thesakshi.com : ఏపీలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. ఇప్పటికే జనసేన సహా.. కేఏ పాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీలు ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు మరో కొత్త పార్టీ పురుడు పోసుకునేందుకురెడీ అయింది. అదే.. ‘జై భీమ్ భారత్’ పార్టీ. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని.. ఏప్రిల్ 14(గురువారం) నేడు పార్టీని ప్రారంభించనున్నారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది… ‘జై భీమ్ యాక్సెస్ జస్టిస్’ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ నేతృత్వంలో ఈ పార్టీ పురుడు పోసుకోనుంది.
ఇప్పటి వరకు న్యాయవాదిగా.. జడ శ్రావణ్కుమార్ గుర్తింపు పొందారు. రాజధాని రైతుల కేసులు సహా.. విశాఖలో డాక్టర్ సుధాకర్ కేసును.. ఎస్సీలకు సంబంధించిన కేసులను విచారించిన జడ శ్రావణ్కుమార్.. ఆయా కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించి.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదేసమయంలో బాధితుల పక్షాన కూడా నిలిచారు. ఇప్పుడు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారానికి ఒక పార్టీ కావాలనే లక్ష్యంతో ఆయన జై భీమ్ భారత్ రాజకీయ పార్టీని స్థాపిస్తున్నారు.
ఈ నెల 14న విజయవాడ కేంద్రంగా ‘జై భీమ్ భారత్’ రాజకీయ పార్టీ ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించను న్నట్టు తెలిపారు. ప్రజలు తమ హక్కులను స్వేచ్ఛగా పొందేందుకు అవినీతి లేని పాలన సాగించేందుకు వారసత్వ కుటుంబపాలనకు చరమగీతం పాడేందుకు కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు శ్రావణ్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత రాష్ట్ర ప్రభుత్వానికి లేదని విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థులు ప్రజలకు ఆయా కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేయలేని రాష్ట్ర ప్రభుత్వం 70శాతం పదవులు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. కాగా జడ శ్రావణ్కుమార్ ఏర్పాటు చేస్తున్న పార్టీ.. ఎస్సీ ఎస్టీ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. ముఖ్యంగా విద్యార్థి సంఘాలు.. యువజన సంఘాలు.. రైతు సంఘాలు ఈ పార్టీకి అండగా ఉండే అవకాశం ఉందని.. విశ్లేషణలు వస్తున్నాయి.