thesakshi.com : ఔను.. వాళ్లిద్దరు ఇష్టపడ్డారు. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి ఉండాలని ఎన్నో కలలు కన్నారు. కానీ వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీనికి ఓ బలమైన కారణం ఉంది. వారు వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారు. అందుకే ఇరు కుటుంబాల పెద్దలు అస్సలు ఒప్పుకోలేదు.
ప్రేమ పేరుతో తమ పరువు తీస్తున్నారని చివాట్లు పెట్టారు. ఐనా మాట వినకపోవడంతో ఇద్దరినీ కొట్టారు. అంతే.. ఆ ప్రేమ జంటకు ఓ క్లారిటీ వచ్చింది. తాము పెళ్లి చేసుకోలేమని అర్ధమయింది. కలిసి జీవించలేకపోవచ్చు గానీ.. కలిసి చనిపోతామని నిశ్చయించుకున్నారు. అనంతరం చెట్టుకు ఉరేసుకొని మరణించారు. బీహార్‌లోని బంకా జిల్లాలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంకా జిల్లాలోని బదాసన్ గ్రామానికి చెందిన ఓ యువతి, ఓ యువకుడు ప్రేమించుకున్నారు. వీరిద్దరు వరుసకు అన్నా చెల్లెలు అవుతారు. కానీ తమ ప్రేమకు వీరి బంధం అడ్డుకాలేదు. మనసులు కలిశాయి. పెళ్లి చేసుకొని.. కలిసి జీవించాలని అనుకున్నారు. కానీ ఆరు నెలల క్రితం వీరి ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు తెలిసింది. అన్నాచెల్లెల్లై ప్రేమించుకుంటారా.. సిగ్గులేదా.. అని మండిపడ్డారు. ఇద్దరినీ కొట్టారు. ఇంకోసారి కలిశారో.. అంతుచూస్తామంటూ హెచ్చరించారు. ఇద్దరినీ విడతారు. ఆ అబ్బాయిని పని కోసం కోల్‌కతా పంపించారు. అమ్మాయిని తన మేనమామ ఇంటికి పంపించారు. ఇద్దరు దూరంగా ఉన్నప్పటికీ.. మనసులు మాత్రం దగ్గరగానే ఉన్నాయి. ఆమె గురించి అతడు.. అతడి గురించి ఆమె ఆలోచించేవారు. కుటుంబ సభ్యులకు తెలియకుండా ఫోన్‌లో మాట్లాడుకునే వారు.
ఇటీవలే ఆ అమ్మాయి తన మేనమామ ఇంటి నుంచి స్వగ్రామానికి వచ్చింది. ఈ విషయం తెలిసి అతడు కూడా కోల్‌కతా నుంచి వచ్చాడు. మంగళవారం రాత్రి ఇద్దరు రహస్యంగా కలుసుకున్నారు. గ్రామ శివారులోని పంట పొలాల్లోకి వెళ్లి.. రాత్రంగా అక్కడే ఉన్నారు.
,గంటల తరబడి మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో ఏమో గానీ.. మరుసటి రోజు ఉదయం ఇద్దరి శవాలు చెట్టుకు వేలాడుతు కనిపించాయి. తమ ప్రేమను పెద్దలు ఎప్పటికీ ఒప్పుకోరని.. కలిసి జీవించలేకున్నా.. కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం అటుగా వచ్చిన కొందరు వ్యక్తులు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను చూసి.. గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు.
స్థానికులు అక్కడి చేరుకొని పెద్ద ఎత్తున గుమిగూడారు. వీరిద్దరు ప్రేమించుకున్నారని.. వరసకు అన్నాచెల్లెల్లు అవుతారని చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇరు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనలో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.