thesakshi.com : అమెరికాలో మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. భారత్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆయన భార్య అనుమానాస్పద స్థితిలో మరణించారు. వారు నివసిస్తున్న అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో రక్తపు మడుగులో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఒంటినిండా కత్తిపోట్లు ఉన్నాయి.
ఇండియన్ టెక్కీ దంపతుల నాలుగేళ్ల కుమార్తె బాల్కనీలో చాలా సేపటి నుంచి ఏడుస్తూ కనిపించడంతో పక్క వారు చూడడంతో ఈ దారుణం వెలుగుచూసింది. పోలీసులకు సమాచారం అందించారు. వారు విచారణ జరుపుతున్నారు.
బాలాజీ భరత్ రుద్రవర్ ఆయన భార్య ఆరతీ న్యూజెర్సీ శివార్లలోని నార్త్ అర్లింగ్టన్ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అంబాజోగై వీరి స్వగ్రామం. 2014లో వీరికి పెళ్లి అయ్యింది. వీరిద్దరూ రివర్ వ్యూ గార్డెన్ కాంప్లెక్స్ లోని 21 గార్డెన్ టెర్రస్ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నారు. 2017లో వీరికి కుమార్తె జన్మించింది.
వీరిద్దరూ తాజాగా ఫ్లాట్ లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వీరిని హత్య చేసినట్లు చెబుతున్నారు. ఇంట్లో ఏదైనా గొడవ చోటుచేసుకుందా? అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఫోరెన్సిక్ రిపోర్ట్ తర్వాత ఇది హత్యనా? ఆత్మహత్యనా అనేది తేలుస్తామని పోలీసులు చెప్పారు.బాలాజీ ఆయన భార్య మరణంపై వారి తండ్రికి సన్నిహితులు సమాచారం అందించారు.