THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

మూవీ రివ్యూ : ‘రొమాంటిక్’

thesakshiadmin by thesakshiadmin
October 30, 2021
in Latest, Movies, Reviews
0
మూవీ రివ్యూ : ‘రొమాంటిక్’
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com    :   చిత్రం : ‘రొమాంటిక్’

నటీనటులు: పూరి ఆకాశ్-కేతిక శర్మ-రమ్యకృష్ణ తదితరులు
సంగీతం: సునీల్ కశ్యప్

ఛాయాగ్రహణం: నరేష్ రాణా
నిర్మాతలు: పూరి జగన్నాథ్-ఛార్మీ కౌర్
కథ-స్క్రీన్ ప్లే-మాటలు: పూరి జగన్నాథ్
దర్శకత్వం: అనిల్ పాడూరి

ఇప్పటికే హీరోగా రెండు సినిమాలు చేసిన పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాశ్ సరైన ఫలితాన్నందుకోలేకపోయాడు. ఇప్పుడతను ‘రొమాంటిక్’ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరి స్క్రిప్టుతో ఆయన శిష్యుడు అనిల్ పాడూరి రూపొందించిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

వాస్కోడిగామా (పూరి ఆకాశ్) గోవాలో చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మ పెంపకంలో నానా కష్టాలు పడి పెరిగిన కుర్రాడు. నానమ్మ పేరు మీద ట్రస్టు పెట్టి తన లాంటి పేదవాళ్లందరినీ ఆదుకోవడం కోసం బాగా డబ్బు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్న అతను.. ఒక స్మగ్లింగ్ గ్యాంగులో చేరతాడు. ముందు చిన్న చిన్న డీల్స్ చేసిన అతను.. తర్వాత తన బాసునే చంపేసి గ్యాంగ్ లీడర్ అయిపోతాడు. కోట్లకు పడగలెత్తుతాడు. అనుకున్నట్లే ట్రస్టు పెట్టి నడుపుతుంటాడు. మధ్యలో అతడికి అనుకోకుండా మోనిక (కేతిక శర్మ) పరిచయం అవుతుంది. ఆమెను చూడగానే అతడిలో కోరికలు పుడతాయి. మోనిక ముందు అతణ్ని దూరం పెట్టినా తర్వాత అతడికి ఆకర్షితురాలవుతుంది. ఇద్దరూ దగ్గరయ్యే సమయానికి వాస్కోడిగామాకు సమస్యలు మొదలవుతాయి. ఏసీబీ రమ్య (రమ్యకృష్ణ) అతణ్ని టార్గెట్ చేస్తుంది. పోలీసులకు దొరికిపోయిన వాస్కోడిగామాకు జీవిత ఖైదు కూడా పడుతుంది. మరి తర్వాత అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది.. మోనికతో అతడి బంధం ఎక్కడిదాకా వెళ్లింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

