thesakshi.com : జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మూడేళ్లు పూర్తయింది. 3,648 కిలో మీటర్ల పాదయాత్ర ద్వారా ప్రతీ గ్రామాం.. ప్రతీ వర్గం ప్రజల్లో తన పైన నమ్మకం కల్పించి.. 40 ఇయర్స్ ఇండస్ట్రీని రాజకీయంగా దారుణంగా దెబ్బ కొట్టి 51 శాతం ఓటింగ్ తో.. 151 సీట్లతో ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసారు.
ఈ మూడేళ్ల పాలనలో ఎన్నో ఒడిదుడుకులు. కానీ, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీ అమలు దిశగానే సీఎం జగన్ అడుగులు వేసారు. ఇప్పటికే ఇచ్చిన హామీల్లో 90 శాతం మేర పూర్తి చేసామని పార్టీ నేతలు చెబుతున్నారు. మూడేళ్ల పాలన పూర్తయిన వేళ..పార్టీ నేతలు సంబరాలకు సిద్దమయ్యారు.
మూడేళ్ల కాలంలో కరోనా సంక్షోభం తొలి సారి సీఎం అయిన జగన్ సమర్ధతకు పరీక్షగా నిలిచింది. కానీ, ఆ పరీక్షలో జగన్ ప్రభుత్వం మంచి ఫలితాలు సాధించింది. వ్యాక్సినేషన్ లో ప్రధాని అభినందనలు అందుకుంది. ఆర్దికంగా రాష్ట్రం కరోనా దెబ్బకు చితికిపోయింది. కానీ, సంక్షేమ పథకాలు మాత్రం ఆగలేదు. తనకు ఎన్ని కష్టాలు ఉన్నా..సమస్యలు ఎదురైనా ఇచ్చిన మాట కోసం ప్రతీ ఒక్క పథకానికి తేదీ ముందుగానే చెప్పి మరీ జగన్ అమలు చేస్తూ వచ్చారు.
ఇప్పుడు 2024 ఎన్నికల్లో తిరిగి అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. తన మూడేళ్ల పాలనలో అందించిన సంక్షేమం.. అమలు చేసిన సామాజిక న్యాయం అస్త్రాలుగా వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతూనే.. మరో రెండేళ్ల పాలనలో మరింత సమర్ధవంతంగా పూర్తి చేసేందుకు సిద్దం అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి యుద్ధతంత్రాన్ని రచిస్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుంచే వ్యూహాలను రచిస్తున్న జగన్ ఈసారి ఎన్నికలకు వైసీపీకి ఎవరు దగ్గరవుతారు? ఎవరు దూరమవుతారు? కులాలవారీగా వచ్చే ఓట్లెన్ని? మహిళలను ఆకట్టుకోవడం ఎలా? వారికోసం ప్రత్యేకంగా ఏమైనా సంక్షేమ పథకాలు రూపొందించాలా? అనే యోచనలో ఉన్నారు.
మహిళలను అక్కచెల్లెమ్మలంటూ సంబోధించే జగన్‌కు గత ఎన్నికల్లో వారు బాగా పట్టం కట్టారు. అర్థరాత్రి వరకు క్యూలో నిలబడి ఓట్లు వేశారు. ఈసారి మహిళల ఓట్లే కీలకమని భావిస్తున్న జగన్ వారికోసం ప్రత్యేక సంక్షేమ పథకాలను రూపొందిస్తున్నారు. త్వరలోనే వాటిని ప్రకటించబోతున్నారు. మద్యనిషేధం విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతిమంగా మహిళల ఓట్లు ఏ పార్టీకి వెళ్లకుండా గుంపగుత్తగా వైసీపీకే పడేలా ఉండాలనే ప్రణాళికలో జగన్ ఉన్నారు.
ఏపీని 13 జిల్లాల నుంచి 26 జిల్లాలకు విభజించడంవల్ల లాభమే కలుగుతుందని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో పార్టీకి లాభం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే రాయలసీమలోనే జిల్లా కేంద్రాలపై రగడ జరుగుతుండటంతో వాటిని సరిదిద్ది ఎన్నికలకు ఆటంకం లేకుండా చూడాలని సీనియర్ మంత్రులకు బాధ్యతలప్పగించారు. వాటిని చక్కదిద్దగలిగితేనే రాయలసీమ ఎన్నికల్లో పార్టీకి ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు.
జగన్ ఈసారి బీసీ మంత్రం జపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చేసిన సామాజిక న్యాయం, మంత్రివర్గంలో స్థానం కల్పించడంలాంటివన్నీ ప్రజలకు వివరించేందుకు సామాజిక న్యాయభేరి పేరుతో బస్సు యాత్రను కూడా ముఖ్యమంత్రి నిర్వహింపచేశారు. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, రెడ్లతోపాటు బీసీల్లో 70 శాతం వైసీపీవైపు తిప్పుకుంటే ఈసారి ఎన్నికల్లో ఈజీగా గెలుపొందవచ్చనేది జగన్ భావనగా ఉంది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం ఏడాది పాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అయిపోయేలోగానే ఎన్నికల షెడ్యూల్ రావచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.