thesakshi.com : ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల హస్తగతమైంది. తాలిబన్లకు అధికార మార్పిడి చేసేందుకు సిద్ధమని ఆఫ్ఘనిస్తాన్ ఇంటీరియర్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. కాబూల్‌పై ఎలాంటి దాడులు చేయొద్దని వారు కోరారు. అటు తాలిబన్లు కూడా ఎలాంటి దాడి చేయబోమని ప్రకటించారు. ప్రజలంతా క్షేమంగా వున్నారని తెలిపారు.
అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేయగా.. స్పీకర్, మంత్రులు ఇప్పటికే పాకిస్తాన్‌కు పారిపోయారు. మరోవైపు ఆ దేశంలో సుమారు 1500 మంది భారత పౌరులు వున్నట్లుగా తెలుస్తోంది. వీరందరినీ తిరిగి స్వదేశానికి రావాల్సిందిగా అడ్వైజరీనీ జారీ చేసింది భారత విదేశాంగ శాఖ. అటు తాలిబన్ల ఎంట్రీతో అమెరికా రాయబార కార్యాలయం ఖాళీ అవుతోంది. ఆ దేశ దౌత్య సిబ్బందితో పాటు సైనిక సిబ్బందిని హెలికాఫ్టర్లలో తరలిస్తోంది. మరోవైపు కీలకమైన సమాచారాన్ని ధ్వంసం చేసింది అమెరికా
కాగా, ఆఫ్గానిస్థాన్ హస్తగతమే లక్ష్యంగా తాలిబన్ల దురాక్రమణ మరింత జోరుగా సాగుతోంది. ఇప్పటికే దేశంలో మెజారిటీ భూభాగంపై పట్టుసాధించిన వారు ఆదివారం ఉదయానికి దేశ రాజధాని కాబూల్‌కు సమీపంలో ఉన్న మరో నగరం జలలాబాద్‌ను సైతం ఆక్రమించారు. వేకువజామున ప్రజలు నిద్ర లేచేసరికి నగరవ్యాప్తంగా తాలిబన్ జెండాలు పాతుకుపోయాయి.
జలాలబాద్ ఆక్రమణతో కాబూల్ నగరానికి తూర్పు ప్రాంతాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఆ వెంటనే తాలిబన్లు రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించారు. ఇప్పటికే 19 రాష్ట్రాల రాజధానుల్లో తాలిబన్లు పాగా వేశారు. దీనితో పాటు ఆఫ్ఘనిస్తాన్ అన్ని సరిహద్దులను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన అగ్రరాజ్యం అమెరికా ఆఫ్గన్ నుంచి తమ రాయబార కార్యాలయ సిబ్బందిని స్వదేశానికి తరలిస్తోంది.