thesakshi.com : ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేడెక్కుతోంది. సార్వత్రిక ఎన్నికలకు సమయం మరో రెండేళ్ల లోపే ఉంది. చివరి ఆరు నెలలూ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుతుందనుకుంటే, ఏడాదిన్నర సమయంలోనే అసలు రాజకీయం జరగనుంది. ముందస్తు ఎన్నికల ఊహాగానాలూ ఒక మూలన ఉండనే ఉన్నాయి.
ఇప్పటికిప్పుడు కాకపోయినా, చివరి ఏడాదిలో అయినా జగన్ ముందస్తు ఎన్నికలకు తెర తీస్తారనే టాక్ ఉంది. అయితే జగన్ పొలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో అంతుబట్టనిది. కాబట్టి ముందస్తు ఎన్నికల గురించి ఊహాగానాలు కేవలం ఊహాగానాలు మాత్రమే! ఇది నాణేనికి ఒక వైపు.
ఇంకో వైపు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ల పాలన పూర్తయ్యింది. పదేళ్ల పోరాటం అనంతరం అనుకున్న పదవిని భారీ మెజారిటీతో సాధించుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో కొన్ని అవాంతరాలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. రాజకీయంగా జగన్ తీసుకుంటున్న విధాన పరమైన నిర్ణయాల్లో చాలా వాటికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా తమ విజయానికి ఎటువంటి ఢోకా లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న ఛరిష్మాతోపాటు ప్రజలకు తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గట్టెక్కిస్తాయని భావిస్తున్నారు. తెలుగుదేశంపార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేసినా తమకు మేలే జరుగుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ మూడు పార్టీలు జగన్‌ను ఓడించడానికి ఒక్కటయ్యాయి అనే సానుభూతి ప్రజల్లోకి వెళుతుందని, అంతిమంగా అది తమకు మేలే చేస్తుందంటున్నారు.
రాబోయే ఎన్నికల్లో పనిచేయని ఎమ్మెల్యేలను, ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నవారిని మార్చేస్తామని, దీనివ్లల కొత్తవారితో ఎన్నికలకు వెళతామని, అందులోను ముఖ్యమంత్రి జగన్ 50 శాతం సీట్లు బీసీలకే కేటాయిస్తానని చెప్పారు కాబట్టి బీసీల ఓటు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ వైపు మళ్లుతుందని రాజకీయ వివ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రాన్ని నడపడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదరవుతున్నప్పటికీ…అమ్మ ఒడి లాంటి కొన్ని పథకాలు ఆగకూడదనే దృఢ సంకల్పంతో కొనసాగిస్తున్నామని చెప్పుకొస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలు కూడా బాగా అర్థం చేసుకున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.
కరోనా సమయంలో అమలు చేసిన పథకాలవల్ల ప్రజల ఖాతాల్లో నేరుగా డబ్బులు పడ్డాయని, దానివల్ల వారిలో కొనుగోలు శక్తి తగ్గకుండా చూశామని, అలా చేయడం మొదటిసారి కావడంతో దేశవ్యాప్తంగా ఆ సమయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రశంసలు దక్కాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు, రెడ్లు ఓట్లు సాంప్రదాయంగా తమకే పడతాయని, వాటితోపాటు బీసీ ఓటర్లను కూడా ఆకట్టుకుంటూ జగన్ ముందుకెళుతున్నారని ప్రశంసించారు. గత ఎన్నికల్లో 151 సీట్లే వచ్చాయని, ఈసారి 175కు 175 ఎందుకు రాకూడదని జగన్ ప్రశ్నించారని, వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. కుప్పంలోను, మంగళగిరిలోను బాగా దృష్టిపెట్టి చంద్రబాబును, లోకేష్‌ను ఓడించడంద్వారా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఆత్మవిశ్వసాన్ని దెబ్బతీయాలనే వ్యూహంతో వైసీపీ ముందుకెళుతోందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎటువంటి సంక్షేమ పథకానికి అర్హత పొందనివారంతా జగన్ ప్రభుత్వంలో అర్హత సాధించారని, లబ్ధి పొందామని చెబుతున్నారని, వారంతా వైసీపీకే ఓటు వేస్తామని బహిరంగంగా చెబుతున్నారని, తమ ప్రభుత్వ విజయానికి ఇంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఏం కావాలని ప్రశ్నించారు. ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా సింహం సింగిల్‌గానే వస్తుంది అన్నట్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగిల్‌గానే ఎన్నికలకు వెళ్లి.. రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటుందనే ధీమాను ముఖ్యమంత్రిర జగన్ నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకు వ్యక్తం చేస్తున్నారు.