THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

మూవీ రివ్యూ : టక్ జగదీష్

thesakshiadmin by thesakshiadmin
September 10, 2021
in Latest, Movies, Reviews
0
మూవీ రివ్యూ : టక్ జగదీష్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :   చిత్రం : ‘టక్ జగదీష్’
నటీనటులు: నాని-రీతూ వర్మ-ఐశ్వర్య రాజేష్-జగపతిబాబు-డేనియల్ బాలాజి-నాజర్-రావు రమేష్-నరేష్-రోహిణి-దేవదర్శిని-తిరువీర్-ప్రవీణ్ తదితరులు

సంగీతం: తమన్
నేపథ్య సంగీతం: గోపీసుందర్

ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ళ
నిర్మాతలు: హరీష్ పెద్ది-సాహు గారపాటి
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శివ నిర్వాణ

కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది ‘వి’ సినిమాతో ఓటీటీ బాట పట్టాడు నేచురల్ స్టార్ నాని. అతడి తర్వాతి చిత్రం ‘టక్ జగదీష్’ సైతం అనుకోని పరిస్థితుల్లో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి అమేజాన్ ప్రైమ్ ఓటీటీనే ఎంచుకుంది. వినాయక చవితి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ : జగదీష్ నాయుడు (నాని) భూదేవిపురం అనే గ్రామానికి పెద్దగా ఉన్న ఆదిశేషయ్య నాయుడికి రెండో భార్య చిన్న కొడుకు. అతను.. తన అన్నయ్య బోస్ (జగపతిబాబు).. తమ సవతి తల్లి కూతుళ్లతో సంతోషంగా కలిసి ఉంటారు. తన తదనంతరం కూడా కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండాలన్నది ఆదిశేషయ్య కోరిక. అలాగే భూ తగాదాలు.. కక్షలు కార్పణ్యాలతో అట్టుడికి పోతున్న గ్రామంలో శాంతి నెలకొనాలని.. అందరూ వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా ఉండాలని ఆదిశేషయ్య అభిమతం. ఐతే ఆయన హఠాత్తుగా అనారోగ్యంతో మరణించగానే.. తన కుటుంబంలో విభేదాలు తలెత్తి అందరూ చెల్లాచెదురైపోతారు. ఆదిశేషయ్య కుటుంబానికి శత్రువైన వీరేంద్ర (డేనియల్ బాలాజి)తో బోస్ చేతులు కలిపి గ్రామంలో కల్లోలానికి కారణమవుతాడు. ఈ పరిస్థితుల్లో జగదీష్ తన కుటుంబాన్ని కలపడానికి.. గ్రామంలో సమస్యల్ని పరిష్కరించడానికి ఏం చేశాడన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ కొంచెం కొత్తగా ఏదో చేయాలనే చూస్తుంటాడు. చాలామంది స్టార్లు చేసే మాస్ మసాలా సినిమాల జోలికి అస్సలు పోడు. గత ఏడాది ‘వి’ అనే రొటీన్ రివెంజ్ డ్రామా చేయడం చూసి ప్రేక్షకులు షాకైపోయారు. ఐతే ఈసారి నిన్నుకోరి-మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణతో జట్టు కట్టి ‘టక్ జగదీష్’ అనే వెరైటీ టైటిల్ తో సినిమా చేసిన నేచురల్ స్టార్.. ఏదో డిఫరెంట్ గా ట్రై చేసి ఉంటాడని ఆశించిన ప్రేక్షకులను ట్రైలర్ ఒకింత నిరాశకే గురి చేసింది. ఎమోషన్లు ప్రధానంగా సాగే పాత తరహా ఫ్యామిలీ డ్రామా లాగా కనిపించింది ‘టక్ జగదీష్’. ట్రైలర్ వచ్చినపుడే ఈ సినిమాను కొంచెం తక్కువ అంచనాలతో చూడాలన్న సంకేతాలు కనిపించాయి. అలాగే ఈ సినిమా ఇలా ఉండొచ్చు అన్న ఒక ఐడియా కూడా వచ్చేసింది. ఇలా ప్రేక్షకులను ముందే ఒక తరహా సినిమాకు ప్రిపేర్ చేసిన ‘టక్ జగదీష్’.. పెద్దగా సర్ప్రైజులేమీ లేకుండా ఒక ఫార్ములాలో నడిచిపోతుంది.

