thesakshi.com : తనకు పార్టీలో గౌరవం పోయిందని, అందుకే అక్కడ కొనసాగకూడదని నిర్ణయించుకున్నానని నటి, టీడీపీ మాజీ నేత దివ్య వాణి ఆరోపించారు.
గురువారం ఇక్కడ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన రాజీనామాకు దారితీసిన కారణాలను వివరించారు.
“నేను కష్ట సమయాల్లో పార్టీకి అండగా ఉండి నాయుడుని మరియు పార్టీని రక్షించాను. నారా భువనేశ్వరిపై వైఎస్సార్‌సీపీ నేతలు చేసిన ఆరోపణలను నేనే మొదట ఖండించాను. కానీ పార్టీలోని కుటిల రాజకీయాల నుంచి ఏదీ నన్ను రక్షించలేదు’ అని వాణి మీడియాతో అన్నారు.
తాను పార్టీని ఎప్పుడూ గౌరవిస్తానని, ఎప్పుడూ గీత దాటలేదని వాణి అన్నారు. అచ్చెన్నాయుడు పార్టీని అవహేళన చేశారు. కానీ ఆయన ఏపీ విభాగానికి అధ్యక్షుడు. అగ్ర నాయకత్వం ఆయనను ప్రోత్సహిస్తూ నన్ను విస్మరిస్తోంది. మహానందులో ప్రసంగించే అవకాశం నిరాకరించినప్పుడు చాలా బాధగా అనిపించింది’ అని దివ్య వాణి అన్నారు.
నాటకీయ పరిణామాల తర్వాత, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి గురువారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి మంగళవారం నాడు ఆమె తన రాజీనామాను ట్వీట్ ద్వారా ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఆ ట్వీట్‌ను తొలగించిన ఆమె బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు.
నారా తో భేటీ అనంతరం ఆనందంగా కనిపించిన ఆమె.. తాను టీడీపీలోనే కొనసాగుతాననే సంకేతాలు ఇచ్చారు. అయితే, గురువారం, ఆమె తన రాజీనామాను ప్రకటించారు మరియు విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
“బాదుడే బాదుడు” కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన స్పందనతోపాటు “మహానాడు” దిగ్విజయం కావడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో తేలియాడుతున్నారు. ఇటువంటి తరుణంలో పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న లోపాలను మీడియా సమావేశంలో ఏకరువు పెట్టారు. చంద్రబాబునాయుడు తనకు తండ్రిలాంటివారని, ఆయన్ను ఎవరైనా ఒక మాటన్నా తట్టుకోలేనని, ఆగ్రహం వస్తుందని, అటువంటి వ్యక్తిని పార్టీలోని కొందరు వ్యక్తులు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు.
దివ్యవాణి తాజాగా చెప్పింది అనేదానికన్నా గతం నుంచే చంద్రబాబునాయుడు పార్టీలో కొందరి చేతిలో బందీ అయ్యారంటూ తెలుగు తమ్ముళ్లు చెబుతుంటారు. మీడియాలో కూడా ఈ కోణంలోనే చంద్రబాబునాయుడిపై వార్తలు వస్తుంటాయి. పార్టీలో సీనియర్ నేతల నుంచి యువనేతల వరకు అందరిదీ ఇదే అభిప్రాయమంటే అతిశయోక్తి కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
దివ్యవాణి ఆరోపించిన తొండెపు దశరథ జనార్ధన్‌పై పార్టీలోని సీనియర్ నేతలు కూడా గుర్రుగా ఉన్నారుకానీ బయటపడితే అనవసరంగా పార్టీ పరువు తీసినవారిమవుతామనే ఉద్దేశంతో వారు కూడా వాస్తవాలను చంద్రబాబు దగ్గరకు తేలేకపోతున్నారన్నారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. చంద్రబాబునాయుడు దగ్గరకు వాస్తవ సమాచారం వెళ్లకుండా టీడీ జనార్దన్ అడ్డుకుంటున్నారంటూ దివ్యవాణి ఆరోపించిన సంగతి తెలిసిందే.
టీడీ జనార్ధన్ బయట పెద్దగా కనిపించరు. మీడియా ముందుకు అసలు రారు. చంద్రబాబుకు ముందు, వెనకా అంతా తానే అయి వ్యవహరించేది టీడీ జనార్థన్ అనే విషయం పార్టీలోని నేతలందరికీ తెలుసు. తొండెపు దశరధ జనార్థన్ ను అందరూ టీడీ జనార్ధన్ అని పిలుస్తుంటారు. ఆయన మాజీ మంత్రి నెట్టెం రఘురాం బంధువుగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు.
2004 ముందు వరకు క్రియాశీలకంగా లేరు. ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా ఎప్పుడూ పోటీచేయలేదు. 1999లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయనకు ఆప్కాబ్ చైర్మన్ పదవినిచ్చారు.
ఆయన కూడా పార్టీలో అందరికీ ఆప్కాబ్ చైర్మన్‌గా నే పరిచయమయ్యారు. అనంతరం పార్టీలో క్రియాశీలకంగా మారుతూ కేంద్ర కార్యాలయంలో వ్యవహారాలను చక్కబెడుతుండేవారు. ఆ తర్వాత పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి బాగా దగ్గరై నమ్మకమైన వ్యక్తిగా మారారు.
2014లో ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు టీడీ జనార్ధన్‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. టీడీ జనార్ధన్ అనే వ్యక్తిని ప్రశ్నించినందుకు నన్ను ఇబ్బంది పెట్టారు.. ఆయనకు వ్యతిరేకంగా ఏం చేసినా, ఆయన్ను గట్టిగా ప్రశ్నించినా తెలుగుదేశం పార్టీలో వారికి స్థానం ఉండదని దివ్యవాణి ఆరోపించారు.
చంద్రబాబునాయుడిని కలవాలంటే ముందుగా టీడీ జనార్ధన్‌ను కలవాల్సి ఉంటుందన్నారు. కానీ పార్టీలో ఎవరికీ ఆయనపై చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేసే ధైర్యం లేదు. పార్టీ నుంచి బయటకు వెళ్లే సమయంలోనే చాలామంది టీడీపై ఆరోపణలు చేస్తుండటంతో బాబు కూడా వాటిని సీరియస్‌గా తీసుకోవడలేదని పార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నారు.
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవడానికి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అనుసరిస్తు తీరు, వారి వ్యవహారం, జన్మభూమి కమిటీల పేరుతో చేసిన పనులపై చంద్రబాబుకు ఫిర్యాదు చేసి పార్టీని చక్కదిద్దేలా చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది తెలుగు తమ్ముళ్లు ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేకపోయారనే విషయం తెలిసిందే.
టీడీ జనార్ధన్‌ను కట్టడి చేస్తేకానీ నియోజకవర్గాల్లోని వాస్తవ పరిస్థితులు చంద్రబాబు దగ్గరకు చేరవని తెలుగుదేశం పార్టీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. దివ్యవాణి చెప్పినవాటిలో వాస్తవాలను పరిశీలించి పార్టీని చక్కదిద్దాలని తెలుగు తమ్ముళ్లు సైతం కోరుతున్నారు.