thesakshi.com : పెగాసెస్‌ను ప్రభుత్వాలకే అమ్మామని చెబుతున్న ఎన్‌ఎస్‌ఓ
మోడీ సర్కార్ కొనుగోలు చేయకపోతే ఇక్కడి ఫోన్లలో ఎలా చొరబడింది?
సంచలనం సృష్టిస్తున్న ‘ద వైర్’ పరిశోధనాత్మక వార్తా కథనాలు
ప్రతిపక్షాల ప్రభుత్వాలు కూల్చేందుకు, రాజకీయ కుట్రలకు స్పైవేర్ వాడకం
2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుకోసం ‘పెగాసెస్’ను వాడిన మోడీ సర్కార్
మోడీ సర్కార్ అక్రమ నిఘా కార్యకలాపాల గుట్టురట్టు చేసిన ‘ద వైర్’ వరుస వార్తా కథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. మనదేశంలోని ఫోన్లపై పెగాసెస్ (స్పైవేర్) దాడి జరిగిందన్నది నిజం.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రభుత్వాలు మాత్రమే ఈ స్పైవేర్‌ను కొనుగోలు చేయగలవు. అలాంటప్పుడు భారత్‌లో మోడీ సర్కార్ కొనుగోలు చేయకుండా, ఇక్కడి ఫోన్లలో స్పైవేర్ ఎలా చొరబడుతుందని ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో నిలదీస్తున్నాయి.
ప్రశ్నించే గొంతుల్ని నిర్వీర్యం చేయడానికి, ప్రతిపక్షాల ప్రభుత్వాల్ని కూల్చడానికి, ఎన్నికల ఫలితాల్ని తారుమారు చేయడానికి అక్రమ నిఘా వ్యవహారం నడిచిందని ‘ద వైర్’ వార్తా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ స్పైవేర్‌ను భారతదేశంలో ప్రతిపక్ష నాయకులు, ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు, అధికారులు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, రచయితలు, మేధావులు, వారి కుటుంబ సభ్యులపై నిఘా విధించేందుకు ప్రయోగించారని తేటతెల్లమైంది.
ఇజ్రాయెల్ సంస్థ ‘ఎన్‌ఎస్‌ఓ’ ఈ పెగాసెస్ అనే స్పైవేర్ ను సృష్టించింది. ఈ ఎన్‌ఎస్‌ఓ ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. అదేమంటే..ఏ దేశంలోనైనా అక్కడి ప్రభుత్వాలకు మాత్రమే ఈ స్పైవేర్ అమ్మామని చెప్పింది. ఇజ్రాయెల్‌తో రాజకీయ, రక్షణ సంబంధాలు కలిగిన దేశాలకు ఎన్‌ఎస్‌ఓ తన స్పైవేర్‌ను అమ్మ గలిగింది. అందులో భారతదేశం కూడా ఉందన్నది కాదనలేని వాస్తవం.
ఎందుకోసం తయారుచేశారు?
ఉగ్రవాదుల, నేరస్థుల ఆచూకీని, రహస్యాలను కనిపెట్టేందుకు ఎన్‌ఎస్‌ఓ రూపొందించిన మిలటరీ గ్రేడ్ స్పైవేర్ ‘పెగాసెస్’. ప్రపంచంలో అత్యంత భద్రతా ప్రమాణాలు ఉన్న స్మార్ట్‌ఫోన్‌గా చెప్పుకునే ‘యాపిల్ ఐఫోన్’లోనూ పెగాసెస్ చొరబడగలదు.
ఇక మనదేశంలోని అత్యధిశక శాతం స్మార్ట్‌ఫోన్లలో ఉండే ఆపరేటింగ్ సిస్టం గూగుల్ లేదా ఆండ్రాయిడ్. వీటిలోనూ సులభంగా పెగాసెస్ చొరబడుతుంది.
మూడేండ్ల క్రితం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన యాపిల్ ఫోన్‌లో స్పైవేర్ చొరబడిందని అనుమానం వచ్చి..ఆ ఫోన్‌ను మార్చాడు. తర్వాత ఆయన వాడిన రెండో ఐఫోన్‌లోనూ పెగాసెస్ చొరబడిందని ‘ద వైర్’ బయటపెట్టింది.
ఎప్పట్నుంచీ మొదలైంది?
యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ)కి చెందిన హక్కుల కార్యకర్త అహమద్ మన్సూర్ వాడుతున్న ఐఫోన్‌లో కొన్ని ఎస్‌ఎంఎస్‌లు రాగా, వాటిపై ఆయనకు అనుమానం కలిగింది. ఐటీ కంట్రోల్ ల్యాబ్‌కు తీసుకెళ్లి(సిటీజన్స్ ల్యాబ్) స్మార్ట్‌ఫోన్‌ను పరీక్షించగా..అందులో స్పైవేర్ చొరబడిందని తేలింది.
ఆ స్పైవేర్ ‘ఐపీ అడ్రస్’ కనుగొనగా..అది ‘ఎన్‌ఎస్‌ఓ గ్రూప్’ తయారుచేసినదేనని తెలిసింది. యూఏఈ ప్రభుత్వం ఆ స్పైవేర్‌ను కొనుగోలుచేసి 2013 నుంచి వాడుతోందని ‘న్యూయార్క్ టైమ్స్’, ‘ద టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ వార్తా కథనాలు రాశాయి.
