thesakshi.com : ఏలూరు జిల్లాలోని అక్కిరెడ్డిగూడెం రసాయన పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఐదుగురు ఘటనా స్థలంలోనే సజీవదహనం కాగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరో 13 మందికి తీవ్రగాయాలు కాగా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. పరిస్థితి విషమంగా మారిన వారిని విజయవాడ జిజిహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో విధుల్లో మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఆస్పత్రికి తరలించిన వారిలో ఐదుగురు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. వారి శరీరం దాదాపు 80 శాతం కాలి పోయినట్లుగా వైద్యులు చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఆస్పత్రికి చేరుకొని బోరున రోదిస్తున్నారు. తమ వారిని ఎలాగైనా బ్రతికించమని, మెరుగైన వైద్యం అందించాలని వారు వైద్యులకు విజ్ఞప్తి చేస్తున్నారు. క్షతగాత్రుల, కుటుంబ సభ్యుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం అత్యంత బాధాకరంగా కనిపిస్తుంది. ముసునూరు మండలంలో పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ లో చోటుచేసుకున్న ఈ ఘోర అగ్ని ప్రమాదం పట్ల ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం లోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాద ఘటనపై తెలుగుదేశం పార్టీ స్పందించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా, ముసునూరు మండలం, అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాదం దురదృష్టకరం అని ఆయన పేర్కొన్నారు.
అత్యంత విషాదకరమైన ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చంద్రబాబు వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
పోలీస్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాద ఘటనపై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాద ఘటన కలచివేసిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని కోరుతున్నాను అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ఇచ్చిన పరిహారాన్ని పోరస్ కెమికల్ బాధితులకు ఇవ్వాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అచ్చెన్నాయుడు కోరారు.
ఇదిలా ఉంటే పోరస్ పరిశ్రమలో అగ్నిప్రమాద ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలి ఆరుగురి సజీవ దహనం కావడం బాధాకరమని, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 12మందికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అలసత్వంతో వ్యవహరించడం వల్లనే ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని లోకేష్ పేర్కొన్నారు.
ఇటువంటి ఘటనలు అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను, ప్రమాదంలో గాయపడిన వారి కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో చోటుచేసుకుంటున్న ప్రమాదాలు అరికట్టడం కోసం ప్రభుత్వం ఇప్పటికైనా సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని లోకేష్ వెల్లడించారు.