thesakshi.com : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఇప్పుడు రెండు దశాబ్దాల పార్టీ. ఒక రాజకీయ పార్టీ చరిత్రలో రెండు దశాబ్దాల ఉనికి, రెండుసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీగా టీఆర్ఎస్ జరుపుకుంటున్నది ఒక విధంగా విజయమే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లక్ష్యాన్ని సాధించేవరకూ ఒక స్పష్టమైన, మడమతిప్పని రాజకీయ పోరాటం చేస్తామనే హామీతో 2001లో టీఆర్ఎస్ స్థాపన జరిగింది.
ప్రజలు, ఉద్యోగ సంఘాల చురుకైన భాగస్వామ్యంతో ఉద్ధృతంగా సాగిన తెలంగాణ ఉద్యమంతో… ప్రత్యేక రాష్ట్ర సాధన డిమాండ్‌పై ప్రత్యేక దృష్టి సారించే పార్టీలు లేవనేది కొట్టొచ్చినట్టు కనిపించింది.
వామపక్షాలు (ఆంధ్రప్రదేశ్ విభజనను స్పష్టంగా వ్యతిరేకించిన సీపీఎం మినహా) తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ నాయకత్వం ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ చేస్తున్నట్టు కనిపించినప్పటికీ, ఆయా పార్టీల కేంద్ర నాయకత్వం నుంచి ఈ అంశంపై స్పష్టమైన మద్దతు లభించలేదు.
ఈ అస్పష్టత ఫలితంగా వెల్లువెత్తిన ప్రజా ఉద్యమం, చివరకు కె.చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటించేలా చేసింది. టీఆర్ఎస్ ప్రకటించిన తన ఏకైక లక్ష్యం తెలంగాణలో ఆ పార్టీకి ఒక ప్రత్యేక ఇమేజ్ అందించింది. వాస్తవానికి రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అది అధికారంలోకి రావడం కూడా జరిగింది.
ఉద్యమానికి రాజకీయ ముఖంగా ఉండడానికి టీఆర్ఎస్ అంగీకరించడం అనేది అంత సజావుగా సాగలేదు. సైద్ధాంతిక పరంగా వామపక్షం వైపు మొగ్గుచూపిన ఉద్యోగ సంఘాలు, బలమైన చాలా మంది పౌరుల నుంచి, ఉద్యోగ సంఘాల నుంచి సందేహాలను, ప్రతిఘటనను ఎదుర్కొంది.
నిజానికి వీటిలో కొన్ని, వామపక్ష పార్టీలకు అనుబంధంగా కూడా ఉన్నాయి. విభజనకు గురైన పౌరుల నుంచి టీఆర్ఎస్‌కు అసమ్మతి, తీవ్రమైన సవాళ్లు ఎదురవడానికి ఒక కారణం టీఆర్ఎస్ అధినేత ఏకపక్ష వైఖరి.
టీఆర్ఎస్ పార్టీని ఛిన్నాభిన్నం చేసేందుకు రాష్ట్రంలో బాగా పాతుకుపోయిన కాంగ్రెస్, టీడీపీ శ్రేణులు చేస్తున్న ప్రయత్నాలకు ఇది తోడైంది. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ సాధించిన విజయం దీనికి ఒక నిదర్శనం.
ఇది కేవలం సంస్థాగత, ప్రాదేశిక పోటీ కాదని గమనించాలి. దానికన్నా మరింత ముఖ్యమైన తెలంగాణలోని రెండు విభిన్న, విరుద్ధమైన ఊహల మధ్య వైరుధ్యం అని తెలుసుకోవాలి. ఇక్కడి పౌర సమాజం గురించి వారి పాటలు, కథలు, ప్రసంగాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
‘సామాజిక తెలంగాణ’ అంటే అందరినీ కలుపుకొని, ప్రతిస్పందించే ప్రజాస్వామ్య వ్యవస్థగా…. ‘భౌగోళిక తెలంగాణ’ అంటే ఏపీ విభజన ద్వారా ఏర్పడిన రాజకీయ భూభాగంగా భావించారు. అందుకే ప్రజాసమూహంతో పాటు ఒక కొత్త వ్యక్తి ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీతో పోటీకి స్వాగతించని ఇతర రాజకీయ పార్టీల నుంచి కూడా టీఆర్‌ఎస్ అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది.
హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తర్వాత రాజకీయ సమతుల్యతలో కొంత నాటకీయ మార్పులు కనిపించాయి. ఆయన నిష్క్రమణతో కాంగ్రెస్ నాయకత్వంతో పాటు ప్రభుత్వ పరిధి, పార్టీ స్థాయిలోనూ నాయకత్వ శూన్యత ఏర్పడింది.
ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కోసం ఉధృతమైన జనసమీకరణకు ఈ పరిస్థితులు అనుకూలంగా మారాయి. అదే సమయంలో, బలహీనమైన కాంగ్రెస్‌తో పాటు కుల ఆధారిత రాజకీయ పార్టీ అయిన టీడీపీ వల్ల టీఆర్‌ఎస్‌కు ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగడం మరింత సులభం అయింది.
టీడీపీ పునాదులు కమ్మ సామాజిక వర్గంతో ముడిపడి ఉండటం వల్ల ఆ పార్టీని ఆంధ్రా బ్రాండ్‌గా నమ్మించడం తేలికైంది. అందుకే అది తెలంగాణలో అధికారం చేపట్టేందుకు తగని పార్టీగా ప్రజలు వ్యతిరేకించారు.
ఈ పరిస్థితులన్నీ 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయానికి దోహదపడ్డాయి. ఒకసారి అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ పార్టీ తమ బలహీనతలను అధిగమించేందుకు సహాయపడే విధానాలను, రాజకీయ పాలనను రూపొందించింది.
అందులో ఒకటేమో… కొత్త రాష్ట్రంలో తక్కువ ఉనికిని కలిగి ఉన్న రైతు కులానికి అధికారం దక్కడం. ఈ ప్రాంతం, గతంలో సంఖ్యాపరంగా అధికంగా ఉండే, భూస్వాములుగా పరిగణించబడే రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యాన్ని చూసింది. రెండోది… టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలను దూరం చేసి వారి మద్దతును కూడగట్టుకోవడం.
‘అల్పులకు అండగా నిలవడం’ అనే విధానపరమైన పాలనను కేసీఆర్ సర్కారు ఎంచుకుంది. ఇది రెండు వైపులా పదునున్న కత్తి లాంటి వ్యూహం. ఈ విధానంలో నాయకుడికి పితృస్వామ్య హోదా దక్కుతుంది.
అంటే సర్కారు ప్రవేశపెట్టే, నిర్వహించే పథకాలన్నీ ఆయన దాతృత్వానికి ప్రతిబింబంగా కనిపిస్తుంటాయి. మరోవైపు ప్రజలకు ఉన్న వాస్తవ లేదా ఊహాజనిత అవసరాలను కూడా ఈ విధానం సమర్థవంతంగా నెరవేరుస్తుంది. అందుకే మనకు ఇప్పుడు విస్తృతమైన పథకాలు అందుబాటులో వచ్చాయి.
పెద్ద సంఖ్యలో జనాభాకు ఉపయోగపడే చాలా పథకాలను ఈ విధానం ద్వారా ప్రవేశపెట్టారు. ఇందులో ప్రముఖంగా సబ్సిడీ బియ్యం, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు అందించే ఆసరా పెన్షన్ పథకం.. హిందు, ముస్లిం మైనారిటీ కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం, ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన గొల్ల, కుర్మ, ముతరాసి, బెస్తా, గంగపుత్రుల కోసం గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ పథకం.. బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికుల కోసం పలు పెన్షన్ స్కీమ్‌లు ప్రవేశపెట్టారు.
ఇలా వృత్తిపరమైన, కులపరమైన పథకాలు ఆయా వర్గాల వారికి ఆర్థిక సాధికారతను అందజేస్తున్నాయి. కానీ శాసన సభల్లో, స్థానిక సంస్థల్లో, ఇతర విధాన నిర్మాణ శాఖల్లో ఈ వర్గాల వారి ప్రాతినిధ్యం లేకపోవడం టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో వీరు ఒకరకమైన నిర్లక్ష్యానికి గురవుతున్నట్లుగా కనిపిస్తోంది.
