thesakshi.com : వైసీపీ అంటే ఏకశిలాసదృశం లాంటి పార్టీ అని అంతా చెబుతారు. ఆ పార్టీకి కర్త కర్మ క్రియ అన్నీ జగన్ అన్నది కూడా తెలిసిందే. పార్టీ పెట్టి పదకొండేళ్ళుగా జగన్ మాటే వేదం ఆయన బాటే మార్గం. ఆయన చెప్పిందే శిలాశాసనం. అలాంటి వైసీపీలో ఇపుడు చాలా స్వరాలు బయటకు వస్తున్నాయి. మలి విడత మంత్రి విస్తరణ ఏ రోజు అయితే జరిగిందో కానీ నాటి నుంచి పార్టీలో అసమ్మతులు బాహాటం అవుతున్నాయి.
గతంలో నోరు విప్పాలంటే కూడా ఆలోచించేవారు ఇపుడు బయటపడిపోతున్నారు. గట్టిగా మాట్లాడితేఏమవుతుంది అన్న ధైర్యమే వారిని అలా చేస్తోంది. ఇక గతంలో అయితే పార్టీ వ్యతిరేకమైన మాట అంటే చాలు వారి మీద గట్టి చర్యలు ఉండేవి. వారి వాదన కూడా వినే పరిస్థితి కనిపించేది కాదు. కానీ ఈసారి అలా జరగలేదు. పార్టీని తిట్టి జగన్ని విమర్శించిన వారిని సైతం అధినాయకత్వం బుజ్జగించింది.
నెల్లూరులో అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతలే బలప్రదర్శనకు దిగడం గమనార్హం. వెయ్యి మంది పోలీసులతో నెల్లూరులో శాంతిభద్రతలను పర్యవేక్షించాలని నిర్ణయించు కోవడమే బలప్రదర్శనకు నిదర్శనంగా చెబుతున్నారు.
కాకాణి, అనిల్‌కుమార్ మధ్య గత కొంత కాలంగా విభేదాలున్నాయి. అనిల్ మంత్రిగా కొనసాగే సమయంలో తన నియోజకవర్గంలో కాకాణి అడుగు పెట్టనివ్వలేదు. అందుకు ప్రతీకారంగా తాను కూడా కాకాణిని నెల్లూరులో అడుగు పెట్టనివ్వద్దనే పట్టుదలతో అనిల్ ఉన్నారని సమాచారం. మంత్రి, మాజీ మంత్రి మధ్య విభేదాలు, చివరికి ఇరు నాయకుల అనుచరులు పరస్పరం ఘర్షణ దిగే వరకూ దారి తీస్తుందేమో అనే ఆందోళన లేకపోలేదు.
ఒకపుడు కాంగ్రెస్ లో ఉన్న కల్చర్ ఇపుడు వైసీపీలోనూ కనిపిస్తోంది. కాంగ్రెస్ లో వర్గాలు ఉంటాయి. వారూ వీరూ బయటకు వచ్చి మరీ మాటల దాడులు చేసుకుంటారు. ఒకే పార్టీలో ఉన్నా కూడా ఒకరి కార్యక్రమాలకు మరొకరు వెళ్ళేవారు కాదు ఇపుడు నెల్లూరులో జరుగుతున్నది అదే.
పార్టీ నిర్ణయమే శిరోధార్యం అని చెప్పిన మాజీ మంత్రి అనిల్ కుమార్ తన నియోజకవర్గంలో సభ పెట్టారు. అది కూడా మంత్రిగా ప్రమాణం చేసి జిల్లాకు తొలిసారి కాకాణి గోవర్ధనరెడ్డి వస్తున్న వేళ. ఇక కాకాణీకి వడ్డీతో సహా సాయం చేస్తాను అని అనిల్ ఇప్పటికే చెప్పిన నేపధ్యంలో ఈ ఇద్దరు మధ్య సమరం వీధిన పడింది అనే అంటున్నారు.
ఇక్కడే అధినాయకత్వం గురించి చెప్పుకోవాలి. ఇద్దరినీ మీటింగులు పెట్టుకోమని చెప్పేసింది. అయితే ఎవరూ హద్దులు దాటవద్దంటూ సూచనలు చేసింది. నిజంగా ఒకే పార్టీలో ఒకే రోజు రెండు మీటింగులు ఏంటి. ఎవరో ఒకరిని ఆపవచ్చు కదా. కానీ ఇక్కడ వైసీపీ ప్రాంతీయ పార్టీ. జగన్ వంటి బలమైన నాయకుడు ఉండగానే ఇలా చేస్తున్నారు అంటే చాలా ఆలోచించాలి.
మరో వైపు చూస్తే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు జిల్లా హద్దులు గీసి మరీ కొత్త మంత్రికి ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి. విశాఖ జిల్లాకు రావద్దు నీవు అనకాపల్లి మంత్రివే అంటున్నట్లుగా భోగట్టా. ఒకరు మంత్రిగా అయ్యాక రాష్ట్రానికి ఉంటారు కానీ జిల్లాలకు ఉంటారా. ఆ మాటకు వస్తే అవంతి విశాఖ నుంచి గెలిస్తే జిల్లా అంతటా తిరిగారు కదా. మరి అవంతి అసహనం ఇలా ఉంటే కొత్త మంత్రి చిక్కుల్లో పడుతున్నా హై కమాండ్ పట్టించుకోదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
జిల్లాల్లో గ్రూపులు కట్టడం ప్రత్యర్ధి పార్టీల కంటే ఘాటుగా సొంత పార్టీ వారిని విమర్శించడం ఇవన్నీ వైసీపీకి చేటు తెచ్చేవే అంటున్నారు. చాలా జిల్లాలలో ఇపుడు ఇదే తీరు ఉందని అంటున్నారు. ఇలా కనుక కొనసాగితే వైసీపీ ఇబ్బంది పడడం ఖాయమని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీలో ఇపుడు లేనిది భయం అన్న మాట గట్టిగా ఉంది. హై కమాండ్ ని లైట్ తీసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. మరి దీనికి విరుగుడు మంత్రం హై కమాండ్ వద్ద ఉంది .. వెయిట్ అండ్ సీ.