thesakshi.com : కొత్తవాళ్లను అంత తేలిగ్గా నమ్మకూడదు అనేది చందమామ కథల్లో నీతి. కానీ… ఫుడ్ డెలివరీ తెచ్చే బాయ్సే… చోరీకి పాల్పడతారని ఎవరు ఊహిస్తారు. నోయిడాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఇద్దరు కుర్రాళ్లను అరెస్టు చేశారు. వాళ్లిద్దరూ ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ (Swiggy)లో పనిచేస్తున్నారు.
వాళ్లిద్దరూ.. సిటీలోని ఇళ్ల తాళాలు పగలగొట్టి… విలువైన ఐటెమ్స్ ఎత్తుకుపోయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీనిపై స్పందించిన స్విగ్గీ కంపెనీ… వాళ్లిద్దర్నీ సస్పెండ్ చేసినట్లు తెలిపింది. వాళ్లను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకున్నట్లు వివరించింది. సెక్టార్ 39 పోలీస్ స్టేషన్‌లో చోరీ కేసు నమోదవ్వడంతో… అక్కడి పోలీసులు దర్యాప్తు చేసి… మహ్మద్ ఖఫీల్, రవి శంకర్‌ను అరెస్టు చేసినట్లు నోయిడా అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రణవిజయ్ సింగ్ తెలిపారు.
“ఇద్దరు స్విగ్గీ డెలివరీ బాయ్స్‌ని అరెస్టు చేశారు. వాళ్లు ఇళ్ల తాళాలు బద్ధలు కొట్టి… లోపలికి ప్రవేశించి… విలువైనవి పట్టుకుపోయారు” అని రణవిజయ్ సంగ్ తెలిపారు.
“వాళ్లిద్దర్నీ కంపెనీ… గోల్ఫ్ కోర్స్ ఏరియాలోని ఇళ్లలో ఫుడ్ డెలివరీకి పంపింది. అలా వెళ్లిన వాళ్లు… అక్కడి ఇళ్లలో ఖాళీ ఇళ్లు ఏవి ఉన్నాయి… విలువైన సామాన్లు ఏ ఇళ్లలో ఉన్నాయి… వంటి అంశాలపై రెక్కీ చేస్తున్నారు. రాత్రిళ్లు ఆ మనుషులు లేని ఇళ్లలో చోరీలు చేస్తున్నారు. ఇలా ఓ ప్లాన్ ప్రకారం చోరీలు చేస్తున్నారు” అని సింగ్ తెలిపారు.
నిందితులు ఇద్దరూ… నోయిడాకు దగ్గర్లోనే ఉన్న బులంద్ షహర్ జిల్లాకు చెందినవారు. అది ఉత్తరప్రదేశ్‌కి పశ్చిమాన ఉంది. వాళ్లిద్దరూ నోయిడాలోని సెక్టార్ 126లో ఉంటూ… చోరీలకు ప్లాన్ వేస్తున్నారు అని సింగ్ వివరించారు.
ఈ విషయం తెలియగానే స్విగ్గీ కంపెనీ వెంటనే వాళ్లపై చర్యలు తీసుకుంది. ఈ చోరీలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. “మేము ఇలాంటి ప్రవర్తనను ఎంత మాత్రం సహించం. అధికారుల దర్యాప్తునకు మా పూర్తి సహకారం అందిస్తాం” అని స్విగ్గీ తన స్టేట్‌మెంట్‌లో తెలిపింది.
పోలీసుల ప్రకారం… 32 అంగుళాల LED టీవీ, 2 ట్రాక్ సూట్లు, 1 రిస్ట్ వాచీ, ఓ స్విగ్గీ బ్యాగ్, మరికొన్ని వస్తువుల్ని ఇళ్లలో చోరీ చేసి ఎత్తుకెళ్లారు. వాటిని రహస్యంగా అమ్మి… ఆ డబ్బులో తన వంతు వాటా తీసుకున్న రవి శంకర్… ఓ బైక్ కొనుక్కున్నాడు. ఈ ఇద్దరితో మరో వ్యక్తి కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అతన్ని గుర్తించామనీ… త్వరలోనే అరెస్టు చేస్తామని అంటున్నారు.