thesakshi.com : భర్త పనీపాటా లేకుండా తిరుగుతున్నా సహించింది. వ్యసనాలకు బానిసై డబ్బు ఖర్చు చేస్తున్నా ఓర్చుకుంది. మద్యం తాగి వచ్చి తనతోపాటు పిల్లలను కూడా తిట్టడం, కొట్టడం వంటివి చేస్తుండటంతో భరించలేకపోయింది. భర్త ఆగడాలకు చెక్ పెట్టాలనుకుంది. పక్కా స్కెచ్ తో భర్త మద్యం మత్తులో ఉండగా అతడిని చంపేసింది. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్టు ఆసుపత్రికి తీసుకెళ్లింది. అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. అయితే భర్త తరపు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిగింది. చివరకు ఆ భార్య చేసిన నిర్వాకం బయటపడింది. తమదైన స్టైల్లో విచారించగా ఆమె నిజం ఒప్పుకుంది. మొత్తానికి ఆమె కటకటాల పాలయింది. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దక్షిణ ఢిల్లీలోని ఫతేపూర్ బెరీకి చెందిన 35 ఏళ్ల సరితా దేవి స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతోంది. ఆమె భర్త 38 ఏళ్ల సికందర్ సాహ్నీ పనీ పాటా లేకుండా తిరుగుతుండేవాడు. వారికి ఇద్దరు పిల్లలు కూడా. అయితే సికందర్ విపరీతంగా మద్యం తాగడం అలవాటు చేసుకున్నాడు. డబ్బులు ఖర్చు చేస్తూ కుటుంబబాధ్యతలను మర్చిపోయాడు. అంతే కాకుండా రోజూ తాగి వచ్చి సరితాదేవిని పిల్లల ముందే కొట్టేవాడు. అప్పుడప్పుడు పిల్లలను కూడా చిత్రహింసలకు గురిచేసేవాడు. అతడి ఆగడాలను సరితాదేవి భరించలేకపోయింది.
ఆదివారం పూర్తిగా మద్యం మత్తులో ఉన్న భర్తను తన చీరతో గొంతుకు బిగించి చంపేసింది. ఆ తర్వాత మద్యం మత్తులో తన భర్త అపస్మాకర స్థితిలోకి వెళ్లిపోయాడంటూ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు తేల్చారు. అయితే సికందర్ తరపు బంధువులు అతడి మరణం పట్ల అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఆమెను విచారిస్తే తానే చంపినట్లు నిజం ఒప్పుకుంది. భర్త వేధింపులు భరించలేక, అతడు చేసే అవమానాలను తట్టుకోలేకే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు వెల్లడించింది. దీంతో సోమవారం ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సౌత్ ఢిల్లీ డీసీపీ అతుల్ కుమార్ ఠాకూర్ వెల్లడించారు.