thesakshi.com : నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును విద్వేష వ్యాఖ్యల కేసులో గతంలో ప్రభుత్వం అరెస్టు చేసింది. రాజద్రోహం కేసులు పెట్టింది. సీఐడీ పోలీసులు కస్టడీలో రఘురామను కొట్టినట్లు సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది. అయితే రాజద్రోహం కేసుల్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. దీంతో ఇతర సెక్షన్ల కింద విచారణకు సిద్దమవుతున్న సీఐడీ రఘురామకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.
ఎంపీ రఘురామకృష్ణంరాజు విచారణ విషయం మరోసారి హైకోర్టు లో నిర్ధారణ అయ్యింది. రఘురామ ఇంట్లోనే సీఐడీ విచారణ జరపాలని ఆయన తరపు న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరడాన్ని బట్టి ఎంతగా భయపడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. నిందితుడి ఇంట్లోనే విచారణ ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని సీఐడీ తరపు న్యాయవాది తేల్చి చెప్పారు. తీంతో మధ్యేమార్గంగా హైకోర్టు ఓ సూచన చేసింది.
రాజద్రోహం (సెక్షన్ 124ఏ)తోపాటు 153ఏ, 505, 120బి సెక్షన్ల కింద సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా ఆసక్తికర వాదనలు చోటు చేసుకున్నాయి. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ ఎంపీని సీఐడీ పోలీసులు దర్యాప్తు పేరుతో గతంలో తీవ్రంగా కొట్టారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
గతంలో రాజద్రోహం సహా ఇతర కేసుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించి షరతులతో బెయిల్ పొందిన రఘురామరాజును తిరిగి సీఐడీ విచారించలేదు. ఆ లోపే సీఐడీ నమోదు చేసిన కేసులన్నీ కొట్టేయాలంటూ రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన హైకోర్టు.. సీఐడీకి నోటీసులు పంపింది. దీంతో రఘురామపై విచారణ ఇంకా పూర్తి కాలేదని, సుప్రీంకోర్టు ఆయనకు షరతులతోనే బెయిల్ ఇచ్చిందని సీఐడీ హైకోర్టు దృష్టికి తెచ్చింది. దీంతో ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వస్తోంది.
గతంలో సీఐడీ కస్టడీలో తనపై జరిగిన దాడుల్ని సుప్రీంకోర్టు కూడా ప్రాధమికంగా నిర్ధారించిన నేపథ్యంలో మరోసారి సీఐడీ కస్టడీకి తనను పంపవద్దని హైకోర్టును రఘురామ కోరారు. తనను హైదరాబాద్ లోని ఇంట్లో విచారించాలని హైకోర్టును కోరారు. సీఐడీ కస్టడీకి పంపితే మళ్లీ దాడి జరిగే అవకాశాలున్నాయని ఆయన కోర్టుకు తెలిపారు. హైదరాబాద్ లోని ఇంట్లో సీఐడీ విచారణ జరిపితే ఎంపీ రఘురామ సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన లాయర్ హైకోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు దీనిపై స్పందించింది.
రఘురామరాజును విచారించేందుకు సురక్షితమైన చోటు గుర్తించాలని సీఐడీకి ఆదేశాలు ఇచ్చింది. అయితే సీఐడీ దీనిపై అభ్యంతరాలు తెలిపింది. రఘురామపై రాజద్రోహం మినహా ఇతర కేసుల్లో విచారణ జరపాల్సి ఉందని, రోజువారీ విచారణ ఎంపీ ఇంట్లో చేయడం కుదరదని తెలిపింది. అయితే హైకోర్టు మాత్రం ఇరుపక్షాల ప్రయోజనాల్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని చెబుతూ సేఫ్ ప్లేస్ వెతకాలని సీఐడీకి సూచించింది.