విద్య, వైద్యం, నీటి పారుదల, వ్యవసాయ రంగాల్లో వెనుకబాటు, నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణ ఉద్యమం తారస్థాయికి చేరింది. ఆంధ్రా పాలక వర్గమైన టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నిర్లక్ష్యానికి పర్యవసానంగానే ఈ ప్రాంతం నిరాదరణకు గురైందని, ఈ రంగాలన్నీ వెనుకబాటులో ఉన్నాయని అంచనా వేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, ఈ రంగాలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే, అత్యంత ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజెక్టులను పూర్తి చేశారు. గ్రామాల్లో సాగునీటి వ్యవస్థను పునరుద్ధరించి, లిఫ్టు ఇరిగేషన్ ద్వారా నీటిపారుదల అవసరాలను తీర్చడం మొదటిదైతే… రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి తాగునీటి సరఫరా చేసేందుకు ఉద్దేశించినది రెండోది.
రైతు సమాజానికి మద్దతుగా రైతు బీమా, రైతు బంధు అనే పథకాలు కూడా అమల్లోకి వచ్చాయి. రైతు బీమా కింద నమోదు చేసుకున్న 18 నుంచి 59 ఏళ్ల రైతులకు, మరణానంతరం రూ. 5 లక్షలు చెల్లిస్తారు. రైతు బంధు అనేది నగదు బదిలీ పథకం. దీని ద్వారా రైతులకు రెండు పంటలకు, రెండు విడతల్లో వ్యవసాయ పెట్టుబడిని అందిస్తారు.
అధికారిక కోణంలో ఈ పథకాలు మెచ్చుకోదగినవే అయినప్పటికీ, ఆచరణలో కొన్ని అంశాలు మరింత ప్రత్యేక శ్రద్ధ కోరుకునేలా ఉన్నాయి. రాష్ట్రంలోని తాజా వ్యవసాయ పరిస్థితుల్ని పరిశీలిస్తే, ఈ రంగంలో నెలకొన్న ఒక పెద్ద సమస్య మనల్ని హెచ్చరిస్తుంది. అదేంటంటే రాష్ట్రంలో అధికభాగం సాగు… కౌలు లేదా భాగస్వామ్య పద్ధతిలో జరుగుతోంది.
వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టిన పథకాల్లో ఉన్న ప్రధాన లోపం ఏంటంటే… సాగుదారు కాకుండా భూమి యజమానే ఈ పథకాలు పొందేందుకు అర్హుడు అవుతున్నాడు. ఈ పథకానికి అర్హులైన, దీని అవసరమున్న కౌలు రైతులు.. సాగు చేస్తున్న భూమి తమది కాకపోవడంతో ఈ పథకం ఫలాలను పొందలేకపోతున్నారు. భూమి హక్కును కలిగి ఉండి వ్యవసాయానికి దూరంగా ఉన్నవారు దీని ద్వారా లాభాన్ని పొందుతున్నారు.
అర్హులకు, రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామన్న హామీని నెరవేర్చకపోవడం… ప్రతిపక్షాలు ప్రధాన అజెండాగా తీసుకున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 3 ఎకరాల భూమిని ఇవ్వకపోవడం లాంటి వాగ్దానాలు టీఆర్ఎస్ ప్రతిష్టను కాస్త మసకబార్చాయి.
ఇక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆర్థిక ప్రోత్సాహకాలుగా పనిచేస్తున్నాయి. కానీ దీనివల్ల కొన్నిసార్లు హిందూ, ముస్లిం మైనారిటీ కుటుంబాలకు చెందిన ఆడపిల్లల విద్య, సామాజిక ఆకాంక్షలను దెబ్బతీసే బాల్యవివాహం లాంటి అనుకోని పర్యావసానాలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి అవసరమైన విధానపరమైన సవరణలను పరిశీలించాల్సిన అవసరం ఉంది.
సామాజిక, మానవాభివృద్ధికి సూచిక అయిన విద్య (ఆరోగ్యం కూడా)కు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఉన్నత విద్యపై అధిక దృష్టి సారించాలి. దీనిపైనే, మొత్తం సామాజిక అభివృద్ధి ఆధారపడి ఉంటుంది.
కాబట్టి తెలంగాణ వంటి కొత్త రాష్ట్రాలు ప్రాధాన్యత ఆధారంగా ఈ రంగంపై మరింత శ్రద్ధ వహించాలి. తెలంగాణకు ఆత్మ వంటి, శతాబ్ధాల నాటి ఉస్మానియా యూనివర్సిటీ శిథిలావస్థకు చేరుకోవడం టీఆర్ఎస్ ప్రభుత్వ దార్శనికతలో ఉన్న లోపాలకు నిదర్శనంగా నిలుస్తుంది.