హీరోయిన్ని చూడగానే ఆమెను ఏదేదో చేసేయాలని హీరో తపించిపోతుంటాడు. ఆమెకు ఫోన్ చేసి నీ బ్యాక్ ఎప్పుడైనా చూసుకున్నావా.. మతిపోతోందిక్కడ అంటాడు. రాత్రి పూట తన ఇంటికొచ్చి ఒక్క పది నిమిషాలు టైమిస్తే కానిచ్చేద్దాం అని అడుగుతాడు. తర్వాత ఆమె బస్సెక్కి ముంబయి పోతుంటే.. ఒక్క గంట లేటుగా వెళ్దువు ఆగు అంటాడు. కుదరదంటే నేనూ ముంబయికి వస్తా.. రాత్రంతా నీతో ఉండి పొద్దునే వచ్చేస్తా అంటాడు. హీరో ఇదంతా చేస్తున్నా హీరోయిన్ చిరాకు పడుతూ కనిపిస్తుందే తప్ప గోల మాత్రం చేయదు. తర్వాత తెలుస్తుంది.. హీరోయిన్ కు కూడా హీరో పట్ల సరిగ్గా ఇలాంటి ఫీలింగ్సే ఉన్నాయట. హీరో మాటలు విన్నా.. అతడి చేష్టలు చూసినా కామంతో కటకటలాడిపోతున్నాడనే అనిపిస్తుంది. హీరోయిన్ బయటపడకపోయినా దాదాపు ఆమె ఫీలింగ్ కూడా ఇదే. కానీ హీరోను ఎలాగైనా పట్టుకోవాలని పంతం పట్టిన లేడీ పోలీసాఫీసర్ కు మాత్రం వీరి మధ్య గాఢమైన ప్రేమ బంధం ఉందని పసిగట్టేస్తుంది. అక్కడున్న హీరోయిన్లకు ఈ విషయం తెలియదు. చూస్తున్న మనకు కూడా అలాంటి ఫీలింగే కలగదు. కానీ ఈ పోలీసాఫీసర్ మాత్రం ఆ విషయం కనిపెట్టి.. ‘‘మీరు చూస్తున్నది లస్ట్ స్టోరీ కాదు.. ఒక గొప్ప లవ్ స్టోరీ. తెరపై చూపించే ఘాటు రొమాన్సుని.. బూతు మాటల్ని చూసి అపార్థం చేసుకోకండి’’ అని నొక్కి వక్కాణిస్తుంటుంది. మనం కూడా కళ్లతో చూసింది.. చెవులతో విన్నది.. పట్టించుకోకుండా పోలీస్ మేడం లాగా జ్ఞాన నేత్రంతో చూసి ఇదొక అమర ప్రేమ కథ అని ఫిక్సయిపోవాలి.. అంతే.

పూరి జగన్నాథ్ మధ్యలో ‘ఇస్మార్ట్ శంకర్’తో ఒక హిట్టు కొట్టేశాడు. అంతకుముందు ఆయనెంత బ్యాడ్ ఫాంలో ఉన్నది ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పని లేదు. ఆ టైంలో రాసిన ప్రేమకథే.. ఈ రొమాంటిక్. ఒకప్పుడు క్రేజీ ప్రేమకథలు.. యాక్షన్ స్టోరీలు రాసి తీసి శెభాష్ అనిపించుకున్న ఆయన.. ఒక దశ దాటాక ఒక మూసలో పడిపోయి ఎంత నాసిరకం సినిమాలు అందించాడో తెలిసిందే. ‘రొమాంటిక్’ మరీ ‘నేను నా రాక్షసి’.. ‘రోగ్’ లాంటి సినిమాల స్థాయిలో హింస పెట్టదన్న మాటే కానీ.. దీన్ని కూడా ఒక పట్టాన జీర్ణించుకోవడం కష్టమే. ఎందుకంటే పూరి ఏం రాశాడో.. ఆయన శిష్యుడు అనిల్ పాడూరి ఏం తీశాడో వాళ్లకైనా ఒక క్లారిటీ ఉందా అన్న సందేహాలు కలిగిస్తుందీ సినిమా. పూర్తిగా యూత్ ను టార్గెట్ చేసి ఒక లస్ట్ స్టోరీ తీయడం.. దాన్ని అలాగే ప్రమోట్ చేయడం ఒక రకం. కానీ ‘లస్ట్’ మాత్రమే చూపించి.. ఇదో గొప్ప లవ్ స్టోరీ అనడమే ఇక్కడొచ్చిన తంటా. ‘‘ఎవరైనా మోహానికి ప్రేమ అని పేరు పెట్టుకుంటారు. కానీ వీళ్లు నిజమైన ప్రేమలో ఉండి దాన్ని మోహం అనుకుంటున్నారు’’ అంటూ రమ్యకృష్ణతో ఒక డైలాగ్ చెప్పించారు. దాని చుట్టూనే ఈ సినిమా మొత్తం నడుస్తుంది. కానీ ఎంత వెతికినా ఈ సినిమాలో మోహం తప్ప.. ఆ ‘ప్రేమ’ ఎక్కడుందన్నదే అర్థం కాదు.

