THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • National
  • Crime
  • International
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ (వెబ్ సిరీస్) :మూవీ రివ్యూ

thesakshiadmin by thesakshiadmin
September 12, 2021
in Latest, Movies, Reviews
0
‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ (వెబ్ సిరీస్) :మూవీ రివ్యూ
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

thesakshi.com   :   చిత్రం : ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ (వెబ్ సిరీస్)నటీనటులు: సంతోష్ శోభన్-టీనా శిల్పరాజ్-విష్ణు ప్రియ-వెంకట్-సాయి శ్వేత-ఝాన్సీ-శ్రీకాంత్ అయ్యంగార్-సంగీత్ శోభన్ తదితరులు
సంగీతం: ప్రశాంత్ విహారి

ఛాయాగ్రహణం: సురేష్ రగుతు
నిర్మాత: సుప్రియ యార్లగడ్డ

దర్శకత్వం: జోనాథన్ ఎడ్వర్డ్స్తెలుగు ప్రేక్షకుల కోసం పూర్తిగా తెలుగులో సినిమాలు.. వెబ్ సిరీస్ లు.. షోలు అందించే ఓటీటీ ‘ఆహా’. ఈ మధ్య చాలా దూకుడుగా ఒరిజినల్స్ రూపొందిస్తున్న ఆహా.. కొత్తగా ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ పేరుతో ఓ సిరీస్ రూపొందించింది. ‘ఏక్ మిని కథ’తో ఆకట్టుకున్న యువ కథానాయకుడు సంతోష్ శోభన్ ప్రధాన పాత్రలో అన్నపూర్ణ స్టూడియో నిర్మించిన ఈ సిరీస్ కు జొనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ విశేషాలేంటో చూద్దాం పదండి.ముందుగా కథ విషయానికి వస్తే.. విజయ్ (సంతోష్ శోభన్) సూపర్ మార్కెట్ కమ్ బేకరీ నడిపే ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు. మంచి ఆర్టిస్టు అయిన అతను పేరున్న ఆర్ట్స్ కాలేజీలో సీటు వచ్చినా కుటుంబం కోసం అక్కడికి వెళ్లకుండా ఆగిపోతాడు. అతడికి మహేశ్వరి (విష్ణు ప్రియ) అనే గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. కానీ తనతో ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లడానికి విజయ్ సందేహిస్తుంటాడు. పెళ్లి కోసం మహేశ్వరి తొందరపెట్టడంతో ఆమెకు దూరమవుతాడు.

ఆ సమయంలోనే అతడికి సినిమా హీరోయిన్ అయిన ఐరా వాసిరెడ్డి (టీనా శిల్పరాజ్) పరిచయం అవుతుంది. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. ఐతే కొన్ని కారణాల వల్ల వీళ్లిద్దరి మధ్య ఎడబాటు వస్తుంది. అదే సమయంలో మహేశ్వరి తిరిగి విజయ్ దగ్గరికొస్తుంది. మరి ఈ ఇద్దరిలో విజయ్ చివరికి ఎవరి సొంతమయ్యాడు. మరోవైపు విజయ్ కుటుంబంలో తలెత్తిన సమస్యలు ఎలా పరిష్కారం అయ్యాయి అన్నది మిగతా కథ.ఈ మధ్యే ఆహాలో ‘తరగతి గది దాటి..’ అనే చిన్న స్థాయి వెబ్ సిరీస్ వచ్చింది.

హిందీలో వచ్చిన ‘ఫ్లేమ్స్’ అనే వెబ్ సిరీస్ ను మన నేటివిటీకి తగ్గట్లుగా చక్కగా అడాప్ట్ చేసుకుని.. ఒరిజినల్ ను మించి అందంగా ఆకర్షణీయంగా ప్రెజెంట్ చేసింది దాని టీం. 25-30 నిమిషాల నిడివితో ఐదు ఎపిసోడ్లలో షార్ట్ అండ్ స్వీట్ గా ఆ సిరీస్ ను రూపొందించిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. పెద్దగా కథ లేకుండా లవ్.. బ్రేకప్.. ఫన్.. ఈ తరహాలో సాగిపోయే వెబ్ సిరీస్ లు తక్కువ నిడివితో.. చకచకా సాగిపోతే ఎంత మంచి ఫీలింగ్ ఇస్తాయనడానికి ఆ సిరీస్ ఉదాహరణ. ఎన్నో చిక్కు ముడులతో.. మలుపులతో ఉండే థ్రిల్లర్ సిరీస్ లు అయితే ఎక్కువ ఎపిసోడ్లు.. నిడివి ఉన్నా కూడా చెల్లుతుంది. కానీ రొమాంటిక్ ఎంటర్టైనర్లకు పది ఎపిసోడ్లు.. ఐదున్నర ఆరు గంటల నిడివి అంటే ప్రేక్షకులకు కచ్చితంగా ఏదో ఒక దశలో విసుగొస్తుంది.

‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ విషయంలోనూ అదే జరిగింది.యువ ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఇది టైంపాస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది కానీ.. పెద్దగా కథంటూ లేకపోవడం.. ఊరికే ఎపిసోడ్లను సాగదీయడం.. లాజిక్ లెస్ సీన్లు కొంత చికాకు పెడతాయి. మూణ్నాలుగు ఎపిసోడ్లు తగ్గించి.. కథనాన్ని పకడ్బందీగా తీర్చిదిద్దుకుని ఉంటే యూత్ కు ఇది మంచి కిక్కే ఇచ్చేది. ఇదే పేరుతో వచ్చిన ఇజ్రాయెల్ వెబ్ సిరీస్ ఆధారంగా ‘బేకర్ అండ్ బ్యూటీ’ని తీర్చిదిద్దారు. ఐతే తెలుగులోకి అడాప్ట్ చేసుకుంటున్నపుడు కొంచెం మన నేటివిటీని చూసుకోవాల్సింది.

హీరో.. అతడి కుటుంబం.. తన చుట్టూ పరిస్థితుల వరకు ఓకే కానీ.. హీరోయిన్ చుట్టూ వ్యవహారమంతా కూడా అసహజంగా అనిపిస్తుంది. ఓ హీరోయిన్.. బేకరీ నడుపుకునే కుర్రాడితో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్నది ఇంట్రెస్టింగ్ పాయింటే. కానీ ఈ ప్రేమకథను కన్విన్సింగ్ గా చెప్పడంలో దర్శకుడు విఫలమయ్యాడు.హీరోయిన్.. ఒక మామూలు కుర్రాడితో ప్రేమలో పడటానికి సరైన కారణాలు కనిపించవు. అప్పటికే ఓ హీరో నుంచి బ్రేకప్ అయి ఉన్న హీరోయిన్.. మధ్య తరగతి కుర్రాడితో చాలా ఈజీగా మూవ్ అయిపోతుంది.

అతడి పట్ల ఆకర్షితురాలవుతుంది. మళ్లీ అతణ్ని దూరం పెడుతుంది. హీరో కూడా అంతే. ఒకమ్మాయితో బ్రేక్ చేసుకుంటాడు. వెంటనే ఇంకో అమ్మాయితో ప్రేమలో పడిపోతాడు. సరైన కారణం లేకుండా ఆమెకు దూరమవుతాడు. తిరిగి పాత అమ్మాయితో ప్రేమ పెళ్లి అంటాడు. కొన్ని గంటల్లోనే అతడి ఆలోచన మారిపోయి విడిపోయిన అమ్మాయి దగ్గరికి తిరిగెళ్లిపోతుంటాడు. హీరో ఫస్ట్ గర్ల్ ఫ్రెండేమో.. తనను అతనెంత దూరం పెడుతున్నా వెంట పడుతుంటుంది. ఇలా లీడ్ క్యారెక్టర్లు మూడూ నిలకడ లేకుండా.. చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి.

దీంతో ఏ ప్రేమకథనూ ప్రేక్షకులు సీరియస్ గా తీసుకోలేని పరిస్థితి కనిపిస్తుంటుంది.ఒక సినిమా కథానాయికతో బేకర్ అయిన కుర్రాడు చాలా క్యాజువల్ గా ఉండటం.. తన దగ్గర యాటిట్యూడ్ చూపించడం కన్విన్సింగ్ గా అనిపించదు. అలాగే నేనో మధ్య తరగతి కుర్రాడిని.. నా ఆలోచనలు చాలా మామూలుగా ఉంటాయని చెప్పే హీరో.. హీరోయిన్ తన మాజీ బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేసిన వీడియోలు చూసి చాలా క్యాజువల్ గా ప్రవర్తించడంలో లాజిక్ కనిపించదు.