గత రెండు దశాబ్ధాలుగా ఎలాంటి వ్యతిరేకత లేకుండా ఏకగ్రీవంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నికవ్వడం పార్టీలోని ప్రజాస్వామ్య స్థితికి అద్ధం పడుతుంది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్య లేమి, పితృస్వామ్య పాలన, జనాకర్షక పాలన, నిరంకుశ పాలనల మధ్య ఉండే అంతర్గత సంబంధాన్ని ఎవ్వరూ విస్మరించలేరు.
పార్టీలో అంతర్గత విభేదాలు, మీడియాతో గొడవలు, పౌర సమాజాన్ని నిర్వీర్యం చేయడం, ఏకకేంద్ర విధానాల అమలు తదితర వాటిలో ప్రజాస్వామ్య ధోరణి ఎలా ఉందో ప్రతిబింబిస్తుంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధమైన ప్రస్తుత టీఆర్ఎస్ పాలన ఈ నిరంకుశ లక్షణాలన్నింటికీ నిదర్శనంగా ఉంది.
మిగతా అన్ని అధికార పార్టీలు, ప్రభుత్వాల తరహాలోనే టీఆర్ఎస్ కూడా వాస్తవమైన, కల్పిత సవాళ్లతో కూడిన అభద్రతాభావానికి గురవుతోంది. ఏ స్థాయిలోని అభిప్రాయభేదాన్నైనా ఏకంగా అధికారానికే ముప్పు కలిగించే ప్రమాదంగా పరిగణిస్తోంది.
టీఆర్ఎస్ పార్టీలో ఓబీసీల ప్రతినిధి, సుదీర్ఘ కాలంగా కేసీఆర్‌కు విధేయుడిగా ఉన్న కీలక నేత ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి తొలిగించిన తీరు, ఆ పార్టీలో ఉన్న అభద్రతాభావానికి పరాకాష్టగా నిలిచింది.
ఇప్పుడు ఈటల బీజేపీలో చేరడం, టీఆర్ఎస్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అనేదానికి కాలమే సమాధానం చెబుతుంది.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అయిన అభ్యుదయ సామాజిక రాజకీయాలకు భిన్నంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన సాగింది. ఒకానొక దశలో తిరోగమనం దిశగా ప్రయాణించింది. తెలంగాణ ఉద్యమంలో అల్ప కులాలు, సమాజాలు కీలక పాత్ర పోషించాయి.
రాష్ట్రావతరణ తర్వాత టీఆర్ఎస్ పాలనలో ఈ వర్గాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. టీఆర్ఎస్ పాలనలో నిరాదరణకు గురైన ఓబీసీలు, మహిళల ప్రాతినిధ్య లేమి అనే అంశాలు ప్రతిపక్షాలకు ప్రచారంలో ప్రధాన అస్త్రాలుగా మారాయి.
ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ చేసిన వాగ్దానాలతో ఉద్యోగ, ఉపాధి రంగాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న విద్యార్థులు, యువత కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నట్లు భావిస్తున్నారు.
అంతేకాకుండా తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ నాయకత్వం దూకుడుగా మారడం టీఆర్ఎస్‌కు తలనొప్పిగా మారింది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీపై పెరుగుతున్న అసంతృప్తి ద్వారా ఈ రెండు పార్టీలు లబ్ధి పొందనున్నాయి.
రాష్ట్రంలో టీడీపీని పూర్తిగా తుడిచిపెట్టడం, కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు టీఆర్ఎస్ ‘ఆకర్ష్’ వల విసరడంతో ఇక్కడ రాజకీయ శూన్యత ఏర్పడింది. దక్షణాదిలో పాగా వేయడానికి తెలంగాణను ఒక మంచి అవకాశంగా బీజేపీ భావిస్తోంది
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన పౌర సమాజ సంఘాలు, తక్కువ కులాల గ్రూపుల క్రియాశీలత తగ్గడంతో పాటు రాష్ట్రంలో ప్రతిపక్షం బలహీనంగా మారడంతో ప్రభుత్వ విధానాలపై బహిరంగ చర్చలు పూర్తిగా తగ్గిపోయాయి. రాజకీయ రంగాలను ఎన్నికలు శాసించడం, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం క్షీణించడంతో ఇతర శక్తులు ఇక్కడ పాగా వేసేందుకు మంచి అవకాశం ఉంది.