‘రొమాంటిక్’ సినిమా ప్రేక్షకులకు ఆఫర్ చేసే రెండు అంశాల్లో ఒకటి హీరో హీరోయిన్ల ఘాటు రొమాన్స్ అయితే.. ఇంకోటి యాక్షన్. ముందు యాక్షన్ గురించి మాట్లాడుకుంటే.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే గ్యాంగులు.. అందులో ఒక గ్యాంగులోకి వచ్చే హీరో.. ఈ సెటప్ లో పూరి జగన్నాథ్ సినిమా అంటే ఏముంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో ఆయన తీసిన సినిమాలు డబుల్ డిజిట్లోనే ఉన్నాయి. ఏదైనా పూరి సినిమాలో ఈ గ్యాంగుల గోల లేకపోతే దానికి ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది. ఈ గ్యాంగ్స్ మధ్య వార్ గురించి ఇక చెప్పేదేముంది? ఒక గ్యాంగులోకి కొత్తగా అడుగు పెట్టిన హీరో తన యాటిట్యూడ్ చూపించి అందరికీ షాకివ్వడం ఎప్పుడో ‘పోకిరి’ రోజుల్లోనే చూసేశాం. హీరో ఇలా గ్యాంగులో అడుగు పెట్టి అలా గ్యాంగ్ లీడర్ అయిపోవడంలో ఏ ఎగ్జైట్మెంట్ కలగదు. పైగా ఆకాశ్ మరీ పిల్లాడిలా ఉండటంతో ఈ ఎపిసోడ్ చాలా వరకు నమ్మశక్యంగా అనిపించదు. మొత్తంగా యాక్షన్ పరంగా చూసుకుంటే ‘రొమాంటిక్’లో కొత్తగా అనిపించే.. ఎగ్జైట్ చేసే విషయాలేమీ లేవు. ఇక రొమాన్స్ విషయానికొస్తే.. సినిమా ప్రోమోలు-పాటలు చూసి యూత్ ఇందులో ఏముంటుందని ఆశిస్తారో దానికి లోటు లేదు. కొంచెం ఘాటుగా ఉంటూనే.. అక్కడక్కడా పొయెటిగ్గానూ అనిపించే లీడ్ పెయిర్ రొమాన్స్ కుర్రకారును బాగానే ఆకట్టుకుంటుంది. కానీ వీరి ప్రేమకథలో మాత్రం ఏ ప్రత్యేకతా లేదు. మొత్తంగా కథ పరంగా పూరి జగన్నాథ్ ఏ మ్యాజిక్ చేయలేదు. కాస్త హుషారు పుట్టించే కొన్ని డైలాగ్స్ తప్పితే.. ఆయన ఒకప్పటి మార్కేమీ ఇందులో కనిపించదు. చూపించినంతసేపూ మోహం మాత్రమే చూపించి.. చివర్లో కథను ఎమోషనల్ టచ్ ఇవ్వాలని.. ప్రేక్షకులను కదిలించాలని చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టేసింది. ఇలాంటి కథకు ఈ ముగింపేంటి అని తలలు పట్టుకోవడం మినహా ఏమీ చేయలేం. కొన్ని అంశాలు యూత్ ను ఆకట్టుకోవచ్చేమో కానీ.. ఒక సినిమాగా ‘రొమాంటిక్’ మాత్రం తీవ్ర నిరాశకు గురి చేసేదే.

