thesakshi.com : డ్రగ్స్ కేసులో రాజకీయవేత్త, వ్యాపారవేత్త అయిన డీకే ఆదికేశవులనాయుడు కుమారుడు డీకే శ్రీనివాస్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బెంగళూరు అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన వ్యాపార సామ్రాజ్యం కూడా కర్ణాటక రాజధాని బెంగళూరులోనే విస్తరించి ఉండటంతో ఆయన ఏపీ, కర్ణాటకలోను ప్రముఖుల్లో ఒకరుగా ఉన్నారు. డ్రగ్స్ కేసులో అధికారులు అరెస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి ఆయన సన్నిహిత మిత్రుడు.
బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో శ్రీనివాస్ తన మిత్రులతో కలిసి డ్రగ్స్ పార్టీ చేసుకుంటుండగా అధికారులు దాడిచేసి పట్టుకున్నట్లు సమాచారం. వెంటనే సదాశివనగర్‌లో ఉన్న శ్రీనివాస్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించగా అక్కడ కూడా డ్రగ్స్ దొరికడంతో అర్థరాత్రి సమయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు మరికొందరి ఇళ్లపై కూడా ఎన్‌సీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆంధ్ర, కర్ణాటకలోని రాజకీయవేత్తలు, సినీ ప్రముఖులకు శ్రీనివాస్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు, వారితో సన్నిహిత సంబంధాలున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. డ్రగ్స్ ను తెప్పించి ఆయన విక్రయిస్తున్నారా? లేదంటే కేవలం డ్రగ్స్ తీసుకుంటున్నారా? అనే కోణంలో ఎన్సీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
దివంగత ఆదికేశవుల నాయుడు తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. ఒకసారి పార్టీ విప్‌ను ధిక్కరించి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. దీంతో పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆదికేశవుల నాయుడు మరణించిన తర్వాత ఆయన కుటుంబం మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరింది. ఆదికేశవులనాయుడి భార్య సత్యప్రభ 2014 ఎన్నికల్లో చిత్తూరు నుంచి పోటీచేసి ఘనవిజయం సాధించారు. అలాగే 2019 ఎన్నికల్లో రాజంపేట లోక్‌సభకు పోటీచేసి ఓటమి పాలయ్యారు. అప్పటినుంచి ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వస్తోంది.