thesakshi.com : ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోని నకోటి జిల్లాలో కైల్ పట్టణం బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంది.
మంగళవారం రాత్రి 12.30 గంటలకు కైల్‌లో నివసిస్తున్న అబ్దుల్ మన్నాన్ అనే వ్యాపారవేత్త ఇంటిపై ఓ గుంపు దాడి చేసి, విధ్వంసం సృష్టించింది.
ఆ సమయంలో అబ్దుల్ ఊర్లో లేరు. త్రిపుర రాజధాని అగర్తల వెళ్లారు. ఇంట్లో తన భార్య, కొడుకు మాత్రమే ఉన్నారని, గుంపు దాడి చేసేసరికి భయంతో ఇంట్లోంచి పారిపోయి, చీకట్లోకి పరుగెత్తారని అబ్దుల్ చెప్పారు.
గత వారం రోజులుగా త్రిపుర రాష్ట్రంలో హింసాకాండ చెలరేగుతోంది. ముస్లింల ఇళ్లు, వ్యాపారాలు, మసీదులపై దాడులు చేసి విధ్వంసం సృష్టించిన ఎన్నో కేసులు వెలుగులోకి వస్తున్నాయి.
కనీసం ఒక డజను మసీదులను ధ్వంసం చేశారని, కొన్నిటిని తగులబెట్టారని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.
చాలా చోట్ల ముస్లింల ఇళ్లు, వ్యాపార సంస్థలపై దాడులు జరిగాయి.
త్రిపురలో ముస్లింలు మైనారిటీలు. ఆ రాష్ట్ర జనాభాలో అధిక శాతం హిందువులే. వీరిలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు.
ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే.
అందుకు ప్రతీకారంగానే త్రిపుర్‌లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని పలువురు భావిస్తున్నారు.
బంగ్లాదేశ్‌లోని కుమిల్లా పట్టణంలో దుర్గా పూజ మండపాల వద్ద ఖురాన్‌కు అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించడంతో అక్కడ హింస చెలరేగింది. దేశవ్యాప్తంగా హిందువుల దేవాలయాలు, ఇళ్లు, వ్యాపారలపై దాడులు జరిగాయి.
హింసకు పాల్పడినవారిపై బంగ్లాదేశ్ సత్వరమే కఠిన చర్యలు తీసుకుంది. కొందరిని అరెస్ట్ చేసింది.
ఆ దేశ ప్రధాని షేక్ హసీనా, ప్రభుత్వ మంత్రులు కూడా బాధిత హిందువులను పరామర్శించారు.
త్రిపురలో అబ్దుల మన్నాన్ తన భద్రత గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. తన వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులకు అప్పగించారు.
“నాకు 44 ఏళ్లు. ఇప్పటివరకు ఇక్కడ ఇలాంటి దాడులుగానీ, హింసగానీ జరగడం చూడలేదు. ఇక ఇక్కడ జీవించడం కష్టమవుతుందేమో?” అని ఆయన అన్నారు.
దాడి జరిగిన ముందురోజు రాత్రి విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సభ్యులు అబ్దుల్ ఇంటిపై కాషాయ జెండా ఎగురవేశారు.
అబ్దుల్ మన్నాన్ అక్కడ పేరొందిన వ్యాపారవేత్త, ఒక శాసనసభ సభ్యుడికి దగ్గరి బంధువు.
అయినప్పటికీ, తన ఇంటిపై దాడి జరగకుండా ఆపలేకపోయారు.
“మేం నివసిస్తున్న చోట 5 నుంచి 10 ముస్లిం కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. దాడులు ఇలాగే కొనసాగితే ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతానికి ఇల్లు మారాల్సి వస్తుంది” అని ఆయన అన్నారు.
త్రిపురలో ముస్లిం జనాభా 10 శాతం కన్నా తక్కువ. ఇక్కడ ముస్లింలకు ప్రత్యేకమైన ప్రాంతమేమీ లేదు. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు.
త్రిపురలో స్థానిక హిందువులకు, శరణార్థులుగా వచ్చిన వారికి మధ్య ఘర్షణలు చెలరేగిన దాఖలాలు ఉన్నప్పటికీ, గత కొన్నేళ్లుగా ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొన్నాయి. ఫలితంగా, ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడింది.
భారతదేశ ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో భాగంగా బంగ్లాదేశ్, మయన్మార్‌లతో స్నేహపూర్వక సంబంధాలను మెరుగుపరిచే దిశలో త్రిపుర కీలక పాత్ర పోషించింది.
జరుగుతున్న దాడుల నేపథ్యంలో జమాత్-ఎ-ఉలేమా (హింద్) సంస్థ, త్రిపుర ముఖ్యమంత్రికి ఒక వినతిపత్రం సమర్పించింది.
