thesakshi.com : వాస్తవానికి ఏ కారణం లేకుండా ఉత్తరాదికి చెందిన ఓ బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి ఏపీకి రావడం, సీఎం జగన్ తో అమరావతిలో భేటీ కాకుండా విశాఖకు ఆయన్ను రప్పించుకుని మరీ చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ పెద్దల నుంచి జగన్ కు ఆయన ఏమైనా సందేశం తెచ్చారా అన్న చర్చ కూడా జరుగుతోంది.
విశాఖకు ముఖ్యమంత్రి జగన్ సడెన్ గా టూర్ వేశారు. కొద్ది గంటల పాటు ఆయన విశాఖలో గడిపి తిరిగి తాడేపల్లికి వెళ్ళిపోయారు. ఆయన వచ్చింది కలిసిందీ చూస్తే ఉత్తరాదికి చెందిన బీజేపీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ని. ఆయనతో జగన్ గంట పాటు భేటీ వేసి ఏకాంత చర్చలు జరిపారు. వాటి సారాంశం ఏంటి అన్నది అయితే ఎవరికీ తెలియదు. ఎందుకంటే వన్ టూ వన్ గా ఆ భేటీ సాగింది.
ఇవన్నీ పక్కన పెడితే జగన్ బీజేపీ సీఎం భేటీ మీద రకరకాలుగా ప్రచారం సాగుతోంది. అందులో లేటెస్ట్ ప్రచారం ఒకటి ఆసక్తిగా ఉంది. అదేంటి అంటే జగన్ కి విశాఖ అంటే చాలా ఇష్టం. ఆ విషయాన్ని ఆయన సీఎం అయిన కొత్తల్లోనే చెప్పుకున్నారు. మూడు రాజధానులు అని పేరుకు అంటున్నా విశాఖనే అసలైన రాజధాని చేయాలన్నది జగన్ మనసులో ఉందని కూడా అంటారు.
అయితే మూడు రాజధానుల కధకు ఇపుడు ఫుల్ స్టాప్ పడింది. హై కోర్టు ఈ విషయంలో స్పష్టమైన తీర్పు ఇచ్చేసింది. దాని మీద సుప్రీం కోర్టుకు అప్పీలు వెళ్లి అనుకూలంగా తీర్పు వస్తేనే తప్ప మూడు రాజధానుల విషయంలో జగన్ ముందుకు వెళ్ళలేరు. అయినా సరే మునిసిపల్ శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆదిమూలపు సురేష్ అయితే మూడు రాజధానులు తమ విధానం అని మరో మారు కుండబద్ధలు కొట్టారు.
ఇవన్నీ ఇలా ఉండగానే జగన్ ఒక్కసారిగా విశాఖ టూర్ పెట్టుకున్నారు. హర్యానా సీఎం ని కలిశారు. ఇక్కడ ఆయన్ని కలవడంతో పాటు బస చేసిన ఫెమా వెల్ నెస్ రీసోర్ట్స్ ని నిశితంగా పరిశీలించడం కోసమే జగన్ వెళ్లారు అన్న ప్రచారం సాగుతోంది. గతంలో ఈ రీసోర్ట్స్ బే పార్క్ పేరిట ఉండేది. దాన్ని ఆ మధ్య హెటిరో సంస్థ కొనుగోలు చేసిందని చెబుతారు.
అత్యాధికంగా డిజైన్ చేయబడిన ఈ రీసోర్ట్స్ లో సకల సదుపాయాలూ ఉన్నాయి. విశాఖ బీచ్ కి అభిముఖంగా ఎత్తైన కొండల మధ్య నిర్మించిన ఈ రీసోర్ట్స్ అద్భుతంగా ఉంటుంది. దాంతో విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్ గా దీన్ని ఎంచుకున్నారని గతంలోనే వినిపించారు. ఇపుడు జగన్ ఏకంగా ఈ రీసోర్ట్స్ కి స్వయంగా వెళ్లడంతో మరో మారు ఈ చర్చ తెర ముందుకు వస్తోంది.
రీసోర్ట్స్ లో తొందరలోనే సీఎం క్యాంప్ ఆఫీస్ వస్తుంది అని అంటున్నారు. రాజధానిగా విశాఖ అంటే కోర్టు తీర్పునకు అభ్యంతరం ఉంటుంది కానీ విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే ఎలాంటి న్యాయపరమైన చిక్కులూ ఉండవని అంటున్నారు. అంతే కాదు సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అని కూడా చెబుతారు. ఆ విధంగా జగన్ విశాఖ నుంచి పాలించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు అన్న చర్చ అయితే వస్తోంది.
దాని కోసం జూన్ లోపల మంచి ముహూర్తం ఉందని కూడా అంటున్నారు. ఇక ఆ మధ్య విశాఖలో జరిగిన మిలాన్ వేడుకల సందర్భంగా విశాఖ వచ్చిన జగన్ విహంగ వీక్షణం ద్వారా ఈ రీసోర్ట్స్ ని ఆకాశం పై నుంచి చూశారని ఇపుడు ఏకంగా లోపలికి వెళ్ళి అంతా చూసి వచ్చారని అంటున్నారు. ఈ ప్రచారం కనుక నిజమైతే మాత్రం విశాఖకు జగన్ తొందరలోనే వచ్చే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. చూడాలి మరి.