thesakshi.com : ప్రస్తుతం ఏపీలో ఉన్న మంత్రి మండలి ఈరోజు చివరిసారిగా సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలో రాజీనామాలకు సంబంధించిన అంశాన్ని సీఎం జగన్ అధికారికంగా ప్రకటిస్తారు. అనంతరం మంత్రులంతా రాజీనామాలు చేసి గవర్నర్ కి పంపిస్తారు. గవర్నర్ ఆమోదంతో వారంతా మాజీలవుతారు.
ఏపీ మంత్రి మండలిలో ఎవరెవరు కొనసాగుతారు, ఎవరెవరు రాజీనామా చేస్తారనే విషయంపై ఇప్పటికీ అధికారిక సమాచారం లేదు. సామాజిక సమీకరణాలతో ఒకరిద్దరు మంత్రుల్ని కొనసాగించే అవకాశముంది. మిగతా టీమ్ అంతా కొత్తవారే ఉంటారు. అయితే కొత్తగా మంత్రి పదవులు పొందేవారు కూడా ఇంకా గుంభనంగానే ఉన్నారు. ఈ విషయంలో ఎక్కడా ఎలాంటి సమాచారాన్ని లీక్ కాకుండా చూసుకున్నారు సీఎం జగన్. అధికారిక ప్రకటన, ప్రమాణ స్వీకారం రెండూ ఈనెల 11నే ఉంటాయని తెలుస్తోంది.
మూడేళ్లుగా మంత్రులుగా కొనసాగుతూ..అటు సీఎంతో..ఇటు అధికారులతో.. తమ సిబ్బందితో కొనసాగిన వారు ఇక మాజీలు కాబోతున్నారు. దాదాపు మంత్రులంతా దీని కోసం మానసికంగా సిద్దమయ్యారు. 2019 కేబినెట్ ఏర్పాటు సమయంలోనే సీఎం జగన్ రెండున్నారేళ్ల తరువాత మంత్రులు మారుతారని స్పష్టం చేసారు. కొంత కాలంగా మార్పుల పైన సంకేతాలు ఇస్తున్నారు. ఇక, ఆ రోజు రానే వచ్చింది. పలువురు మంత్రులు విజయవాడలోని తమ క్యాంపు కార్యాలయాలు ఖాళీ చేసేందుకు సిద్దమయ్యారు. మంత్రుల వద్ద పని చేస్తున్న సిబ్బంది.. కొత్తగా వచ్చే మంత్రుల వద్ద చేరేందుకు ప్రస్తుత మంత్రులతో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో మంత్రులకు తమ శాఖల పరిధిలోని అధికారులు విందులు ఏర్పాటు చేస్తున్నారు.
తాజాగా.. రవాణా శాఖ అధికారులు మంత్రి పేర్ని నానికి విందు ఇచ్చారు. ఇక, ఈ రోజు మీడియా ప్రతినిధుల కోసం మంత్రి పేర్ని నాని వీడ్కోలు విందు ఏర్పాటు చేసారు. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు అవుతున్నా..దాదాపు ఏడాదిన్నారకు పైగా కరోనా కారణంగా విధులు పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోయామని మంత్రులు చెబుతున్నారు. ఇక, మరి కొందరు సీనియర్ మంత్రులు కేబినెట్ విషయం లో సీఎం నిర్ణయం తమకు శిరోధార్యమని స్పష్టం చేస్తున్నారు. ప్రతిపక్షాల పైన విరుచుకుపడటంలో..మంత్రులుగా ప్రభుత్వం – పార్టీ వాయిస్ బలంగా వినిపించే మంత్రులుగా పేరున్న బొత్సా .. పెద్దిరెడ్డి.. బుగ్గన .. కన్నబాబు.. పేర్ని నాని..కొడాలి నాని..అనిల్..బాలినేని వంటి వారికి కొనసాగింపు ఉంటుందనే అంచనాలు నిన్న మొన్నటి వరకు వినిపించాయి. కానీ, వీరిలో ఎవరికీ తిరిగి కొనసాగే ఛాన్స్ లేదని తెలుస్తోంది.
పూర్తిగా సామాజిక – ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా చేస్తున్న ప్రక్షాళన కావటంతో..వీరు పార్టీ బాధ్యతలు తీసుకోనున్నారు. వీరికి పార్టీ పరంగా రీజనల్ ఇన్ ఛార్జ్ లు.. జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. సీఎం జగన్ ఇప్పటికే కొందరు మంత్రులతో వ్యక్తిగతంగా వారిని ఎందుకు తప్పించాల్సి వస్తోంది..కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలి..తప్పిస్తున్న వారికి భవిష్యత్ లో కల్పించే అవకాశాల పైన హామీలు ఇస్తున్నారు. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో తన మనసులోని మాటలను సీఎం బయట పెట్టే ఛాన్స్ ఉంది. దీంతో..ఈ జరిగే కేబినెట్ సమావేశం ఒక విధంగా ఉద్వేగ సమయంగా అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. కేబినెట్ ముగిసిన తరువాత ఇక, మాజీలు కాబోతున్న ఈ మంత్రులు తమ వ్యక్తిగత వాహనాలలోనే రిటర్న్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.