గత కొన్ని రోజులుగా, వీహెచ్‌పీ, హిందూ జాగరణ వేదిక లాంటి హిందూ ఛాందస సంస్థలు త్రిపుర రాజధానితో సహా ఇతర జిల్లాల్లోని నగరాలు, పట్టణాల్లో నిరసనలు నిర్వహించాయని, అది స్థానిక ముస్లింలపై ఆగ్రహంగా మారిందని పేర్కొంది.
ముస్లింల ఇళ్లు, వ్యాపారాలు, మసీదులను లక్ష్యంగా చేసుకుని నిరసనకారులు దాడులకు పాల్పడ్డారని ఆరోపించింది.
తమ కార్యకర్తలు ఎవరూ దాడులు చేయలేదని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ తెలిపారు.
పైగా, మసీదు, దాని చుట్టుపక్కల ఇళ్ల నుంచి తమపైనే రాళ్లు రువ్వారని బన్సల్ ఆరోపించారు.
కొందరు వ్యక్తులు కత్తులు పట్టుకుని నిరసనలు చేస్తున్నవారి వైపు దూసుకొచ్చారని, సమీపంలో ఉన్న దుకాణాలకు నిప్పు పెట్టారని పేర్కొన్నారు.
“వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ స్థానికులకు వ్యతిరేకం కాదు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ప్రదర్శనలు చేశారు. ఈ సమస్యలు సృష్టించిన జిహాదీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి” అని వినోద్ బన్సల్ అన్నారు.
గత వారం రోజులుగా త్రిపురలోనే కాకుండా దేశవ్యాప్తంగా వీహెచ్‌పీ ర్యాలీలు నిర్వహిస్తోందని.. అది తమ హక్కని ఆయన అన్నారు.
త్రిపురలో జరిగిన దాడులలో ఇంతవరకు ప్రాణనష్టం జరగలేదు. కానీ, చాలాచోట్ల ఉద్రిక్తత నెలకొని ఉంది.
రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కానీ, పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు వెల్లడించారు.
త్రిపురలోని అనేక ప్రాంతాల్లో సెక్షన్ 144 విధించారు.
ఆ రాష్ట్రంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు, బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింస మాత్రమే కాకుండా వచ్చే నెలలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు కూడా కారణమని త్రిపుర స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఓ) అధ్యక్షుడు షఫీకుల్ రెహమాన్ అభిప్రాయపడ్డారు.
“కోవిడ్ కారణంగా మున్సిపల్ ఎన్నికలు ఇంతకుముందు వాయిదా పడ్డాయి. అయితే, కరోనా తగ్గుముఖం పట్టిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించలేదుగానీ హింసాకాండ ప్రారంభమైన వెంటనే ఎన్నికల తేదీలు ప్రకటించింది.”
ఇటీవల పరిణామాల తరువాత, రాష్ట్రంలో హిందువులంతా ఒక్క తాటిపైకి వచ్చారని, జరుగుతున్న హింసపై మాట్లాడేందుకు ప్రతిపక్షాలతో సహా ఏ పార్టీ సిద్ధంగా లేదని రెహ్మాన్ అన్నారు.
ముస్లింల ఇళ్లు, మసీదులపై జరిగిన దాడుల చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి.
నిరసనలు చేయవద్దని, శాంతిభద్రతలు పునరుద్ధరించేందుకు సహకరించమని ఓ మహిళా పోలీసు అధికారి, ముస్లింలకు విజ్ఞప్తి చేయడం ఓ వీడియోలో కనిపించింది. ఈ వీడియో నిజమేనని స్థానికులు బీబీసీకి ధ్రువీకరించారు.
పోలీసులు అందరికీ రక్షణ కల్పిస్తారని ఆమె వివరిస్తున్నారు. కానీ, ‘వీహెచ్‌పీ ర్యాలీలను ఎందుకు ఆపడం లేదని’ స్థానిక ముస్లింలు ఆమెను ప్రశ్నిస్తుండడం ఈ వీడియోలో చూడవచ్చు.
“రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలు భయాందోళనలకు గురవుతున్నారు. కొన్ని మసీదులకు వెళ్లి జరిగిన విధ్వంసాన్ని చూశాను. పరిస్థితులు సున్నితంగా ఉన్న కారణంగా హిందూ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలలోని మసీదులకు వెళ్లలేకపోయాను. వాళ్లు హిందూ యువకులందరినీ రాడికల్స్‌గా మార్చేశారు” అని రెహ్మాన్ అన్నారు.
“హిందూ ఛాందసవాద సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇలాంటిది జరుగుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. త్రిపురలో ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు” అని ఉత్తర త్రిపుర నివాసి తానియా ఖానమ్ విచారం వ్యక్తం చేశారు.
జరుగుతున్న దాడులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
“గత కొన్ని రోజులుగా హింస జరుగుతోంది. కానీ, ముస్లింలు నిరసనలు తెలియజేసిన వెంటనే పోలీసులు సెక్షన్ 144 ప్రకటించారు” అని తానియా అన్నారు.