thesakshi.com : ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వవస్థీరకణ సమయంలో ఆరు జిల్లాలకు కొందరు ప్రముఖుల పేర్లు పెట్టారు. దీనిపై కొందరిలో అసంతృప్తి ఉన్నప్పటికీ, బహిరంగంగా ప్రదర్శించిన దాఖలాలు లేవు. వైఎస్సార్, ఎన్టీఆర్, అల్లూరి, అన్నమయ్య, పొట్టి శ్రీరాములు, సత్యసాయి వంటి పేర్లను జిల్లాలకు పెట్టడం పట్ల చాలామంది సంతోషం వ్యక్తం చేశారు.
అప్పటికే ఉన్న ప్రకాశం, పొట్టి శ్రీరాములు, వైఎస్సార్ జిల్లాలు అవే పేర్లతో కొనసాగుతున్నాయి. వాటికి తోడుగా కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ వచ్చింది. దాదాపుగా అన్ని ప్రధాన పార్టీలు ఈ ప్రతిపాదనను సమర్థించాయి. ప్రభుత్వం మాత్రం కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో అంబేడ్కర్ పేరు పెట్టలేదు.
అయితే, నెల రోజులు తిరిగే సరికి పేరు మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ వచ్చింది. అదే పెను వివాదంగా మారింది. ఏకంగా జిల్లా ఎస్పీ మీద దాడి, మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు తగులబెట్టే వరకూ వెళ్లింది.
ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన అఖండ గోదావరి నది పాయలుగా మారుతుంది. గౌతమి, వైనతేయ, వశిష్ట నదీ పాయల మధ్య ప్రాంతాన్ని కోనసీమ అంటారు. మూడు వైపులా గోదావరి ప్రవాహం, మరోవైపు బంగాళాఖాతం కారణంగా కోనసీమ ఓ దీవిలాగ కనిపిస్తుంది.
అయితే, పార్లమెంట్ నియోజకవర్గాలను ప్రాతిపదికగా తీసుకుని 2009లో ఏర్పడిన అమలాపురం పార్లమెంట్ స్థానాన్ని కొత్త జిల్లాగా రూపొందించారు. దానికి కోనసీమ పేరు ఖరారు చేశారు.
అమలాపురం కేంద్రంగా ఏర్పడిన ఈ జిల్లాలో అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రాపురం, మండపేట, కొత్తపేట, పి గన్నవరం, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఏడింటిలో మూడు అసెంబ్లీ నియోజవర్గాలు ఎస్సీ రిజర్వుడు స్థానాలు. పార్లమెంట్ స్థానం కూడా ఆరంభం నుంచి ఎస్సీ రిజర్వుడుగా ఉంది.
2011 లెక్కల ప్రకారం 18 లక్షల మంది జనాభాతో ఏర్పడిన ఈ జిల్లాలో సుమారుగా 5 లక్షల మంది ఎస్సీ జనాభా ఉంటారు. ఇంచుమించు అదే సంఖ్యలో కాపు, ఆ తర్వాత శెట్టిబలిజతో పాటుగా మత్స్యకార కులాలకు చెందిన బీసీలు ఉన్నారు.
కులాల వారీగా, సంఖ్య రీత్యా మూడు, నాలుగు కులాలకు చెందిన ప్రజలు దాదాపు సమానంగా ఉండడమే కాకుండా, ఆర్థికంగా, రాజకీయంగా పట్టు కోసం ఆయా కులాలకు చెందిన వారి మధ్య పోటీ సుదీర్ఘకాలంగా కనిపిస్తోంది. ఈ సామాజిక, ఆర్థిక స్వరూపమే కోనసీమలో పలుమార్లు వివాదాలకు ప్రధాన కారణమని పలువురు చెబుతుంటారు.
ప్రస్తుతం కోనసీమ జిల్లాగా ఉన్న ప్రాంతంలో గతంలో అనేక కుల ఘర్షణలు జరిగిన చరిత్ర ఉంది. పాఠశాల, కళాశాల స్థాయిలో విద్యార్థుల మధ్య ఏర్పడిన చిన్న చిన్న వివాదాలు కూడా చినికి చినికి గాలివానలా మారిన నేపథ్యం ఉంది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వంటి వారి విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడు 8 ఏళ్ల క్రితం కోనసీమలో తీవ్ర కలకలం రేగింది. వరుసగా పలు విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలు అప్పట్లో దుమారం రేపాయి.
ప్రస్తుతం ఈ జిల్లాలో ముగ్గురు ఎస్సీ మాల, ఒక మత్స్యకార, ఒక శెట్టిబలిజ, ఒక కమ్మ, ఒక రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో పినిపే విశ్వరూప్ (ఎస్సీ), చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (శెట్టిబలిజ) మంత్రులుగా ఉన్నారు. కానీ, రాజకీయంగా కాపు కులస్తులు అన్ని నియోజకవర్గాల్లో హవా చాటుతూ ఉంటారు. ఈ రాజకీయ వైరుధ్యాల మూలంగా కుల ఘర్షణలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఇటీవల మంత్రి వేణుగోపాలకృష్ణ తీరు మీద శెట్టిబలిజ కులస్తులు ఆందోళనకు దిగారు. మరో మంత్రి విశ్వరూప్ వైఖరిపై ఆయన సొంత కులస్తులే అసంతృప్తి వ్యక్తం చేసిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుత ఆందోళనల వెనుక ఈ రాజకీయ విభేదాల ప్రభావాన్ని కూడా తోసిపుచ్చలేమని జర్నలిస్ట్ పీతల రాజశేఖర్ అన్నారు.