సౌదీ అరేబియా జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీపైనా స్పైవేర్ ప్రయోగించారు. స్పైవేర్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే సౌదీ ప్రభుత్వం ఇస్తాంబుల్‌లో ఖషోగ్గీని హత్యచేయించింది.
పెగాసెస్ ఏం చేస్తుంది?
ఒక్కమాటలో చెప్పాలంటే మన చేతిలో ఉండే ఫోన్‌తోనే మనపైన ప్రభుత్వం నిఘా పెడుతుంది. స్మార్ట్‌ఫోన్, పర్సనల్ కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్, ట్యాబ్‌లలో ఈ స్పైవేర్(పెగాసెస్) అత్యంత సులభంగా చొరబడుతుంది. దాంతో నిఘా పెట్టిన ప్రభుత్వానికి కావాల్సిన సమాచారమంతా వెళ్తుంది.
సందేశాలు, ఫొటోలు, వీడియోలు, ఈమెయిల్స్, కాల్ డేటా, పాస్‌వర్డ్‌లు, ఇంటర్నెట్ బ్రౌస్ హిస్టరీ, జీపీఎస్ లొకేషన్..అంతా కూడా ప్రభుత్వానికి చేరుతుంది. మైక్రోఫోన్ ద్వారా సంభాషణను కూడా వినొచ్చు. కెమెరా ద్వారా ఫోన్ వాడుతున్న వ్యక్తుల్ని కూడా చూడొచ్చు. వాట్సాప్, టెలిగ్రాం, విచాట్, స్కైప్, ఐమెసేజ్, జీమెయిల్, ఐక్లౌడ్, ఫేస్‌బుక్‌లలో చొరబడి సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేస్తుంది.
తప్పించుకోలేమా?
డాటా ప్రొటెక్షన్‌లో నెంబర్‌వన్ స్మార్ట్‌ఫోన్‌గా చెప్పుకునే యాపిల్‌కు ‘పెగాసెస్’ పెద్ద సవాల్‌గా మారింది. అత్యంత అధునాతన స్పైవేర్‌లు చొరబడకుండా వెర్షన్ 9.3.5 ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టం రూపొందించామని యాపిల్ ఘనంగా ప్రచారం చేసుకుంది. ఎన్‌ఎస్‌ఓ సంస్థ స్పైవేర్‌ను కూడా అప్‌డేట్ చేసి వదిలింది. దాంతో యాపిల్ అప్‌డేట్ వెర్షన్‌లోనూ పెగాసెస్ గుట్టుచప్పుడు కాకుండా చొరబడింది. ఒక నిర్దిష్టమైన వ్యక్తి స్మార్ట్‌ఫోన్‌లో, నిర్దిష్టమైన కాలపరిమితిలో మాత్రమే ఈ పెగాసెస్‌ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత దానంతటదే అందులో నుంచి వెళ్లిపోతుంది. చొరబడి..వెళ్లిపోయిన సంగతి కూడా గుర్తించలేం.
ఇండియాలో ఎలా తెలిసింది?
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందే మనదేశంలోని ప్రతిపక్షాల రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, జర్నలిస్టులపై కేంద్రం నిఘా కార్యకలాపాలకు తెరలేపిందని ‘ద వైర్’ తాజా వార్త కథనాలు చెబుతున్నాయి. ఎన్నికలకు కొద్ది నెలల ముందే సంబంధిత వ్యక్తుల స్మార్ట్‌ఫోన్లలో పెగాసెస్ చొరబడిందనేందుకు ఆధారాలున్నాయి. ‘ఒక స్పైవేర్ మీరు వాడుతున్న వాట్సాప్‌లో చొరబడింది’ అని అక్టోబరు 30, 2019లో వాట్సాప్ నిర్దారించింది. వాట్సాప్ యాప్‌ను డిలీట్ చేసి…మళ్లీ అప్‌డేట్ (స్పైవేర్‌ను తొలగించడం కోసం) చేసుకోవాల్సిందిగా కోరింది. ఎవరెవరి ఫోన్లపై నిఘా పెట్టారని జాబితా బయటకు తీయగా..లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే వందలాది ప్రముఖులు అందులో ఉన్నారు.
పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు చేయటం కోసం ఎన్‌ఎస్‌ఓకు ఎంత చెల్లిస్తారు? అనేది కూడా బయటకొచ్చింది. 10 స్మార్ట్‌ఫోన్లపై నిఘా పెట్టడానికి 16 మిలియన్ యూరోపియన్ పౌండ్లు (సుమారుగా రూ.163కోట్లు) ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌నకు చెల్లించాలి. అదనంగా మరో 1.5 మిలియన్ పౌండ్లు (సుమారుగా రూ.15కోట్లు) చెల్లించినట్లయితే..15 పరికారాలపై(ఫోన్లు, పీసీ, ట్యాబులు) నిఘా పెడతారు. ఐదు దేశాల్లోని మరో 25 పరికరాలపై ఒకేసారి నిఘా పెట్టాలంటే అదనంగా 5.5 పౌండ్లు (రూ.56కోట్లు) చెల్లించాలి.