thesakshi.com : తెగింపు చాలామందిలో ఉంటుంది. బరితెగింపు కొందరిలోనే ఉంటుంది. దారుణమైన తప్పు చేసి మరీ.. ఇష్టారాజ్యంగా వ్యవహరించే ఆరాచకం కొద్ది మంది నేతల్లోనే చూస్తుంటాం. ఏపీ అధికారపక్షం వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం కొద్దిరోజులుగా సంచలనంగా మారటం తెలిసిందే. తన దగ్గర పని చేసే మాజీ డ్రైవర్ సుబ్రహణ్యంను హత్య చేసి.. ప్రమాదంలో గాయాలతో మరణించినట్లుగా చెబుతూ.. తన సొంత కారులో తీసుకెళ్లి.. వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన ఉదంతం పెను సంచలనంగా మారటం తెలిసిందే.
ఏపీ అధికారపక్ష నేతల ఆరాచకానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ ఉదంతం మారింది. పెద్ద ఎత్తున రగడ రాజుకున్నప్పటికి.. వెంటనే స్పందించాల్సిన పోలీసులు మాత్రం చేష్టలుడిగినట్లుగా ఉండిపోవటం తెలిసిందే. అంతకంతకూ బయటకు వస్తున్న వివరాలు.. అదే సమయంలో రాజకీయంగా.. ప్రజల్లోనూ పెరుగుతున్నఆగ్రహావేశాల నేపథ్యంలో చట్టం తన పని తాను చేసుకునే దిశగా అడుగులు పడ్డాయి. ఈ దారుణ ఘటన బయటకువచ్చిన నాలుగైదు రోజుల తర్వాత హత్యా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ షురూ చేశారు.
సోమవారం చోటు చేసుకున్న పరిణామాల అనంతరం జిల్లా ఎస్పీ ఈ హత్య ఏ రీతిలో చోటు చేసుకుందన్న వివరాల్ని వెల్లడించారు. అదే సమయంలో.. ఈ హత్యా ఉదంతంలో బాధ్యుడిగా భావిస్తున్న ఎమ్మెల్సీని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం.. ముఖ్యమంత్రి ఈ కేసు విచారణను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు పర్యవేక్షణలో ఆరు టీంలను ఏర్పాటు చేసి.. వేగంగా దర్యాప్తు చేసిన ఎమ్మెల్సీని అరెస్టు చేసినట్లుగా పేర్కొనటం గమనార్హం.
ఇంతకీ హత్య ఎందుకు జరిగింది? ఎలా జరిగిందన్న వివరాల్ని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఆయన మాటల్లోనే చూస్తే.. ‘‘హత్య జరిగిన మే 19న సుబ్రహణ్యం ఇంటి నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో బయటకు వచ్చాడు. ఫ్రెండ్స్ తో కలిసి మద్యం కొన్నాడు. రాత్రి 10.15 వరకు మద్యం తాగారు. ఆ తర్వాత రోడ్డు పైకి వచ్చారు. అదే సమయంలో ఎమ్మెల్సీ అనంతబాబు తన కారులో అటుగా వచ్చారు. సుబ్బును పిలిచి కారులో ఎక్కించుకున్నారు.మిగిలిన ఫ్రెండ్స్ వెళ్లిపోయారు. అదే వాహనంలో ముందుకు వెళ్లి.. టిఫిన్ కట్టించుకొని.. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఎమ్మెల్సీ ఇంటి వైపు వెళ్లారు’’ అని చెప్పారు.
