thesakshi.com : ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకూ టెర్రర్ పుట్టిస్తున్నాయి. రహదారులు రక్తమోడేలా చేస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట ఈ ప్రమాద వార్తలు వినాల్సి వస్తోంది. నిద్రమత్తు.. నిర్లక్ష్యమో.. అతి వేగమో ఏదో ఒక రూపంలో మనుషుల ప్రాణాలను తీసేస్తున్నాయి.
కొండంత ఆశతో ప్రయాణాలు చేస్తున్న వారికి.. బస్సులే యమపాశంగా మారుతున్నాయి. వారి జీవితాలకు ముంగింపు పలికేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. హెచ్చరికలు జారీ చేస్తున్నా.. ఒకరిద్దరి నిర్లక్ష్యానికి మరికొందరు బలి కావాల్సి వస్తోంది. డ్రైవర్ల నిర్లక్ష్యం, ప్రమాదాలు జరుగుతున్నాయనే ప్రదేశాలను గుర్తించి అధికారులు.. అక్కడ హెచ్చరికల బోర్డులు పెట్టడకపోవడం. నిద్రమత్తులో వాహనాలు నడుపుతుండడం.. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం ఇలా పలు కారణాలతో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రాత్రి అనంతపురం జిల్లా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. లారీ లో ఉన్న ఇద్దరు, బస్సు లోని ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలు అయ్యాయి. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
మిడుతూరు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని.. వెనక వైపు నుంచి వేగంగా వస్తున్న బస్సు ఢీ కొట్టిన ఈ ప్రమాదం సమయంలో బస్సులో ఇరవై మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకోగానే అక్కడకు చేరుకున్న పోలీసులు.. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడిన వారిని అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలు కాస్త ఆలస్యమవ్వగా.. ప్రమాదం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ప్రమాదానికి గల కారణాలను విచారణ చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తు వలనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాధమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. క్షతగాత్రులు పూర్తిగా కోలుకుంటే.. ప్రమాదానికి కారణాలు తెలుస్తాయి.