thesakshi.com : పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో బస్సు కాలువలోకి దూసుకెళ్లిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
ఆర్టీసీ బస్సు అశ్వారావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన బస్సు ప్రయాణికులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, ఇతర శాఖల అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ప్రమాదం జరిగినప్పుడు APSRTC బస్సులో 47 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు మరియు అతివేగమే ప్రమాదానికి కారణం కావచ్చు. బస్సు డ్రైవర్ కూడా ఘోర ప్రమాదంలో చనిపోయాడు.
అంతకుముందు బస్సు ప్రమాదంపై మంత్రి పేర్ని నాని స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించామని, పరిస్థితి విషమంగా ఉన్న వారిని విజయవాడ లేదా హైదరాబాద్‌కు తరలిస్తామని ఆయన చెప్పారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు.