thesakshi.com : టిడిపి మహానాడు వైసీపీ మంత్రులను, జగన్మోహన్ రెడ్డిని తిట్టడం కోసమే పెట్టుకున్నారని రోజా ఎద్దేవా చేశారు. టిడిపి మహానాడు ద్వారా ప్రజలకు మంచి పనులు చేస్తామని హామీ ఇవ్వలేకపోయారు అంటూ రోజా విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ఎన్టీఆర్ అంటే నచ్చదని, ఎన్టీఆర్ అన్న పేరు అంటే చంద్రబాబుకు భయమని రోజా వెల్లడించారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ని చూసి భయపడి పార్టీ నుంచి బయటకు పంపేశారని రోజా విమర్శలు గుప్పించారు.
రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి పట్టిన శని చంద్రబాబు నాయుడే అని గతంలోనే ఎన్టీఆర్ చెప్పిన మాటలను గుర్తుచేశారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. శనివారం ఉదయం నియోజకవర్గ నేతలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు.
మహానాడులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేస్తున్నారు వైసీపీ మంత్రులు. తాజాగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా శనివారం ఉదయం నియోజకవర్గ నేతలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం టిడిపి మహానాడు పై వ్యాఖ్యలు చేసిన రోజా రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ పట్టిన శని చంద్రబాబు నాయుడేనని వ్యాఖ్యానించారు. ఇక ఈ విషయం గతంలోనే ఎన్టీఆర్ చెప్పారంటూ, ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు రోజా.
ఎన్టీఆర్ ప్రాణాలు తీసి, ఆయన ఫోటో కి నేడు వారి దండాలు పెడుతున్నారని, దండలు వేస్తున్నారని రోజా మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరు ఒక జిల్లాకి పెడితే కనీసం చంద్రబాబు కృతజ్ఞత కూడా ప్రదర్శించ లేదని మంత్రి రోజా మండిపడ్డారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని జగన్ లాంటి మంచి సీఎంను ఎన్నడూ చూడలేదని ప్రజలు చెబుతున్నారని రోజా పేర్కొన్నారు. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి టిడిపి నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారు అని మంత్రి రోజా విమర్శలు గుప్పించారు.
మహానాడు అని పెట్టి మహిళలతో నీచాతి నీచంగా మమ్మల్ని తిట్టిస్తున్న ఘటనలు చూస్తున్నామని పేర్కొన్న రోజా చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. మామను చంపిన ఆ చేతులతోనే దండం పెడుతున్న చంద్రబాబు ఎంతటి ఘనుడో ప్రజలకు తెలుసని రోజా విమర్శించారు.
చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా మహానాడులో సీఎం జగన్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని చంద్రబాబు పై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రజల కోసం ఏమీ చేయలేదని రోజా విమర్శించారు.