thesakshi.com : ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లోనూ ఓ రేంజ్ లో చక్రిం తిప్పిన చరిత్ర నారా చంద్రబాబునాయుడిది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్ధానం ప్రారంభించినా మామ ఎన్టీఆర్ పెట్టిన టీడీపీలో చేరి వరుస విజయాలతో దుమ్మురేపిన చంద్రబాబు జాతీయ స్ధాయిలోనూ ఒకప్పుడు కీలకంగా వ్యవహరించారు. 1994కు ముందు మామ చాటు అల్లుడిగా ఉన్న చంద్రబాబు.. 1995లో ఆయన దగ్గర నుంచి టీడీపీని లాక్కున్నారనే అపప్రద మూటగట్టుకున్నా పార్టీ నేతలంతా ఆయనకే అండగా నిలవడంతో సీఎం కాగలిగారు.
అదే సమయంలో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరడంతో పాటు కన్వీనర్ గా కూడా వ్యవహరించడం చంద్రబాబును సీనియర్ రాజకీయవేత్తగా మార్చింది. 2014లో మోడీకి మద్దతుగా నిలిచినా రాష్ట్రంలో జగన్ ట్రాప్ లో పడి ఎన్డీయేకు దూరం కావడం చంద్రబాబుకు భారీ దెబ్బగా మారింది. 2019లో మోడీపై చేసిన ధర్మపోరాటం చంద్రబాబు ప్రతిష్టను మసకబార్చింది. రాష్ట్రంలోనూ అధికారం కోల్పోవడంతో పాటు వైసీపీకి టార్గెట్ గా మారిపోయారు.
చంద్రబాబుకు తెలియని రాజకీయం లేదు. ఆయన ఎరగని వ్యూహం లేదు. అయితే చంద్రబాబుకు అన్నీ తెలిసినా ఆచరణలో వాటిని పెట్టడంలో మాత్రం దూకుడు చేయరు. ఇక పోతే ఆయన రొడ్డకొట్టుడు రొటీన్ టైప్ పాలిటిక్స్ ని ఎపుడూ అమలు చేస్తారు అని పేరు తెచ్చుకున్నారు. ఎపుడో మర్రి చెన్నారెడ్డి కాలం నాటి రాజకీయాలు ఈ రోజు చేస్తే ఆధునిక తరంలో టీడీపీ ఎలా మనగలుతుంది.
చంద్రబాబు ఎర్లీ సెవెంటీస్ ఎయిటీస్ కాలం నాటి పాలిటిక్స్ చేస్తారు. దాని వల్లనే ఈ తరం కనెక్ట్ కాక పార్టీ వెనకబడిపోతోంది అంటారు. ఇక చంద్రబాబు రాజకీయంగా టీడీపీని మరింతకాలం ముందుకు తీసుకుపోవాలంటే కొత్త తరానికి పార్టీలో అవకాశాలు ఎక్కువగా ఇవ్వాలి. తన చుట్టూ ఉన్న షష్టీ పూర్తి బ్యాచ్ ని పూర్తిగా సైడ్ చేయాలి
చంద్రబాబు ఎపుడూ చెబుతూ ఉంటారు. పార్టీలోకి కొత్త రక్తం రావాలని మరి ఆ రక్తం ఎలా వస్తుంది. బాబు అవకాశాలు ఇస్తేనే వస్తుంది. ఇక యువతకు వచ్చే ఎన్నికల్లో సీట్లు అని బాబు అంటున్నారు. కానీ ఆయన టికెట్లు ఇచ్చేది వారసులకే. దాంట్లో పార్టీ పెట్టి ఇన్నాళ్ళు అయినా ఒకే కుటుంబాలకు చెందిన వారే ఏపీలో వందా నూటాభై నియోజకవర్గాల్లో ఈ రోజుకీ పెత్తనం చేస్తున్నారు.
మరి జనాలకు మోజు ఎలా ఉంటుంది. ఆ ఫ్యామిలీలో నాడు తండ్రి నేడు తనయుడు లేక కుమార్తె. వారినే భుజాన ఎక్కించుకుంటూ క్యాడర్ నిరాశలో నిస్పృహలో ఉండిపోదా. అదే సమయంలో వైసీపీ విషయం తీసుకుంటే ద్వితీయ శ్రేణి నాయకత్వంతో పాటు తృతీయ శ్రేణి నాయకత్వాన్ని కూడా రెడీ చేస్తున్నారు. సీనియర్లు ఉండగానే జూనియర్లను తెచ్చి వారి సరసన పెడుతున్నారు.
దాని వల్ల పార్టీకి ప్రభుత్వానికి ఫ్రెష్ లుక్ వస్తుంది. నిజానికి ఇలాంటివి చేయాలీ అంటే గట్స్ ఉండాలి. జగన్ ఎవరేమనుకుంటే ఏమి అని చేయాల్సింది చేసుకుంటూ పోతున్నారు. దాని వల్ల రాజకీయంగా ఇబ్బందులు వస్తాయనుకున్నా ఆయన తగ్గేది లేదు అంటున్నారు. మరి చంద్రబాబు కూడా అలా చేయగలరా. ఆయన చెప్పినట్లుగానే కనీసంగా వందకు తగ్గకుండా నియోజకవర్గాల్లో యువతకు టికెట్లు ఇవ్వగలరా.
వారు ఏ రాజకీయ కుటుంబానికి చెందకుండా సొంతంగా ఎదిగిన వారికి పార్టీ జెండాను నమ్ముకున్న వారికి కనుక బాబు అవకాశాలు ఇస్తే పార్టీ పది కాలాలు ముందుకు వెళ్తుంది. జనాలకు కూడా కొత్తదనం కనిపిస్తుంది. అయితే దీనికి టీడీపీలో దశాబ్దాలుగా ఉన్న సీనియర్లు రాజకీయ కుటుంబాలు అయితే ససేమిరా అంటాయి. వారికి అలకలు అసంతృప్తులు ఉంటాయి.
మరి వారిని పక్కన పెట్టగలిగితే సాహసానికి కనుక టీడీపీ రెడీ అయితే మాత్రం రేపటి ఎన్నికల్లోనే కాదు మరిన్ని ఎన్నికలను సైతం ఎదుర్కొని సత్తా చాటే పరిస్థితి కచ్చితంగా ఉంటుంది. చంద్రబాబు తన పుట్టిన రోజు వేళ ఇలాంటి కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని పార్టీ శ్రేయోభిలాషులు అంతా కోరారు.