ఒకప్పటి రచయితలు.. దర్శకులు అరగదీసి పక్కన పెట్టేసిన రూరల్ ఫ్యామిలీ డ్రామా జానర్లో కథను రాసుకున్న శివ నిర్వాణ.. డ్రామాను రక్తి కట్టించడానికి.. ఎమోషన్లు పండించడానికి గట్టిగానే ప్రయత్నించాడు. ఆద్యంతం గుప్పుమనే ‘పాత’ వాసనలు.. వైవిధ్యం కోరుకునే నాని అభిమానులను ఒకింత నిరాశకు గురి చేసినా.. టార్గెటెడ్ ఆడియెన్స్ కు ఈ సినిమా రీచ్ అవుతుంది. నాని ఎందుకీ సినిమా చేశాడు అని సందేహాలు రేకెత్తిస్తూనే ఫ్యామిలీ ఎమోషన్లు.. సెంటిమెంట్ తో కనెక్టయ్యే వారికి ఓకే అనిపిస్తుంది ‘టక్ జగదీష్’.

ఈ ఫాస్ట్ ఫార్వార్డ్ యుగంలో ఫ్యామిలీ సెంటిమెంట్లను నమ్ముకుని సినిమాలు తీయడం కంటే పెద్ద సాహసం మరొకటి లేదు. అవి అటు ఇటు అయితే ఎలా ఉంటుందో ‘బ్రహ్మోత్సవం’ లాంటి కొన్ని చిత్రాలు రుజువు చేశాయి. మెలో డ్రామా ఏమాత్రం ఎక్కువైనా.. కథనం నెమ్మదించినా.. సెంటిమెంట్ డోస్ పెరిగినా. ‘సీరియల్’ అని ముద్ర వేసేస్తారు జనాలు. ఇలాంటి కాలంలో ‘ఆస్తుల కంటే బంధాలు గొప్పవి’ అనే దశాబ్దాల కిందటి థీమ్ తో ‘టక్ జగదీష్’ తీసే సాహసం చేశాడు శివ నిర్వాణ. కథ సంగతి ఎలా ఉన్నా టైటిల్ చూసి ఇందులో ఏదో చమత్కారం ఉంటుందని.. ఫ్యామిలీ ఎమోషన్లకు తోడు వినోదానికీ స్కోప్ ఉంటుందని ఆశిస్తే నిరాశ తప్పదు. టైటిల్ వెనుక చెప్పుకోదగ్గ స్టోరీ ఏమీ లేదు. దాని చుట్టూ సరదా సన్నివేశాలు కానీ ఏమీ లేవు.

అసలు ఈ పేరును జస్టిఫై చేసే సరైన సీన్ కూడా పడలేదు. మొత్తంగా ‘టక్ జగదీష్’లో ఎంటర్టైన్మెంట్ కు పెద్దగా స్కోపే లేకపోయింది. మాస్ ఆడియన్స్ కు నచ్చేలా కొన్ని హీరో ఎలివేషన్లు.. మాస్ సీన్లకు తోడు చాలా వరకు ఫ్యామిలీ ఎమోషన్లు.. డ్రామా మీదే కథ నడుస్తుంది. దీనికి తోడు భూమి.. ఆస్తి తగాదాలు అంటూ రొటీన్ థ్రెడ్ తీసుకున్నాడు దర్శకుడు. దీంతో సినిమా అంతా కూడా మనకు తెలిసిన తరహాలో.. చాలా సీరియస్ గా నడిచిపోతుంది. చాలా వరకు ‘జస్ట్ ఓకే’ అనిపిస్తూ నడిచిపోతుంది సినిమా. అంతే తప్ప ‘వావ్’ అనిపించే అంశాలు మాత్రం లేవు.

తొలి అరగంటలో ‘టక్ జగదీష్’ చాలా మామూలుగా సాగిపోతుంది. తెరనిండా మనుషులు కనిపిస్తూ.. ఊర్లో గొడవలు.. కుటుంబ బంధాల నేపథ్యంలో చాలా సాదాసీదాగా సన్నివేశాలను నడిపించేశారు. దీంతో కథలో ఏదో ఒక మలుపు కోసం ఎదురు చూడటం మొదలవుతుంది. ఐతే నాజర్ పాత్రను ముగిస్తూ ఫ్యామిలీ డ్రామాను రక్తి కట్టించడానికి దర్శకుడు వేసిన ఎత్తుగడ బాగుంది. తండ్రి ఉన్నంత వరకు చాలా మంచోడిగా కనిపిస్తూ.. ఆయన మరణించగానే తన నిజ స్వరూపాన్ని చూపించి కుటుంబంలో కల్లోలం రేపే జగపతిబాబు పాత్ర ఒక దశలో అమితాసక్తిని రేకెత్తిస్తుంది.

