thesakshi.com : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలు పేరుతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో అమ్మఒడి ఒకటి. ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏడాదికి రూ.15వేల చొప్పున ప్రభుత్వం జమ చేస్తోంది.
సీఎం జగన్ మానస పుత్రిక అమ్మఒడి పథకం. నవరత్నాల్లో ప్రతిష్ఠాత్మకమైన పథకంగా జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే, ఇప్పుడు ఈ పథకం నిర్వహణలో కొత్తగా కొన్ని ఆంక్షలు అమల్లోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. ఈ పథకం ద్వారా పాఠశాలకు వెళ్లే విద్యార్ధి తల్లి ఖాతాలో ప్రోత్సాహకం కింద ఒక విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు అందిస్తున్నారు. ఇందులో రూ.1,000ని పాఠశాలల ఆయాల జీతాల కోసం మినహాయించి మిగతా రూ.14 వేలు ఇస్తున్నారు. ఈ పథకాన్ని ఐదేళ్లపాటు అందిస్తానని ప్రభుత్వం ప్రకటించింది.
అమ్మఒడి పథకంలో ఇప్పటి వరకూ 44లక్షల మంది తల్లులు లబ్ధిదారులుగా ఉన్నారు. తాజాగా వారి సంఖ్య మరో 2లక్షలు పెరిగింది. అంటే అమ్మఒడి విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టా, ముందుకు పోయినట్టా..?
నిధులు మిగుల్చుకున్నట్టా, ఉదారంగా ఆర్థిక సాయం చేస్తున్నట్టా..? ఈ లెక్కలు చూస్తే తేలిపోయే విషయానికి ఇంత రాద్ధాంతమెదుకు..? విద్యార్థులు మధ్యలో బడి మానేయకుండా ఉండేందుకే అమ్మఒడికి అటెండెన్స్ తో ముడిపెట్టామని చెప్పారు మంత్రి ఆదిమూలపు సురేష్.
ప్రభుత్వం నిజంగానే డబ్బులు మిగుల్చుకోవాలనుకుంటే ప్రైవేట్ స్కూల్స్ కి అమ్మఒడి కట్ అని చెప్పేసేది. కానీ అర్హులైన పేదలందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతోటే ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది, జగన్ అనుకున్నట్టుగానే దీన్ని అమలు చేస్తున్నారు.
అమ్మఒడి ఆర్థిక భారం అయినా కొనసాగిస్తున్నారు. డబ్బులు వృథా కాకూడదనే ఉద్దేశంతోటే.. పెద్ద తరగతుల పిల్లలకు ఆర్థిక సాయం స్థానంలో ల్యాప్ టాప్ లు ఇవ్వబోతున్నారు. దీనిపై కూడా బురద జల్లాలనుకోవడం ప్రతిపక్షాల అవివేకం.
ఓవైపు లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోంది అని ప్రభుత్వం గణాంకాలతో సహా వివరిస్తుంటే.. కరెంటు బిల్లులు, అటెండెన్స్ లు అంటూ ప్రతిపక్షం రాద్ధాంతం చేస్తోంది. అసలు అమ్మఒడి లాంటి ఓ పథకం గురించి కనీసం ఆలోచనే చేయలేకపోయారు చంద్రబాబు.. మరి అలాంటి పథకంపై లోకేష్ విమర్శలు చేయడం, పథకాన్ని అందరికీ అమలు చేయాలని ఉచిత సలహాలివ్వడం కామెడీ కాక ఇంకేంటి..?
జగన్ ప్రవేశ పెట్టిన నవరత్నాల పథకాల్లో అమ్మఒడి పథకానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ పథకం గతంలో ఎవ్వరూ ఎప్పుడూ ఊహించనిది, పూర్తిగా జగన్ ఆలోచన నుంచి వచ్చింది. దీంతో అమ్మఒడిపై ఎలాగైనా రాజకీయం చేయాలని చూస్తున్నాయి ప్రతిపక్షాలు.