thesakshi.com : అదో టోల్ ప్లాజా.. పక్కనే పోలీసుల చెక్ పోస్ట్ కూడా ఉంది. ప్రతి రోజు మాదిరిగానే ఆ రోజు కూడా పోలీసులు ప్రతివాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులోనూ తనిఖీలు చేశారు. అందులో బ్యాగు అనుమానాస్పదంగా కనిపించడంతో తెరిచి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది. అందులో ఏకంగా రూ.5కోట్ల నగదును చూసి పోలీసులు నోరెళ్లబెట్టారు. వివరాల్లోకి వెళ్తే.., ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా వద్ద ట్రావెల్స్ బస్సులో పోలీసులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం నుంచి గుంటూరు వెళ్తున్న పద్మవతి ట్రావెల్స్ బస్సును టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. బస్సులో లగేజ్ చెక్ చేస్తుండగా ఓ బ్యాగ్ లో భారీగా నగదు దొరికింది.
పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదును లెక్కించగా రూ.4.76 కోట్లు ఉన్నట్లు తేలింది. నగదును సీజ్ చేసిన పోలీసులు డ్రైవర్, క్లీనర్ తో పాటు మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలపై ఆరా తీయగా షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు బంగారు నగల వ్యాపారులు గుంటూరులో బంగారం కొనుగోలు చేసేందుకు ఈ డబ్బును పంపినట్లు తెలుస్తోంది. డబ్బంతా ఒకరిది కాదని.. నలుగురైదుగురు వ్యాపారులకు చెందినదిగా సమాచారం. డబ్బుతో పాటు కొంత బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఐతే ఇంత పెద్దమొత్తంలో నగదు పంపడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉగాది సందర్భంగా శ్రీకాకుళంలో బంగారం సేల్స్ బాగా జరుగుతాయని.. అందుకే అంతపెద్ద మొత్తంలో నగదు పంపారన్న టాక్ వినిపిస్తోంది. డబ్బుకు సరైన పత్రాలు చూపిస్తే వదిలేస్తామని పోలీసులు చెబుతున్నారు. నగదుకు సంబంధించిన వ్యక్తులకు సమాచారం అందించారు.