thesakshi.com : తెలుగు రాష్ట్రాలతోపాటు యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసిన ‘మహేశ్ బ్యాంకు హ్యాకింగ్ కేసు’ను హైదరాబాద్ పోలీసులు చేధించారు. అయితే ప్రధాన సూత్రధారి, కేసులో ఏ1 ముద్దాయి మాత్రం పోలీసులకు చిక్కలేదు. ఈ కేసులో మొత్తం 23 మందిని అరెస్టు చేశారు. మహేశ్ బ్యాంకు సర్వర్ ను హ్యాక్ చేసి ఏకంగా కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వ్యవహారం, దర్యాప్తు సాగిన తీరు, అరెస్టులు, ప్రధాన నిందితుడి పట్టివేతకు ఏం చేస్తున్నది తదితర వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాకు వెల్లడించారు.
ఆంధ్రా, తెలంగాణతోపాటు పటు ఇతర ప్రాంతాల్లోనూ సేవలందిస్తూ, హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే మహేశ్ కోఆపరేటివ్ బ్యాంకులో ఈ ఏడాది జనవరిలో భారీ చోరీ జరిగింది. బ్యాంకు ప్రధాన కార్యాలయంలోని మెయిన్ సర్వర్ సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్ చేసిన దుండగులు రూ.12.90 కోట్లను కొల్లగొట్టారు. ఖాతాదారుల అకౌంట్ల నుంచి కాకుండా బ్యాంకు వారి సొంత ఖాతాల నుంచే డబ్బులు మాయం అయ్యాయి.
హ్యాకింగ్ ను గుర్తించిన వెంటనే బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడం, నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అప్రమత్తమై ఆధునిక టెక్నాలజీ సాయంతో డబ్బులు తరలిపోకుండా అడ్డుకోకుంటే ఇంకా భారీ మొత్తంలో డబ్బును హ్యాకర్లు దొంగిలించేవారే. ఈ కేసును రెండు నెలలపాటు దర్యాప్తు చేశామని, తెలంగాణ చిత్రలోనే ఖరీదైన దర్యాప్తుగా ఇది నిలిచిందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
మహేశ్ బ్యాంక్ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకుని ఛేదించామని, వంద మందితో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు రెండు నెలలపాటు దర్యాప్తు చేశామని, ఏ కేసుకు ఖర్చు కానన్ని డబ్బులు.. మహేష్ బ్యాంకు కేసు విచారణకు అయిందని, టీఏ, డీఏ కలిపి ఈ కేసు దర్యాప్తునకు రూ. 58 లక్షలు ఖర్చయ్యాయని సీపీ ఆనంద్ తెలిపారు. మహేశ్ బ్యాంకు సర్వర్ లో లోపాల కారణంగానే హ్యాకింగ్ సాధ్యమైందని, టెక్నాలజీ వ్యవస్థను సురక్షితంగా ఉంచుకోవడంలో మహేశ్ బ్యాంకు నిర్లక్ష్యం కనిపిస్తోందనీ సీపీ పేర్కొన్నారు.
అసలు బ్యాంకు చోరీ ఎలా జరిగిందో సీపీ వివరాలు చెప్పారు. తొలుత హ్యాకర్లు మహేశ్ బ్యాంక్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు 200 ఫిషింగ్ మెయిల్స్ పంపించగా, ఇద్దరు ఉద్యోగులు మాత్రమే ఆ ఫిషింగ్ మెయిల్స్‌ను క్లిక్ చేశారని.. అందులో ఉన్న ర్యాట్ సాఫ్ట్ వేర్ ద్వారా బ్యాంక్ సాఫ్ట్‌వేర్ హ్యాకర్ల చేతికి వెళ్లిందని, ఆ తర్వాత కీ లాకర్ సాఫ్ట్‌వేర్‌ను ఆ సిస్టమ్స్‌కి పంపించారని..దాంతో ఆ ఇద్దరు ఉద్యోగులు ఏం చేసినా హ్యాకర్స్‌కి తెలిసిపోయేదన్నారు. ఉద్యోగులు కంప్యూటర్లు షట్‌డౌన్ చేసిన తర్వాత హ్యాకర్లు సిస్టమ్స్ ఓపెన్ చేసి బ్యాంక్ సూపర్ అడ్మిన్స్ లాగిన్, పాస్‌వర్డ్ తస్కరించారని, డేటా బేస్‌లోకి వెళ్లి ట్రాన్సాక్షన్ పూర్తి చేశారని సీపీ తెలిపారు.