హీరో నేపథ్యానికి అతడి ఈ ప్రవర్తనకు అసలు సంబంధం ఉండదు. ఇలాంటి అసహజ సన్నివేశాలు ఈ సిరీస్ లో చాలా ఉన్నాయి. కలవడానికి కానీ.. విడిపోవడానికి కానీ బలమైన కారణాలు చూపించకుండా.. లవ్-బ్రేకప్ రెంటినీ తమాషా వ్యవహారం లాగా మార్చేయడంతో ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ సిల్లీగా అనిపిస్తుంది చాలా చోట్ల. లవ్.. బ్రేకప్.. లవ్.. బ్రేకప్ అంటూ కథ ముందుకు కదలకుండా ఒకే చోట తిరుగుతూ ఒక దశ దాటాక ప్రేక్షకులను అసహనానికి గురి చేస్తుంది.కాకపోతే ఈ సిరీస్ లో ఉన్న ప్లస్ ఏంటంటే.. కథలో పెద్దగా విషయం లేకపోయినా.. సిరీస్ ను మరీ సాగదీసినట్లు అనిపించినా.. ప్రతి ఎపిసోడ్ ఎంతో కొంత ఎంటర్టైన్ చేస్తుంది. టైంపాస్ ఎంటర్టైన్మెంట్ కు అయితే ఢోకా లేదు.

ముఖ్యంగా హీరో తమ్ముడిగా చేసిన సంగీత్ శోభన్ ఆద్యంతం ఎంటర్టైన్ చేశాడు. ‘అష్టాచెమ్మా’లో అవసరాల శ్రీనివాస్ ను గుర్తు చేసేలా ఉంటుందతడి పాత్ర. సంతోష్ శోభన్ తమ్ముడే అయిన ఈ కుర్రాడు.. చలాకీ నటనతో ఆకట్టుకున్నాడు. అతడి పాత్ర కూడా కొంచెం క్రేజీగా ఉంది. హీరో కుటుంబం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కూడా ప్రేక్షకులకు ఓ మోస్తరుగా వినోదాన్నందిస్తాయి.

‘ఏక్ మిని కథ’తో మెప్పించిన సంతోష్ శోభన్.. ఈ సిరీస్ లోనూ ఆకట్టుకున్నాడు. పక్కింటి కుర్రాడి పాత్రలకు అతను బాగా సూటవుతాడనిపిస్తుంది. తన నటనలో మంచి ఈజ్ ఉంది. హీరోయిన్ గా చేసిన టీనా శిల్పరాజ్ క్యూట్ గా అనిపిస్తుంది కానీ.. ప్రేక్షకులను కట్టిపడేసేలా మాత్రం లేదు. తన నటన ఓకే. విష్ణుప్రియ కీలక పాత్రలో పర్వాలేదనిపించింది. ఝాన్సీ.. శ్రీకాంత్ అయ్యంగార్.. వెంకట్ తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు. సాంకేతికంగా ‘బేకర్ అండ్ బ్యూటీ’ ఓకే అనిపిస్తుంది.

ప్రశాంతి విహారి సంగీతం.. సురేష్ రగుతు ఛాయాగ్రహణం ఈ సిరీస్ థీమ్ కు తగ్గట్లుగా సాగాయి. నిర్మాణ విలువలు ఓకే. దర్శకుడు జోనాథన్ ఎడ్వర్డ్స్ పనితనానికి యావరేజ్ మార్కులు పడతాయి. జస్ట్ అలా టైంపాస్ చేయడానికి ఓకే కానీ.. అంతకుమించి ఎక్కువ ఆశించే సిరీస్ కాదు ‘బేకర్ అండ్ బ్యూటీ’చివరగా: ది బేకర్ అండ్ ది బ్యూటీ.. జస్ట్ ఫర్ టైంపాస్రేటింగ్-3/5

Tags: #AHA#FILM NEWS#OTT#THE BAKER & BEAUTY MOVIE#THE BAKER & BEAUTY'S MOVIE REVIEW#THE BAKER&BEAUTY#TOLLYWOOD
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • About Us
  • Contact Us
  • DISCLAIMER
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Privacy Policy
  • Terms and Conditions

© Copyright thesakshi.com 2022 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info