thesakshi.com : 2019లో జగన్ పాదయాత్ర, ఆయన హామీలు చూసి వైసీపీకి ఘన విజయం కట్టబెట్టారు ప్రజలు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉండకూడదని, వైసీపీ ఎమ్మెల్యేలుగా ఎవరికి వారు సొంత ఇమేజ్ పెంచుకోవాలని, పార్టీ పరపతి పెంచాలనేది జగన్ సూచన. దీన్ని పాటిస్తున్నవారు ధీమాగా ఉన్నారు, అలసత్వంతో ఉన్నవారు ఇప్పుడిప్పుడే అలర్ట్ అవుతున్నారు.
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉన్నా కూడా కాక అపుడే మొదలైపోయింది. సాధారణంగా విపక్షాలు ఎన్నికలకు ఆత్రపడతాయి. కానీ ఏపీలో చూస్తే అధికార పక్షంలోనే ఎక్కువ ఆరాటం కనిపిస్తోంది. ఇక తాము గెలిచే నంబర్లు ఇన్నీ అని ప్రతిపక్షాలు చెప్పుకోవడం కామన్.
ఎందుకంటే క్యాడర్ చెదిరిపోకుండా చూసుకోవడం పార్టీలో ఆత్మవిశ్వాసం నింపడం కోసం వ్యూహాత్మకంగా వేసే ఎత్తుగడ అది. కానీ అధికారం చేతిలో ఉన్నా కూడా వైసీపీ 175 సీట్లు మావే అంటోంది. స్వయంగా జగన్ ఈ నంబర్ చెప్పి పార్టీ పెద్దలకు షాక్ ఇచ్చేశారు.
ఏపీలో చూస్తే పరిస్థితి అలా ఉందా అన్నదే ఇపుడు చర్చ. ఇక దీని మీద టీడీపీ నాయకులు అయితే పదిహేడున్నర సీట్లు వస్తే అదే గొప్ప అంటున్నారు. మరి ఈ అర సీటు ఏంటో. ఇక చంద్రబాబు అయితే ఏపీ జనాల నెత్తిన కుంపటిలా వైసీపీ తయారైంది. దాన్ని ఎపుడెపుడు దించుకుందామని వారు చూస్తున్నారు అని అంటున్నారు.
అలాంటిది మళ్ళీ గెలుపా అది కలలో మాట అని కూడా బాబు మండిపడుతున్నారు. ఇంకో వైపు టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు అయితే 160 సీట్లు మా పార్టీకి వస్తాయని అంటున్నారు. దాని మీద వైసీపీ నేతలు ఇదే రకంగా సెటైర్లు వేస్తున్నారు. అన్ని సీట్లు మీకు వస్తాయన్న ధీమా ఉంటే ఈ పొత్తుల కధలేంటి తమ్ముళ్ళూ అని వెటకారం చేస్తున్నారు.
ఇక మాజీ మంత్రి కొడాలి నాని అయితే 175 సీట్లకు పోటీ పెట్టగల దమ్ము టీడీపీకి ఉందా అని సవాల్ చేశారు. ఏపీలో వైసీపీకి పూర్తి వ్యతిరేకత ఉంటే అంతా కలసి పొత్తులు పెట్టుకుని మూకుమ్మడిగా వైసీపీ మీద దాడి చేయడం ఎందుకు అని కూడా ఫైర్ అయ్యారు.
సరే అటూ ఇటూ నంబర్ గేమ్ ఇపుడు సాగుతోంది. ఇది మైండ్ గేమ్ కూడా అని చెప్పుకోవచ్చు. తమకే జనం బలం ఉందని అటూ ఇటూ అంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో రియాలిటీ చూస్తే అధికార వైసీపీకి వ్యతిరేకత గట్టిగానే ఉంది. మూడేళ్ళ పాలన పూర్తి కాకముందే జనాల్లో వ్యతిరేకత రావడం అంటే అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే.
ఇక ఇంకో వైపు చూస్తే ప్రభుత్వం మీద స్వల్ప వ్యతిరేకత ఉన్నా టీడీపీకి అది ప్లస్ అయ్యే అవకాశం కనిపించడంలేదు. టీడీపీకి ఈ వ్యతిరేకత ఫేవర్ గా మారడంలేదు. ఆ దిశగా టీడీపీ కూడా మూడేళ్ళుగా ఎత్తిగిల్లింది లేదు అని అంటున్నారు. టీడీపీలో ఇంకా గెలుపు డౌట్లు ఉన్నాయి. అలాగే జనాలకు కూడా వైసీపీకి ఆల్టర్నేట్ గా టీడీపీని మళ్లీ నెత్తికెత్తుకుందామన్న ఆలోచన అయితే ఇప్పటికి కలగకపోవడం ఏపీలో రాజకీయ చిత్రమే.
దానికి కారణం 2014 నుంచి 2019 దాకా సాగిన టీడీపీ పాలన ఏమీ గొప్పగా లేకపోవడం. అలాగే కరెంట్ కోతలు లేవు రోడ్లు బాగున్నాయి. ఇలాంటి ఇష్యూస్ తోనే టీడీపీ మీద కొంత సానుకూలత ఏర్పడుతోంది.
ఇక వైసీపీ విషయం తీసుకుంటే స్వల్ప వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈ రోజుకీ సరైన ఆల్టర్నేషన్ లేకపోవడమే ఎంతో కొంత కలసివచ్చే అవకాశంగా ఉంది. మరి వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలసి పోటీ చేస్తే జనాల మూడ్ ఎలా మారుతుందో చూడాలి. ఈ రోజుకైతే వైసీపీ 151 సీట్లలో కొన్ని కోల్పోయినా అధికారాన్ని నిలబెట్టుకునే స్థితిలో మాత్రం ఉంది. అయితే ఇంకా రెండేళ్ల పాలన సాగాల్సి ఉంది. దాంతో అప్పటికి ఏ రకమైన పరిణామాలు జరుగుతాయో చూడాలి. ఇక ఎపుడు ఎన్నికలు జరిగినా వైసీపీకి 175 సీట్లూ రావు టీడీపీకి 160 సీట్లు అంతకంటే రావు ఇదంతా పొలిటికల్ హైప్ మాత్రమే అన్నా మాట ఉంది .