thesakshi.com : తెలుగుదేశం పార్టీ ఒంగోలు వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మహానాడును నిర్వహించనుంది. ఈ నెల 27, 28 తేదీలలో టిడిపి మహానాడు కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే టీడీపీ శ్రేణులు భారీగా నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఒంగోలు నగర శివారులో వందెకరాల స్థలాన్ని సేకరించిన టిడిపి మహానాడు కోసం దీనిని తీర్చిదిద్దుతుంది. గత రెండేళ్లు కరోనా మహమ్మారి కారణంగా వర్చువల్ గా మహానాడు కార్యక్రమం నిర్వహించగా ఈ దఫా బహిరంగ సభను నిర్వహించి, ఇప్పటి నుంచే ఎన్నికల కార్యక్షేత్రంలోకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలని టిడిపి నిర్ణయించింది.
టార్గెట్ 2024. ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. మహానాడు వేదికగా కీలక నిర్ణయాల వెల్లడికి సిద్దం అవుతున్నారు. అధికారం కోల్పోయిన తరువాత ప్రత్యక్షంగా మహానాడు నిర్వహించలేదు. రేపటి నుంచి ఒంగోలు కేంద్రంగా జరగనున్న మహానాడుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీని కంటే ముందుగా.. పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. పార్టీ అధినేత చంద్రబాబు ఈ రోజు భారీ ర్యాలీతో ఒంగోలు చేరుకోనున్నారు.
పొలిట్‌బ్యూరో సమావేశంలో.. మహానాడు అజెండాతో పాటు..రానున్న రోజుల్లో పార్టీపరంగా అనుసరించే రాజకీయ విధానాలను ఖరారు చేయనున్నారు. ఈ ఏడాది మహానాడుకు మరో ప్రత్యేకత ఉంది. పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తవుతుంది. అదే విధంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు సంవత్సరం పాటు జరగనున్నాయి. 27న పార్టీ మహానాడు ప్రారంభం కానుండగా.. 28న ఎన్టీఆర్ స్వగ్రామంలో ఆయన శతజయంతి వేడుకలను నందమూరి బాలక్రిష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభిస్తారు. ఇక, ఈ రోజు చంద్రబాబు మహానాడు కోసం ఒంగోలుకు వస్తున్న వేళ ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తం అవుతున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి అధినేత చంద్రబాబు వెంట భారీ ద్విచక్ర వాహనర్యాలీతో ఒంగోలు వెళ్లేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు.
చంద్రబాబు ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన దగ్గర నుంచి..భారీ ర్యాలీతో స్వాగతం పలకనున్నారు. మంగళగిరి, కాకాని, గుంటూరు, చిలకలూరిపేట, అద్దంకి క్రాస్‌రోడ్, మేదరమెట్ల, ఒంగోలు పరిసరాల నుంచి కూడా.. చంద్రబాబు కాన్వాయ్ వెంట తెలుగు తమ్ముళ్లు… బైక్ ర్యాలీలో కలవనున్నారు. మహానాడు కోసం ఒంగోలు సమీపంలోని మండవవారిపాలెం వద్ద సభావేదిక ముస్తాబవుతోంది. దారి పొడువునా పసుపు తోరణాలు, స్వాగత ద్వారాలు, ఫ్లెక్సీలు, బెలూన్లతో ఒంగోలు నగరాన్ని అలంకరిస్తున్నారు. డిజిటల్ తెరలు, భారీగా కార్యకర్తలు, అభిమానులు.. ఆశీనులయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహానాడు ఏర్పాట్లు ఒక కొలిక్కి రాగా, ఒంగోలు నగరంలోని ప్రధాన కూడళ్లు, రహదారులతోపాటు పాత బైపాస్ రోడ్డు ప్రాంతాలు టీడీపీ తోరణాలతో, జెండాలు, నేతల ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లతో నిండిపోయాయి.
ఈ మహానాడు వేదికగానే పార్టీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కించుకొనే దిశగా తమ కార్యాచరణ ప్రకటించటంతో పాటుగా.. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు. అదే విధంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. ఇక, కీలకంగా మారిన పొత్తుల వ్యవహారం పైన చంద్రబాబు తమ వైఖరి స్పష్టం చేసే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా..ఏపీతో పాటుగా జాతీయ రాజకీయాల్లోనూ టీడీపీ విధానం పైన క్లారిటీ ఇస్తారని చెబుతున్నారు. దీంతో.. రాజకీయంగా చంద్రబాబు తీసుకొనే నిర్ణయాల పైన ఆసక్తి నెలకొని ఉంది.