thesakshi.com : రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ది ప్రత్యేకస్థానం. 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న టీడీపీ.. ప్రస్తుతం ప్రతిపక్షానికే పరిమితమైంది. ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు రెండుదశాబ్దాలు అధికారంలో ఉన్న టీడీపీ.. 19ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంది. కానీ 2019 ఎన్నికల్లో ఓటమి ప్రతిపక్షం అనే హోదాను ప్రశ్నార్థకం చేసింది. కనీసం 20శాతం సీట్లను కూడా సాధించలేక పూర్తిగా చతికిలబడింది.
ఐతే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్న టీడీపీ.. ఆ దిశగా అడుగులు వేస్తుందా..? ఎన్నికల్లో గెలవాలన్న కసి ఆ పార్టీ నేతల్లో ఉందా..? అందుకు తగ్గ కార్యాచరణను చంద్రబాబు రూపొందించారా..? లోకేష్ ను ఫ్యూచర్ లీడర్ గా చెబుతున్నా.. ఆ స్థాయిలో ముందుకెళ్లే రోడ్ మ్యాప్ ను సిద్ధం చేశారా..? అంటే అవును అని తెలుగు తమ్ముళ్లు గట్టిగా చెప్పలేని పరిస్థితి.
2014లో ప్రస్తుత సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ 67 సీట్లకు పరిమితమైంది. కేవలం 5శాతం ఓట్లతో అధికారాన్ని కోల్పోయింది. అంటే మ్యాజిక్ ఫిగర్ కు 20-25 సీట్ల దూరంలో నిలిచిపోయింది. అంటే వైసీపీ గెలుపుకు కాస్త గట్టిగా ప్రచారం చేస్తే విజయం సాధించేవారు. కానీ 67 సీట్లను 90కి తీసుకెళ్లేందుకు జగన్ ఏకంగా 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.
2019 ఎన్నికల కోసం 2017 నుంచే పాదయాత్ర మొదలుపెట్టారు. 2017 నవంబర్ 6న మొదలైన పాదయాత్ర.. 2019 జనవరిలో ముగిసింది. ఈ మధ్యలో రాష్ట్రంలోని దాదాపు ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసిన జగన్ వందకుపైగా బహిరంగ సభల్లో ప్రసంగించారు.
మొత్తం 341 రోజుల పాటు ప్రజల్లోనే ఉన్నారు. అంతేకాదు తన పాదయాత్రలో టీడీపీ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు తానేం చేస్తానో స్పష్టంగా చెప్పుకుంటూ వెళ్లారు. జగన్ కష్టానికి ప్రతిఫలం… 175 సీట్లకు గానూ ఏకంగా 151 స్థానాలు వైసీపీ ఖాతాలో చేరాయి. రికార్డుస్థాయిలో ఓట్లు, సీట్లు జగన్ గెలుచుకున్నారు.
అసెంబ్లీలో 23 సీట్లకే పరిమితం కావడం, వారిలో ఐదుగురు ఎమ్మెల్యేలు జగన్ కు జై కొట్టడంతో అటు సభలో, ఇటు బయట డీలా పడింది. ఇంతలా వెనుకబడిన పార్టీ.. 151 సీట్లున్న పార్టీని ఢీ కొట్టి ఓడించాలంటే ప్లానింగ్ మాములూగా ఉండకూడదు. పైగా సంక్షేమ పథకాల పేరుతో ఏదోక రూపంలో ప్రజల ఖాతాల్లో డబ్బులు జమవుతూనే ఉన్నాయి. అలాంటప్పుడు అధికార పార్టీ రెండడుగులు వేస్తే.. ప్రతిపక్షం పది అడుగులు వేయాలి. కానీ ఆ ఊపు టీడీపీలో కనిపించడం లేదని సొంతపార్టీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు.
కరోనా కారణంగా రెండేళ్లు జూమ్ మీటింగ్ లకే పరిమితమైన చంద్రబాబు, చినబాబు ఇకనైనా ప్రజల్లోకి వెళ్లాలనేది తమ్మళ్ల డిమాండ్. స్థానిక ఎన్నికల సమయంలో తప్ప అధినేత బయటకు వచ్చిందే లేదు. చినబాబు సైతం మంగళగిరికే పరిమితమవుతున్నారు.
23 నుంచి 123 చేయాలంటే.. 151ని 51కి దించాలంటే ప్లానింగ్ ఎలా ఉండాలి.. ఏం చేయాలనే ఆలోచన ఉందా లేదా అని తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. పైగా వన్ సైడ్ లవ్ అంటూ జనసేనతో పొత్తుకు యత్నించడంపైనా కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పొత్తుల సంగతి ఎలా ఉన్నా ముందు ప్రజల్లో బలం పెంచుకునే ప్రయత్నం చేయాలిగా అనే మరికొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతెందుకు 2014 ఎన్నికల కోసం చంద్రబాబు 2012లోనే దాదాపు కిలోమీటర్ల పాదయత్ర చేసిన సంగతి మర్చిపోయారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అప్పటికంటే ఇప్పటిపరిస్థితులు కఠినంగా ఉన్నాయి. కరోనా ముగిసిన తర్వాత కూడా టీడీపీ ఒక్క బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయలేదు.
ఈ విషయంలో జనసేన, బీజేపీలు కాస్త ముందున్నాయి. జనసేన మత్స్యకార భరోసా సభతో పాటు ఆవిర్భావ సభను గ్రాండ్ గా నిర్వహించింది. అటు బీజేపీ విజయవాడలో ప్రజాగ్రహ సభ, కడపలో రాయలసీమ రణభేరి సభలు నిర్వహించింది. శక్తికేంద్రాల సందర్శన పేరుతో బూత్ లెవల్ సమావేశాలు కూడా నిర్వహిస్తోంది. మరి ఆ రెండు పార్టీల కంటే బలంగా ఉన్న టీడీపీకి జనంలోకెళ్లేందుకు వచ్చిన సమస్యేంటనేది రాజకీయ విశ్లేషకుల ప్రశ్న.