thesakshi.com : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆ మేరకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు సోమవారం నోటీసు ఇచ్చారు.
సభా నియమ నిబంధనలలోని రూల్ 267 కింద ఆయన ఈ నోటీసును ఇచ్చారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభలో సోమవారం నిర్వహించే ఇతర వ్యవహారాలన్నింటిని పక్కన పెట్టి రూల్ 267 కింద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్చను ప్రారంభించాలని విజయసాయిరెడ్డి నోటీసులో కోరారు.