అలాగే ఊరిలోనూ ఒక్కసారిగా సమస్యలు పెరిగిపోవడం.. ఈ నేపథ్యంలో హీరోకు పెద్ద టాస్క్ ఎదురు కావడం. అంతలోనే హీరో హఠాత్తుగా ఎమ్మార్వోగా మారి విలన్లను ఢీకొట్టడానికి సిద్ధం కావడంతో కథ రసపట్టులో పడ్డట్లే కనిపిస్తుంది. హీరో ఎమ్మార్వో అయ్యాక విలన్ల ఆటకట్టించే వరకు ‘టక్ జగదీష్’ ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చస్తుంది. కొన్ని సీన్లు మాస్ ప్రేక్షకులకు బాగానే కనెక్టవుతాయి.

ఈ ఊపును కొనసాగించి ఉంటే ‘టక్ జగదీష్’ చివర్లో మంచి ఫీలింగే ఇచ్చి ఉండేది. కానీ ప్రి క్లైమాక్స్ ముంగిట కథ.. పూర్తిగా ఫ్యామిలీ డ్రామా.. సెంటిమెంట్ల మీదికి షిఫ్ట్ కావడంతో వస్తుంది సమస్య. హీరోను అతడి కుటుంబ సభ్యులు వేరుగా చూడటం.. అతణ్ని అపార్థం చేసుకోవడం.. ఇవన్నీ కూడా అంత సహజంగా అనిపించవు. మెలో డ్రామా మరీ ఎక్కువైపోయింది.

సాధారణంగా ఇలాంటి కథల్లో ప్రి క్లైమాక్స్ కు రాగానే హీరోను అందరూ అపార్థం చేసుకోవడం.. చివరికో పెద్ద ఫైట్.. ఆఖరికి అందరిలోనూ రియలైజేషన్ రావడం చాలా కామన్. ‘టక్ జగదీష్’ అచ్చంగా ఆ ఫార్ములాను ఫాలో అయిపోయింది. ఫోర్స్డ్ ఎమోషన్ల కారణంగా చివరి అరగంట గ్రాఫ్ పడిపోయింది. జగపతి బాబు పాత్రకు మధ్యలో మంచి ఎలివేషన్ ఇచ్చి.. తర్వాత దాన్ని తేల్చేశారు. అక్కడ కథ కొంచెం పలుచనైపోయింది. ఆరంభంలో అరగంట సాధారణంగా అనిపించి.. తర్వాత మధ్యలో పుంజుకునే ‘టక్ జగదీష్’ చివరి అరగంటలోనూ కొంత నిరాశకు గురి చేస్తుంది. మధ్యలో పైసా వసూల్ సినిమాలా అనిపించినా.. చివర్లో ఓవర్ డోస్ ఫ్యామిలీ సెంటిమెంట్ కారణంగా గ్రాఫ్ తగ్గి ఒక మామూలు సినిమా చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది. ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడే వాళ్లకు ‘టక్ జగదీష్’ ఓకే. కొత్తదనం.. వేగం.. వినోదం కోరుకునే వారిని ఇది నిరాశకు గురి చేయొచ్చు. నాని అభిమానులు అతడి నుంచి ఆశించే తరహా సినిమా కాకపోయినా.. అతడి పెర్ఫామెన్స్ కోసం ఓ లుక్కేయొచ్చు.

నటీనటులు:

పాత్ర ఎలా ఉన్నా.. కథ ఎలాంటిదైనా తన వంతుగా సిన్సియర్ పెర్ఫామెన్స్ ఇవ్వడానికి చూసే నాని.. ‘టక్ జగదీష్’లోనూ అదే చేశాడు. ఏ సన్నివేశంలోనూ నాని నిరాశ పరచలేదు. ఎప్పట్లాగే ఎమోషనల్ సీన్లలో నాని తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈసారి తన పాత్రకు అతను మాస్ టచ్ ఇచ్చాడు. ఐతే ఎక్కువగా పక్కింటి కుర్రాడి పాత్రల్లో కనిపించే నానికి ఇందులోని బిల్డప్ షాట్లు.. ఎలివేషన్లు కొంచెం నప్పనట్లే అనిపిస్తాయి.

