thesakshi.com : కరెంట్ కొనుగోళ్లకు సంబంధించి ఒప్పందాలు ఏమైనా చేసుకున్నారా? ఉన్న ప్లాంట్స్ లో విద్యుత్ ఉత్పత్తి పెంచారా? బొగ్గు నిల్వల సామర్థ్యాన్ని పెంచుకున్నారా? లాంటి అంశాలపై ప్రభుత్వాలు వెంటనే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
కరెంటు చార్జీలు పెంచినా ప్రజలు తొందరగానే మరచిపోతారు, కానీ నిమిషంపాటు కరెంటు లేకపోతే మాత్రం దాన్ని బాగా గుర్తు పెట్టుకుంటారు. అందులోనూ పరీక్షల సీజన్ ఇది. రాత్రిపూట విద్యార్థులు గుడ్డిదీపాల వెలుగులో చదువుకోడానికి పడుతున్న ఇబ్బందులు పడుతున్నారు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరెంటు సంక్షోభం కొనసాగుతోంది. వేసవిలో విద్యుత్ కోతలతో జనం అల్లాడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అప్రకటిత కోతలతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా మారిన విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం కూడా ఇబ్బందులు పడుతోంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారిస్తోంది.
వివిధ రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం తలెత్తుతున్న నేపథ్యంలో బొగ్గు ర్యాక్ ల తరలింపును సులభతరం చేసేందుకు భారతీయ రైల్వే మరిన్ని రైళ్లను రద్దు చేసింది. చాలా థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు నిండుకుంటున్నాయి. దీంతో మరికొన్ని రోజులకు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేసే పరిస్ధితి ఉంది. ఇది వాస్తవ డిమాండ్‌కు అనుగుణంగా లేదు. దీంతో విద్యుత్‌ను ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా బొగ్గు తరలింపును ముమ్మరం చేస్తున్నారు. బొగ్గు ర్యాక్ ల తరలింపును సులభతరం చేయడానికి మే 24 వరకు కనీసం 1,100 రైళ్లు రద్దు చేశారు. దేశవ్యాప్తంగా వడగాల్పులతో తాజాగా విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. దీతో థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు కొరత ఏర్పడింది.
ఎక్స్‌ప్రెస్ మెయిల్ రైళ్లలో దాదాపు 500 ట్రిప్పులు, ప్యాసింజర్ రైళ్లలో 580 ట్రిప్పులు రద్దు చేసారు. దేశవ్యాప్తంగా కనీసం 400 ర్యాక్ ల రవాణాను సులభతరం చేయడానికి 240 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఏప్రిల్ 29న రైల్వే ప్రకటించింది. ఈ నెలలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది, అందుకే వివిధ రాష్ట్రాల్లోని విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు వీలైనంత ఎక్కువ బొగ్గును తరలించాలని రైల్వేశాఖను కోరింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బొగ్గు గని కార్మికులు సమ్మె చేయడంతో సమస్య జటిలమవుతోంది.