thesakshi.com : మరో పది రోజుల్లో ఏపీ అధికార పార్టీ వైసీపీలో మరో కొత్త కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్ట నున్నారు. మే 1వ తేదీ.. మేడేను పురస్కరించుకుని.. జగన్.. ఇంటింటికీ వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహించ నున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆయన తాడేపల్లి నుంచి ప్రారంభించి.. రాష్ట్ర వ్యాప్తంగా నాయకులతో అమలు చేయించాలని నిర్ణయించారు. అయితే.. ఇప్పుడు.. ఎంతమంది నాయకులు.. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు..?
వచ్చే నెల నుంచి ప్రతి నియోజకవర్గంలో నెలకు పది సచివాలయాలను ప్రతి ఎమ్మెల్యే సందర్శించాలని సీఎం వైఎస్ జగన్ నిర్దే వాటి పరిధిలోని గ్రామాల్లో 20 రోజులు పర్యటించి.. ప్రతి ఇంటికి వెళ్లాలని సూచించారు. గత మూడేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా ఆ ఇంటిలోని సభ్యులకు అందిన ప్రయోజనాన్ని వివరించాలన్నారు. అలాగే ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను ఎండగట్టడంతోపాటు తమను ఆశీర్వదించమని ప్రజలను కోరాలని ఇటీవల వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
గడపగడపకూ వెళ్లి ప్రజల ఆశీర్వాదం తీసుకుంటున్న సమయంలోనే బూత్ కమిటీలను పునర్ నిర్మించాలని.. వాటిలో కనీసం 50 శాతం మంది మహిళలు ఉండేలా చూడాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో సగటున 80 సచివాలయాల వరకూ ఉంటాయి. గడపగడపకూ వైఎస్సార్‌సీపీ కార్యక్రమం పూర్తయ్యేసరికి కనీసం ఎనిమిది నెలల సమయం పడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ఆశీర్వాదాన్ని పొందడంతోపాటు బూత్ స్థాయి నుంచి పార్టీ మరింతగా బలోపేతమవుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ విస్తృత కార్యక్రమాలు చేపట్టనుండటంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది.
2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించి.. అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేసి.. వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని.. మంత్రివర్గంలోకి కొత్తవారిని తీసుకుంటామని.. ఇది నిరంతర ప్రక్రియ అని సీఎం వైఎస్ జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల 11న మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలో.. ఎవరికి పార్టీ బాధ్యతలు ఇవ్వాలో తనకు బాగా తెలుసని చెప్పిన సీఎం వైఎస్ జగన్ ఆ మేరకు నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఆదిలోనే చెప్పినట్లుగానే మంత్రివర్గం నుంచి తప్పించినవారికి జిల్లాల పార్టీ అధ్యక్షులుగా, ప్రాంతీయ సమన్వయకర్తలుగా బాధ్యతలు ఇచ్చారు. జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇన్‌చార్జి మంత్రులు, ప్రాంతీయ సమన్వయకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీని సంస్థాగతంగా మరింతగా బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు.ఈ నేపథ్యంలో రేపు ఇంటింటికీ.. కార్యక్రమం పై నాయకులు ఫోకస్ పెట్టారు.