక్ తో పాటు.. సెంటిమెంట్ సీన్లలో వచ్చే హృద్యమైన ఆర్ఆర్ ఆకట్టుకుంటాయి. ఐతే ఇవి రెండూ ఒరిజినల్ నుంచి తీసుకున్నవే. నేపథ్య సంగీతంలో చాలా వరకు మాతృకనే అనుసరించినట్లున్నాడు మణిశర్మ. ఉన్న రెండు పాటలు ఓకే అనిపిస్తాయి. కానీ సినిమాకు అవేమంత ప్లస్ కాలేదు. శ్యామ్ కె.నాయుడు ఛాయాగ్రహణం బాగానే సాగింది. విజువల్స్.. కెమెరా యాంగిల్స్ చాలా వరకు మాతృకనే గుర్తు చేస్తాయి. నిర్మాణ విలువలకేమీ లోటు లేదు. రెండు నిర్మాణ సంస్థల ప్రమాణాలకు తగ్గట్లే సినిమాను తెరకెక్కించారు. ఇక దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ‘అసురన్’ను సీన్ టు సీన్.. ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేయడం తప్ప ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. అయినప్పటికీ మాతృక స్థాయిలో ఇది ప్రభావం చూపించలేదంటే ద్వితీయార్ధంలో లోపించిన సహజత్వమే. ఒరిజినల్లోనే ఫ్లాష్ బ్యాక్ వీక్ అంటే.. హీరో పాత్ర చిత్రణ, లుక్ లాంటి విషయాలు పట్టించుకోకపోవడం వల్ల దాని ఇంపాక్ట్ తెలుగులో మరింత తగ్గిపోయింది. మాతృకలో మాదిరి ఎమోషన్ ఇక్కడ క్యారీ కాలేదు. ప్రథమార్ధం వరకు శ్రీకాంత్ బాగానే డీల్ చేశాడు కానీ.. ఓవరాల్ గా నిరాశ పరిచాడు.

చివరగా: నారప్ప.. ఇంపాక్ట్ కాస్త తగ్గిందా

రేటింగ్-3/5

Tags: # remake of the 2019 Tamil blockbuster hit ‘Asuran’#FILM NEWS#Narappa#NARAPPA MOVIE REVIEW#TOLLYWOOD#Tollywood star Venkatesh#Venkatesh’s ‘Narappa’ #Directed by Srikanth Addala
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info