thesakshi.com : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సీఎం జగన్ ను టార్గెట్ చేసారు. ఈ మధ్య కాలంలో సీఎం జగన్ నిర్ణయాలనకు వరుసగా తప్పు బడుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మద్యం ఆదాయం పైన బాండ్ల అమ్మకం నిర్ణయం తీసుకోవటం పైన ట్వీట్ చేసారు. దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయాల మేర ఆదాయం సమకూర్చటం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల పైన పవన్ కళ్యాణ్ ట్వీట్ లో సెటైరికల్ గా స్పందించారు. అదే సమయంలో బైబిల్ సూక్తిని ప్రస్తావించటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తాం
చిన్న గమనిక: సారా బట్టీలు,బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే. ఆ అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వారికే..సామెతలు 12:22
అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు https://t.co/cthy29YWc5— Pawan Kalyan (@PawanKalyan) June 12, 2022
కొద్ది రోజుల క్రితం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలోనూ జగన్ బైబిల్ చదువుతారు కానీ, అందులోని సూక్తులు పాటించరంటూ ఎద్దేవా చేసారు. తాను చిన్నప్పుడు తన టీచర్ చెప్పిన బైబిల్ సూక్తి మేరకు తగ్గటం నేర్చకున్నానని వివరించారు. ఇక, ఇప్పుడు తాజాగా చేసిన ట్వీట్ లో ..రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తామన్నట్లు పరిస్థితి తయారైందని పవన్ కల్యాణ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
దీనికి … అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు.. సత్యవర్తనులు ఆయనకిష్టులు అంటూ బైబిల్ సూక్తిని ట్వీట్‌లోజోడించారు. జగన్ పైన రాజకీయంగా టార్గెట్ చేస్తూనే.. పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో తరచూ బైబిల్ సూక్తులను ప్రస్తావించటం.. జగన్ తో లింకు పెట్టటం ఏంటనే చర్చ మొదలైంది.
గతంలో లేని విధంగా పవన్ కళ్యాణ్ కులాలు – ప్రాంతాల గురించి ఈ మధ్య కాలంలో తరచూ ప్రస్తావిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలను రాజకీయంగా ఇక వైసీపీ మరిచిపోవచ్చంటూ చెప్పుకొచ్చారు. పొత్తుల పైన మూడు ఆప్షన్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్..ఇప్పుడు బస్సు యాత్రకు డిసైడ్ అయ్యారు.
తన మూడు ఆప్షన్ల పైన ఇప్పటి వరకు టీడీపీ నుంచి అధికారిక స్పందన లేదు. అటు చంద్రబాబు జిల్లాల యాత్ర చేస్తున్న సమయంలోనే.. పవన్ సైతం బస్సు యాత్రకు డిసైడ్ అయ్యారు. దీంతో..ఏపీ రాజకీయాలు ఇప్పుడు సీఎం జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. మరి..వైసీపీ ఈ విమర్శల పట్ల ఏ రకంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.