వ్యవసాయ రంగంలో ఈ ప్రాంతం ముందంజలో ఉంది. అయితే, కుల విబేధాలు పలుమార్లు హద్దులు దాటడంతో కోనసీమ సున్నిత ప్రాంతంగా కనిపిస్తుంది. ఎక్కడ ఏ చిన్న వివాదం రాజుకున్నా, వేగంగా విస్తరిస్తుందని పోలీసు రికార్డులు చెబుతాయి.
అంబేడ్కర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని వివిధ రూపాల్లో జరిగిన కార్యక్రమాలకు మాజీ ఎంపీ హర్షకుమార్ నేతృత్వం వహించారు.
“అంబేడ్కర్ జిల్లా ఉండాలని అంతా ఆశించారు. అన్ని వర్గాలు మద్ధతునిచ్చాయి. ఉద్యమం జరిగింది. ప్రభుత్వం నుంచి మాత్రం ఉలుకుపలుకు లేదు. ఏ లక్ష్యంతో ఈ ప్రతిపాదన చేసారన్నది చెప్పడం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం అంబేడ్కర్ పేరుతో ఇలాంటి యత్నాలు మంచిది కాదు. విద్వేష చర్యలకు ఎవరూ దిగకూడదు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఈ పరిణామాలు” అని ఆయన అభిప్రాయపడ్డారు.
“కోనసీమ ఖరారు చేశారు కదా.. డొక్కా సీతమ్మ వంటి వారి పేర్లు పెట్టాలనే ప్రతిపాదనలు కూడా వచ్చాయి. అయినా కోనసీమ అనే ఉంచారు. అదే ఉంచాలని మేం కోరుతున్నాం. హఠాత్తుగా పేరు మార్చడంలో ఆంతర్యం ఎవరికీ అంతుబట్టడం లేదు. అంబేడ్కర్ పేరు కావాలంటే ఎక్కడైనా పెట్టుకోండి. మకు అభ్యంతరం లేదు. కానీ ఖాయం చేసిన పేరు మార్చడం ఎవరికీ ఇష్టం లేదు” అన్నారు ఆజాద్ యూత్ అసోసియేషన్ ప్రతినిధి కిరణ్ కుమార్. కోనసీమ జిల్లా ఉంచాలని ఈ అసోసియేషన్ పోరాడుతోంది.
“అమలాపురం ఘటనకు అన్ని ప్రధాన పార్టీల నేతలు బాధ్యత వహించాలి. ఉద్యమం అదుపు తప్పుతుందని తెలిసి, యువతను వారించేందుకు ఒక్కరూ ముందుకు రాలేదు. కనీసం తమ పార్టీ శ్రేణులకు సంయమనం పాటించాలని కూడా చెప్పలేదు. అదే సమయంలో అధికార పార్టీ నేతల్లో విబేధాలు ఇంత స్థాయికి వెళ్లడానికి పురిగొల్పాయి. ఇదంతా ప్రభుత్వ వైఫల్యం, ప్రధాన పార్టీల నిర్లక్ష్యానికి చెల్లించుకోవాల్సిన ప్రతిఫలంగా కనిపిస్తోంది. ఇంతటి విధ్వంసం మూలంగా కోనసీమ వాసుల పట్ల రాష్ట్రమంతా వ్యతిరేకత వస్తుంది. కులాల కుంపట్లలో కొట్టుకుంటున్నారనే అపకీర్తి పెరుగుతుంది. దీనిని అందరూ గుర్తించాలి. సంయమనంతో ఉండాలి. రాజకీయ పార్టీల నేతలంతా ముందుకొచ్చి, కార్యకర్తలను శాంతింపజేయాల్సిన అవసరం ఉంది” అని అన్నారు రిటైర్డ్ లెక్చరర్ సలాది రామచంద్రరావు.
కోనసీమలో కుల వైరుధ్యాలు ఇటీవల కాలంలో ఎన్నడూ ఇంత బహిరంగంగా బయటపడలేదని ఆయన అంటున్నారు. జిల్లా పేరు ఏదైనా సామాన్యులకు ఒరిగేదేమీ లేకపోయినప్పటికీ, భావోద్వేగాలు రెచ్చగొట్టిన ఫలితమే ఈ పరిణామాలకు దారి తీసిందని ఆయన అభిప్రాయపడ్డారు.
మే 24 నాడు జరిగిన ఘటనలకు పోలీసు, నిఘా యంత్రాంగం అప్రమత్తంగా లేకపోవడం ప్రధాన వైఫల్యం అనే విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి. విధ్వంసకర ఘటనల తర్వాత పోలీసు యంత్రాంగం కదిలింది. డీఐజీ సహా పలువురు ఉన్నతాధికారులు హుటాహుటిన అమలాపురం చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు బలగాలను మోహరించారు.