thesakshi.com : గడువు పొడిగించాలని మిత్రదేశాల నుంచి వినతులు వచ్చినప్పటికీ, అఫ్గాన్‌లో తరలింపు ప్రక్రియను ఆగస్టు 31లోగా వేగవంతం చేయాలని అమెరికా భావిస్తున్నట్టు అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు.
“మనం ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది” అని ఆయన చెప్పారు. కొంతమేర అమెరికన్ దళాలు ఇప్పటికే వెళ్లిపోయాయని అమెరికా మీడియా నివేదికలు చెబుతున్నాయి. అయినా తరలింపు ప్రక్రియకు ఎలాంటి ఆటంకం ఏర్పడలేదని తెలిపాయి.
తొమ్మిది రోజుల క్రితం కాబుల్ తాలిబాన్ చేతిలోకి వెళ్లిపోయిన నాటి నుంచి కనీసం 70,700 మందిని విమానంలో తరలించారు.
“తాలిబాన్లు మా ప్రజలను తరలించడానికి సహకారం అందిస్తున్నారు” అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. తాలిబాన్లు చేసే పనుల ద్వారానే అంతర్జాతీయ సమాజం వారిని గుర్తిస్తుంది అని పేర్కొన్నారు.
తాలిబాన్లు తరలింపు గడువును పొడిగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
“మనలో ఎవరూ తాలిబాన్ల నిర్ణయాన్ని అంగీకరించరు” అని బైడెన్ చెప్పారు.
అఫ్గానిస్తాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ నుండి పెరుగుతున్న ముప్పు కారణంగానే ఎయిర్‌లిఫ్ట్ త్వరగా ముగించాల్సి వస్తోందని బైడెన్ చెప్పారు.
అఫ్గాన్లో అమెరికా బలగాలు ఎక్కువ సమయం ఉంటే, ఇస్లామిక్ గ్రూప్ దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
జీ7 సమావేశాల్లో పాల్గొన్న కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూఎస్ లతో పాటు యూరోపియన్ యూనియన్ నాయకులు అఫ్గాన్ సంక్షోభం గురించి వర్చువల్ సమావేశంలో చర్చించిన తర్వాత బైడెన్ మాట్లాడారు.
అఫ్గాన్లో తరలింపు ప్రక్రియ కొనసాగడానికి యూకే, ఇతర మిత్రదేశాలు గడువు ఆగస్టు 31ని పొడిగించాలని అమెరికాను కోరాయి.
చర్చలకు అధ్యక్షత వహించిన యూకే ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. బ్రిటన్ చివరి క్షణం వరకు ప్రజలను తరలించడం కొనసాగిస్తుందని వెల్లడించారు. గడువు దాటిన తర్వాత కూడా అఫ్గాన్ల తరలింపునకు అనుమతించాలని ఆయన తాలిబాన్లను కూడా కోరారు.
“అఫ్గాన్ ప్రజలకు సహాయం చేయడం, పరిస్థితుల మేరకు సాధ్యమైనంత సహకారాన్ని అందించడం తమ నైతిక విధి అని జీ7 నాయకులు అంగీకరించారు” అని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ తెలిపారు.
కాబుల్ విమానాశ్రయంలో దాదాపు 6,000 మంది అమెరికా సైనికులు, యూకే నుంచి 1,000 మందికి పైగా ఉన్నారు. విదేశీయులు, అర్హతగల అఫ్గాన్లలను తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫ్రాన్స్, జర్మనీ, టర్కీతో సహా నాటోకు చెందిన బలగాలు కూడా కాబుల్ విమానాశ్రయంలో ఉన్నాయి.
ఆదివారం నుంచి ఎయిర్ లిఫ్ట్ వేగవంతం చేయడంతో 21,000 మందికి పైగా ప్రజలను తరలించారు. గడువు ఆగస్టు 31కంటే ముందు కొంతమంది అమెరికా సైనికులు వెళ్లిపోవడం “మిషన్‌ను ప్రభావితం చేయదు” అని ఒక అమెరికా రక్షణ అధికారి సీఎన్ఎన్ తో పేర్కొన్నారు.
అంతకుముందు మంగళవారం, తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ, గడువు పొడిగింపునకు తమ సంస్థ అంగీకరించే అవకాశం లేదన్నారు. అఫ్గాన్లు విమానాశ్రయానికి వెళ్లకుండా ఆపేస్తామని చెప్పారు.
అక్కడ గందరగోళంలో “ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది” అని ఆయన విలేకరులతో అన్నారు.
అయితే, ఆయన వ్యాఖ్యలతో పూర్తి ప్రయాణ పత్రాలతో ఉన్న అఫ్గాన్లు కూడా దేశం విడిచి వెళ్లలేరా అనే దానిపై గందరగోళం నెలకొంది.
తాలిబాన్ మిలిటెంట్ల పాలనలోని అఫ్గానిస్తాన్‌ను ఖాళీ చేయడానికి, ఆ దేశం నుంచి బయటపడాలని చూస్తున్న వారిని తీసుకురావడానికి మరింత గడువు కోసం అమెరికాపై ఒత్తిడి పెరుగుతోంది.
తాలిబాన్లతో ఒప్పందం ప్రకారం, అమెరికా దళాలు ఆగష్టు 31లోపు అఫ్గాన్ నుంచి వెళ్లిపోవాలి. ఈ గడువును మరింత పొడిగించేలా, తరలింపును జాప్యం చేయాలని అమెరికాను దాని మిత్ర దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి.
మంగళవారం జరిగే శిఖరాగ్ర సమావేశానికి ముందు అఫ్గాన్ లో గడువును మరింత పెంచడంపై ఫ్రాన్స్, యూకే, జర్మనీలు దృష్టిసారించాయి.
ఉపసంహరణకు గడువు పొడిగించాలా వద్దా అనే విషయాన్ని వచ్చే 24 గంటల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయించబోతున్నారని ఒక అధికారి రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు.
ఏదైనా పొడిగింపు అంటే ఇప్పటికే అంగీకరించిన ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని తాలిబాన్లు బీబీసీకి చెప్పారు. ఇంకా దళాలు మిగిలి ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
అఫ్గాన్ రాజధాని కాబుల్ నుంచి వేలాది మంది ప్రజలను తరలించారు. కానీ పారిపోవడానికి ప్రయత్నించిన మరికొందరు నగరంలోని విమానాశ్రయంలో, సమీప ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. కాబుల్ విమానాశ్రయం అమెరికా దళాలు, దాని మిత్రదేశ సైన్యాల రక్షణలో ఉంది.
ప్రత్యేకించి విదేశీ బలగాలతో కలిసి పనిచేసిన చాలా మంది పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. 1996 నుండి 2001 వరకు తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పుడు వారు విధించిన కఠినమైన శిక్షలకు భయపడి వీరు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు.
“ఆగస్టు 31న అమెరికా విధించిన గడువు గురించి మేము ఆందోళన చెందుతున్నాము. కొనసాగుతున్న కార్యకలాపాలను పూర్తి చేయడానికి అదనపు సమయం అవసరం” అని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-వైవ్స్ లే డ్రియాన్ యూఏఈలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
తాలిబాన్లతో గడువుకు మించి కాబూల్ విమానాశ్రయాన్ని తెరిచి ఉంచడంపై నాటో మిత్రదేశాలు చర్చించినట్లు జర్మనీ విదేశాంగ మంత్రి హైకో మాస్ చెప్పారు.
యూకే ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్.. ఇతర జీ7 నాయకులతో మంగళవారం వర్చువల్ సమ్మిట్ సమయంలో పొడిగింపు కోసం అమెరికాపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు.
యూకే రక్షణ కార్యదర్శి బెన్ వాలెస్ మాట్లాడుతూ “ఉపసంహరణను అమెరికా పొడిగిస్తుందో లేదో చూసి, గడువు పెంచాల్సిన ఆవశ్యకతని ప్రధాన మంత్రి వారికి చెప్పే ప్రయత్నం చేస్తారు” అని అన్నారు.
అమెరికా దళాలు లేకుండా కాబుల్ విమానాశ్రయంలో విదేశీ సైనికులను కొనసాగించలేమని యూకే తెలిపింది.
మంగళవారం నాడు ఏదోఒక నిర్ణయం తీసుకుంటేనే.. సైనికులు వారి పరికరాలు, ఆయుధాలతో పాటు తుది గడువులోపు బయలుదేరడానికి వీలుంటుందని అమెరికా సైన్య సలహాదారులు అధ్యక్ష కార్యాలయానికి స్పష్టం చేశారని సీఎన్ఎన్ వార్తాసంస్థ నివేదించింది.
గడువులోగా ఉపసంహరించుకోవాలని బైడెన్ అంగీకరిస్తే, ఈ వారం రోజుల్లో మరికొన్ని రోజులు మాత్రమే ప్రజలను తరలించే అవకాశం ఉందని, ఆ తర్వాత.. అంటే వారాంతంలో సైనిక దళాల విరమణ ప్రారంభమవుతుందని రక్షణ అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం 5,800 మంది సైనికులు అక్కడ ఉన్నారన్నారు.
వైట్ హౌస్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 11:30, రాత్రి 23:30 మధ్య 10,900 మందిని కాబుల్ నుంచి తరలించారు.
ఆగస్టు 14న వేగంగా ఎయిర్‌లిఫ్ట్ ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా దాదాపు 48,000 మందిని తరలించడం కానీ, తరలింపులో సహాయం కానీ చేసిందని వైట్ హౌస్ పేర్కొంది.
వాషింగ్టన్ డాలస్ విమానాశ్రయంలో తీసిన ఫోటోలు అఫ్గాన్లు అమెరికాకు చేరుకున్నట్టు చూపుతున్నాయి.
పునర్నిర్మాణంలో భాగం కావాలని దేశంలోనే ఉన్న అఫ్గాన్లను తాలిబాన్లు కోరారు. గడువు ముగిసిన తర్వాత కూడా పాస్‌పోర్ట్‌లతో ప్రజలు వాణిజ్య విమానాల్లో బయలుదేరొచ్చని తాలిబాన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ బీబీసీతో చెప్పారు.
“వారు దేశంలో ఉండాలని మేము కోరుకుంటున్నాము, కానీ వారు వెళ్లాలని అనుకుంటే, అది వారి ఇష్టం” అని ఆయన అన్నారు.
దళాలను ఉపసంహరించుకోవాలని అమెరికా నిర్ణయం తీసుకోవడంతో తాలిబాన్లు అఫ్గానిస్తాన్ను తమ ఆదీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే కాబుల్ ను ఆక్రమించిన తర్వాత అమెరికా ఎయిర్‌లిఫ్ట్ ప్రారంభించింది.
తాలిబాన్ల ఏలుబడిలోకి వెళ్లని ప్రాంతంగా పంజ్‌షీర్ ప్రాంతం మాత్రమే మిగిలి ఉంది.
అమెరికాలోని న్యూయార్క్ ట్విన్ టవర్స్ మీద 9/11 దాడులు జరిగిన తర్వాత తాలిబాన్లను అమెరికా, దాని మిత్రరాజ్యాల సైనికులు తరిమికొట్టారు. ఆ తర్వాత వీరి మధ్య 20 సంవత్సరాల సుధీర్ఘ సంఘర్షణ జరిగింది.