thesakshi.com : ఏపీ ప్రభుత్వం సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు పెట్టేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆత్మకూర్ నియోజకవర్గంలోని సంగం బ్యారేజీకి ఈ ఏడాది ఫిబ్రవరి 21న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుపెట్టి తెలుగుగంగ చీఫ్ ఇంజనీర్ ప్రత్యేక జీవో జారీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని పూర్తి చేయాలని కోరగా, ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన మేరకు బ్యారేజీకి ఆయన పేరు పెట్టారు. ఈ మేరకు ‘మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ’గా నామకరణం చేస్తూ ఇంజినీరింగ్ విభాగం అధికారులు మంగళవారం ప్రత్యేక జీవో 13ను విడుదల చేశారు.
సోమశిల జలాశయం నుంచి వృథాగా పోతున్న నీటిని తరలించేందుకు 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సంగెం వద్ద బ్యారేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2014 నాటికి 50 శాతం పనులు పూర్తయ్యాయి.టీడీపీ హయాంలో బ్యారేజీ పనులు మందగించాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో ప్రాజెక్టు పనులు వేగవంతం అయ్యాయి. ముఖ్యంగా మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సంగం బ్యారేజీ ఉండడంపై ఆయన ఆసక్తిగా ఉన్నారు.
సంగం బ్యారేజీ పనులు 95 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. మరోవైపు ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి త్వరలో ప్రారంభించనున్నారు.