thesakshi.com : కృష్ణా జిల్లాలో లైసెన్స్ లేకుండా నడుస్తున్న 15 థియేటర్లను సీజ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని థియేటర్లలో తనిఖీలు చేస్తున్న అధికారులు టికెట్ రేట్లు, ఫైర్ సేఫ్టీ, కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తున్నారో లేదో తనిఖీ చేస్తున్నారు. క్యాంటీన్లలో తినుబండారాల ధరలు టికెట్ ధరల కంటే ఎక్కువగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. మల్టీప్లెక్స్‌లతోపాటు అన్ని థియేటర్లలో ధరలను అధికారులు నిర్ణయించనున్నట్లు సమాచారం.
అలాగే విజయనగరం జిల్లా పరిధిలోని థియేటర్లలో అధికారులు తనిఖీలు నిర్వహించి ఆరు థియేటర్లను సీజ్ చేశారు. టిక్కెట్ ధరలను ఇష్టానుసారంగా పెంచడం, లైసెన్స్ రెన్యువల్ కాకపోవడం, క్యాంటీన్ లో అధిక ధరలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
రాష్ట్రంలో సినిమా టిక్కెట్ ధరలపై హైకోర్టులో కేసు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. పాత పద్ధతిలోనే టిక్కెట్లను విక్రయించాలని సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశించింది మరియు జిఓ 35 ను రద్దు చేసింది. అయితే, ప్రభుత్వం దీనిని సవాలు చేసింది డివిజన్ బెంచ్‌లో గురువారం విచారణ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అధికారులతో తనిఖీలు నిర్వహించి సంబంధిత నివేదికను కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.