thesakshi.com : బీకాంలో ఫిజిక్స్ చదువుకున్న జలీల్‌ఖాన్ గురించి తెలుసు. తన విద్యార్హతల గురించి అమాయకంగా చెప్పిన ఆ మాజీ ఎమ్మెల్యే సార్‌ను నెటిజన్లు ఇప్పటికీ ఆడుకుంటున్నారు. మరి ఎంబీఏలో ఫిజిక్స్ చదివిన సార్ గురించి ఎంత మందికి తెలుసు? ప‌్రతిష్టాత్మక Stanford విశ్వవిద్యాలయంలో MBAలో ఫిజిక్స్ చేసి, ఆంధ్రప్రదేశ్ కోసం రాజకీయాల్లోకి వచ్చిన ఆ యువ నాయకుడి గురించి తెలియక పోవడం అజ్ఞానం కిందే లెక్క.
భగవంతుడికి, భక్తుడికి మధ్య అనుసంధాన కర్తగా అంబికా దర్బార్ అగర్‌బత్తి ఉన్నట్టుగా …టీడీపీకి, ట్విటర్‌కు మధ్య అనుసంధాన కర్తగా ఎంబీఏలో అరుదైన కోర్సు చేసిన ఆ యువకిశోరం వ్యవహరిస్తున్నారు. ఆయనెవరో తెలుసుకోవడానికి ఇంత కంటే ఉపోద్ఘాతం అవసరం లేదేమో. రాబోయే కాలంలో కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కలలు కంటున్న ఆ యువనేతే నారా లోకేశ్.
పంచాయతీ ఎన్నికల ఫలితాల గురించి లోకేశ్ ట్వీట్ చూసిన తర్వాత ఎవరికైనా MBAలో ఫిజిక్స్ చదివిన వారు తప్ప మరే మేధావి ఇలాంటి లెక్కలేయరనే అభిప్రాయం కలుగుతుంది.
ఒకవైపు ప్రజాస్వామ్యాన్ని రక్షించిన ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూనే, మరోవైపు రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని చెప్పడం ఆయనకు మాత్రమే చెల్లింది. పంచాయతీ ఎన్నికల ఫలితాల గురించి విశ్లేషించడంలో తండ్రికి మించిన తనయుడిగా లోకేశ్ వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు.
డెమోక్రసీకి జగన్ మోనోక్రసీకి మధ్య జరిగిన ఎన్నికల్లో కొంత తేడాతో సంఖ్యా విజయం వైసీపీదైనా… అసలు సిసలు గెలుపు తమదే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలపై లోకేశ్ తాజా ట్వీట్ ఏంటంటే…
‘అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం జరగాల్సిన ఎన్నికలను వైఎస్ జగన్ తన రాజారెడ్డి రాజ్యాంగంతో అడ్డుకున్నారు. మనదేశానికి అర్ధరాత్రి స్వాతంత్ర్యం వస్తే, నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లో అర్థరాత్రి జగన్‌రెడ్డి ఫ్యాక్షన్ పాలిటిక్స్‌కి స్వాతంత్ర్యం వచ్చింది. టీడీపీ మద్దతుతో పోటీచేసే అభ్యర్థుల్ని చంపేశారు, నామినేషన్ వేయకుండా కిడ్నాప్ చేశారు. బెదిరించారు, భయపెట్టారు. కట్టేసి కొట్టారు. అయినా వెనక్కితగ్గని టీడీపీ అభ్యర్థులు లెక్కింపులో ముందంజలో వుంటే.. కరెంట్ నిలిపేశారు.
కౌంటింగ్ కేంద్రాలకు తాళాలేశారు. పోలీసులతో బెదిరించారు. దాడులు చేశారు. టీడీపీ మద్దతుదారులు గెలిచిన చోట్ల రీకౌంటింగ్ పేరుతో వైసీపీ గెలుపు ప్రకటించుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఎన్నడూ లేని విధంగా జగన్‌రెడ్డి అరాచకాలకు పాల్పడినా ధైర్యంగా ఎదురొడ్డి నిలిచి గెలిచిన టీడీపీ కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని రక్షించిన ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు’ అని లోకేశ్ ట్వీటాడారు.
లోకేశ్ ట్వీట్‌లో పేర్కొన్నట్టుగా …అన్ని ఘోరాలు జరిగి ఉంటే ఇంకెక్కడ ప్రజాస్వామ్యం ఉన్నట్టు? చంపేస్తుంటే, కొట్టేస్తుంటే, కిడ్నాప్‌లకు తెగబడుతుంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేతలుగా తండ్రీకొడుకులు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? కేవలం ట్వీట్లతో బాధ్యత నెరవేరిందని నమ్ముతున్నారా? ఇదేనా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలుగా నిర్వర్తిస్తున్న కనీస బాధ్యత? ఉనికి కోసం ఉద్యోగం చేస్తున్నట్టుగా ఏదో ఒక ట్వీట్, విమర్శతో మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారా?
అయినా లోకేశ్ ట్వీట్‌లో పేర్కొన్న అంశాల్లో ఒకదాని కొకటి లంకె కుదరడం లేదు. పరస్పరం విరుద్ధ అంశాల్ని ప్రస్తావించినట్టుగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోకాలికి, బోడిగుండుకు ముడేసినట్టుగా లోకేశ్ ట్వీట్ ఉందని నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు. మరికొందరు జలీల్‌ఖాన్ బీకాంలోనే ఫిజిక్స్, చిన్నసార్ ఎంబీఏలో ఫిజిక్స్ అని ట్రోల్ చేస్తుండడం గమనార్హం.
డెమోక్రసీకి జగన్ మోనోక్రసీకి మధ్య జరిగిన ఎన్నికల్లో కొంత తేడాతో సంఖ్యా విజయం వైసీపీదైనా అసలు సిసలు గెలుపు టిడిపిదే. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం జరగాల్సిన ఎన్నికలను @ysjagan తన రాజారెడ్డి రాజ్యాంగంతో అడ్డుకున్నారు.(1/4) pic.twitter.com/FtFH7f2sE0
— Lokesh Nara (@naralokesh) February 22, 2021