ఇందులో ‘కొత్త నానిని చూస్తారు’ అన్న నాని మాటల ఆంతర్యం ఇదా అనిపిస్తుంది. గుమ్మడి వరలక్ష్మి పాత్రలో రీతూ వర్మ బాగానే చేసింది. కానీ ఆమె పాత్ర ఏమంత కొత్తగా అనిపించదు. జగపతిబాబు పాత్ర.. నటన జస్ట్ ఓకే. ఇలాంటి పాత్రలు ఆయనకు కొత్తేమీ కాదు. మధ్యలోకి వచ్చేసరికి ఈ పాత్ర స్వరూపం మారి ఆసక్తికరంగా అనిపిస్తుంది కానీ.. తర్వాత దాన్ని తేల్చేశారు. జగపతి లుక్.. మేకప్ కూడా సరిగా కుదరలేదు. ఐశ్వర్య రాజేష్ బాగా చేసింది. రావు రమేష్.. నరేష్ లకు వారి స్థాయికి తగ్గ పాత్రలు ఇవ్వలేదు. తమిళ నటుడు డేనియల్ బాలాజిని తీసుకొచ్చి చేయించేంత ప్రత్యేకత ఉన్నదేమీ కాదు విలన్ క్యారెక్టర్. నాజర్.. రోహిణి.. దేవదర్శిని.. ప్రవీణ్.. తిరువీర్.. వీళ్లంతా ఓకే.

సాంకేతిక వర్గం:

‘టక్ జగదీష్’ టెక్నికల్ గా ఓకే అనిపిస్తుంది. తమన్ పాటల్లో ‘ఇంకోసారి’ ఇంకోసారి వినాలనిపించేలా ఉంది. మిగతా పాటలు పర్వాలేదు. సాంగ్స్ అన్నీ కూడా పల్లెటూరి వాతావరణంలో జనాల సందడి మధ్య చిత్రీకరించడం వల్ల కలర్ ఫుల్ గా అనిపిస్తాయి. గోపీసుందర్ నేపథ్య సంగీతం ఓకే. పాటల్లోనే కాక సినిమా అంతటా కూడా ప్రసాద్ మూరెళ్ల ఛాయాగ్రహణం బాగా సాగింది.

ఈ కథకు అవసరమైన తరహాలోనే విజువల్స్ ఉన్నాయి. నిర్మాతలు హరీష్ పెద్ది.. సాహు గారపాటి ఖర్చు విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు. బోలెడంతమంది ఆర్టిస్టులు.. అందమైన లొకేషన్లు.. సెట్టింగ్స్ తో ప్రతి సన్నివేశంలోనూ రిచ్ నెస్ చూపించారు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ శివ నిర్వాణ విషయానికి వస్తే.. అతడి నుంచి ప్రేక్షకులు ఆశించే సినిమా కాదిది. తొలి రెండు చిత్రాల్లో ప్రేమకథలకు ‘ఫ్యామిలీ’ టచ్’ ఇచ్చిన శివ.. ఈసారి ఫ్యామిలీ డ్రామాకు ‘మాస్’ టచ్ ఇవ్వాలని చూశాడు. ఈ విషయంలో ఓ మోస్తరుగా విజయవంతం అయ్యాడు. ఇందులో అతడి ముద్రంటూ ఏమీ కనిపిచంలేదు. తన శైలితో పోలిస్తే ఇది డిఫరెంట్ మూవీ అని ట్రై చేశాడేమో కానీ.. కథాకథనాల విషయంలో కొత్తదనం చూపించలేక తనపై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయాడు. ఫ్యామిలీ ఎమోషన్లను అతను మరింత బాగా డీల్ చేసి ఉండాల్సిందనిపిస్తుంది.

చివరగా: టక్ జగదీష్.. ఓల్డ్ స్కూల్ ఫ్యామిలీ డ్రామా

రేటింగ్-3/5

Tags: # Ritu Varma#Aishwarya Rajesh#Amazon Prime#Directed by Shiva Nirvana#FILM NEWS#Nani#Nassar#Rohini#THAMAN#TOLLYWOOD#TUCK JAGADISH#Tuck Jagadish #Movie Review₹Jagapathi Babu
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info