హ్యాకింగ్ ముఠా చాలా పకడ్బందీగా నేరాలకు పాల్పడుతున్నదని, బ్యాంకు లావాదేవీలు నిర్వహించుకునేందుకు పథకం ప్రకారం ఓ టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారని సీపీ చెప్పారు. హ్యాకింగ్ కు ముందే మహేశ్ బ్యాంకులో పలు చోట్ల కొందరితో ఖాతాలు తెరిపించారని, షాహనాజ్ బేగం, నవీన్ కుమార్, వినోద్ కుమార్, సంపత్ కుమార్, కటకం కోటేశ్వర్, ప్రియాంక ఎంటర్ ప్రైజెస్, ఫాతిమా తదితర పేర్లతో వ్యక్తిగత, బిజినెస్ అకౌంట్లు ఉన్నాయని, ఈ ఖాతాదారులకు పది శాతం కమిషన్ ఇచ్చేలా హ్యాకర్లు డీల్ కుదుర్చుకున్న తర్వాతే అకౌంట్లు తెరిచారని, వారి ద్వారా మరో 115 అకౌంట్లు.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా 300లకు పైగా ఖాతాలను హ్యాకర్లే తెరిపించారని సీపీ సీవీ ఆనంద్ వివరించారు.
హ్యాకింగ్ కు వీలుపడేలా మహేశ్ బ్యాంకు ఉద్యోగులకు ఫిషింగ్ మెయిల్స్ వచ్చిన ఐడీలను ట్రాక్ చేశామని, సైబర్ నేరగాళ్లు ప్రాక్సీ ఐపీలు ఉపయోగించారని, ఒక ఐపీ స్విట్జర్లాండ్, మరొకటి కెనడాలో చూపిస్తోందని కమిషనర్ చెప్పారు. ఈ కేసులో మొత్తం 23 మందిని అరెస్టు చేశామని, ప్రధాన నిందితుడు ఎక్కడ ఉంటాడో ఇంకా తెలియలేదన్నారు. కాగా, ఏ2 స్టీఫెన్ ఒర్జీ సెకండ్ లెవల్ హ్యాకర్ అని, నైజరీయన్‌లోని ప్రధాన నిందితుడికి కీలక సమాచారం చేరవేసింది స్టీఫెనే అని సీవీ ఆనంద్ తెలిపారు. అరెస్ట్ అయినవారిలో నలుగురు నైజీరియన్లు ఉన్నారని తెలిపారు. ప్రధాన హ్యాకర్‌ను అరెస్ట్ చేసేందుకు.. ఇంటర్ పోల్‌ను ఆశ్రయించి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తామన్నారు.
ప్రజల సొమ్ముతో నడిచే బ్యాంకులు సైబర్ సెక్యూరిటీ విషయంలో నిర్లక్ష్యం వహించడం తగదని సీపీ అన్నారు. మహేశ్ బ్యాంకు కేవలం ఒకే ఒక్క నెట్‌వర్క్(సింగిల్ నెట్ వర్క్)తో నడిపిస్తున్నారని, బ్యాంకింగ్ వ్యవస్థలో ఒకే నెట్‌వర్క్ వాడకూడదని తెలిసినా వాళ్లలా చేయడం ఆందోళనకరమని, ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహించడం బ్యాంకులకు తగదని, ప్రజల సొమ్ముతో బ్యాంక్‌లను నడుపుతున్నా కూడా నిబంధనలు పాటించక పోవడం, నిర్లక్ష్యం చేయడంతోనే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.