నటీనటులు:

పూరి ఆకాశ్ లుక్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నా.. అతను చాలా కాన్ఫిడెంట్ గా నటించి తాను సినిమాలకు పనికొస్తానని చాటి చెప్పాడు. పూరిని గుర్తు చేసేలా ఉన్న అతడి వాయిస్.. డైలాగ్ డెలివరీ బాగున్నాయి. ఆకాశ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఓకే. పతాక సన్నివేశాల్లో ఆకాశ్ బాగా చేశాడు. ఇంకా పసితనపు ఛాయలు పోకపోవడం వల్ల అతడికి ఇది వయసుకు మించిన పాత్రలా అనిపిస్తుంది. హీరోయిన్ కేతిక శర్మ సినిమాకు ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవాలి. ఆమె సూపర్ సెక్సీగా కనిపిస్తూ కావాల్సినంత గ్లామర్ విందు చేస్తుంది. టార్గెటెడ్ ఆడియన్స్ కు సినిమా రీచ్ కావడంలో కేతిక ముఖ్య పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. పేరున్న సినిమాల్లో ఈ మధ్య కాలంలో ఇంత సెక్సీగా కనిపించిన హీరోయిన్ ఇంకొకరు లేరంటే అతిశయోక్తి కాదు. రమ్యకృష్ణ పాత్ర వల్ల సినిమాకొచ్చిన ఉపయోగం పెద్దగా లేదు. ఓవర్ ద టాప్ అనిపించేలా ఉన్న ఆమె పాత్ర.. నటన.. డైలాగ్స్ చాలా చోట్ల చికాకు పెడతాయి. ఇందుకు రమ్యను తప్పుబట్టడానికేమీ లేదు. ఆ పాత్రను అలా తయారు చేశారు మరి. ఉత్తేజ్.. రమాప్రభ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. హీరో ఫ్రెండుగా చేసిన అమ్మాయి ఓకే. విలన్ల గురించి పెద్దగా చెప్పడానికేమీ లేదు.

సాంకేతిక వర్గం:

సునీల్ కశ్యప్ సంగీతం అదే తరహాలో సాగింది. పూరి అతడి గ్యాంగ్ సామాన్య జనాలతో డిస్కనెక్ట్ అయిపోయారా అనిపించేలా ఉన్నాయి ఇందులో పాటలు.. వాటి చిత్రీకరణ. ఇఫ్ యు ఆర్ బ్యాడ్.. ఐయామ్ యువర్ డాడ్ పాట ఒకటి కాస్త వినసొంపుగా అనిపిస్తుంది. మిగతా పాటలు ఒక టైపులో ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా అలాగే ఉంది. నరేష్ రాణా ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి. ఇక కథ.. స్క్రీన్ ప్లే.. మాటలు.. ఇలా స్క్రిప్టు బాధ్యత మొత్తం తనే తీసుకున్న పూరి జగన్నాథ్.. తన మీద పెట్టుకున్న అంచనాలను నిలబెట్టుకోలేకపోయాడు. ఈ స్క్రిప్టు రాసినపుడు ఆయన బ్యాడ్ ఫాంలో ఉన్నాడని స్పష్టమవుతుంది. ఆయన పెద్దగా కసరత్తు చేయట్లేదనడానికి సినిమాలో చాలా రుజువులు కనిపిస్తాయి. కొన్ని డైలాగ్స్ విషయంలో మినహాయిస్తే పూరి మెప్పించలేకపోయాడు. దర్శకుడు అనిల్ పాడూరి పూరి స్టయిల్ నే ఫాలో అయ్యాడు. కాకపోతే పూరితో పోలిస్తే రొమాన్సుని కొంచెం పొయెటిక్ స్టయిల్లో పండించాడు.

చివరగా: రొమాంటిక్.. లవ్ లేదు లస్టే

రేటింగ్-2.5/5

Tags: #FILM NEWS#PURI AKASH#Puri Jagannadh#ROMANTIC#ROMANTIC MOVIE#ROMANTIC MOVIE REVIEW#TELUGU CINEMA#TOLLYWOOD
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info