కారులో మాజీ డ్రైవర్ తో జరిగిన ఘటన గురించి ఎస్పీ చెబుతూ.. ‘‘పెళ్లి టైంలో తీసుకున్న అప్పులో ఇంకా రూ.20వేలు ఇవ్వలేదని ఎమ్మెల్సీ అడిగారు. తానుఆ డబ్బుల్ని ఇచ్చేస్తానని అనంతబాబు చెప్పాడు. నీ దగ్గర మద్యం వాసన వస్తుంది.. నీలో మార్పు రాలేదు.. నువ్వు ప్రవర్తన మార్చుకుంటే నా దగ్గర పనిలో పెట్టుకోవాలని మీ అమ్మ అడుగుతోంది. నువ్వు మారట్లేదని అనంత బాబు అనటంతో.. మాజీ డ్రైవర్ సుబ్బు వాగ్వాదానికి దిగాడు.
ఇంటి వద్దకు కారు రావటం.. సుబ్బ ప్రవర్తనతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్సీ అతన్ని కొట్టేందుకు ముందుకు రాగా.. మందు తాగిన వ్యక్తిని ఎందుకు కొడతావంటూ సుబ్రహ్మణ్యం ఎదురుతిరిగాడు. దీంతో అహం దెబ్బ తిన్న అనంతబాబు అతడి మెడ పట్టుకొని వెనక్కి నెట్టాడు. ఆ వేగానికి సుబ్రహణ్యం అపార్ట్ మెంట్ డ్రైనేజీ గట్టుపై పడటంతో తలపై గాయమైంది. నన్నే కొడతావా? అంటూ సుబ్బ మళ్లీ తిట్టటంతో అనంతబాబు ఆగ్రహంతో రెండోసారి బలంగా కొట్టాడు. దీంతో గ్రిల్స్ కు తల తగిలి గాయమైంది. దీంతో అతడ్ని తన కారులో ఎక్కించుకొని రెండు ఆసుపత్రులకు వెళ్లాడు. అవి రెండు మూసి ఉండటంతో.. అతడ్ని మరో ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కారులో ఎక్కిళ్లు వస్తున్న అనంతబాబుకు మంచినీళ్లను ఇచ్చారు. అవి తాగిన కాసేపటికి అచేతనంగా ఉండిపోవటం.. పరీక్షిస్తే శ్వాస ఆగినట్లుగా గుర్తించారు. చనిపోయిన విషయాన్ని తెలుసుకున్నంతనే షాక్ కు గురయ్యారు’’ అని వెల్లడించారు.
‘‘హత్యా నేరం నుంచి బయటపడేందుకు ఏం చేయాలని ఆలోచించిన ఎమ్మెల్సీ.. యాక్సిడెంట్ గా చిత్రీకరించి.. కుటుంబానికి అప్పగిస్తే అనుమానం రాదని భావించాడు. ఇందులో భాగంగా డంపింగ్ యార్డు ప్రాంతానికి తీసుకెళ్లి.. సుబ్రహణ్యం డెడ్ బాడీని కింద పడుకోబెట్టి ప్రమాదంలో గాయపడినట్లు చూపేందుకు అతడి.. తొడలు.. చేతులు.. భుజం.. వీపు మీద బలంగా కొట్టారు. అనంతరం అతడి డెడ్ బాడీని కారులోకి మార్చి.. సుబ్బు తల్లికి ఫోన్ చేసి.. ఆమె కుమారుడికి యాక్సిడెంట్ జరిగిందని తనకు సమాచారం అందటంతో తాను వెళుతున్నట్లుగా చెప్పారు.
అనంతరం అతడ్ని ఇంటికి తీసుకొచ్చి దింపారు. డెడ్ బాడీని చూసినంతనే అది ప్రమాదం కాదని గుర్తించి వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ అనంతబాబును నిలదీయటంతో అక్కడి నుంచి పరారయ్యాడు. సుబ్రహణ్యం తల్లిదండ్రులు కంప్లైంట్ తో కేసు నమోదు చేసి విచారించాం’’ అని ఎస్పీ వెల్లడించారు. మొత్తంగా భారీ హైడ్రామా అనంతరం ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేసినట్లుగా పోలీసులు ప్రకటించి.. ఇష్యూ ఇక ముగిసినట్లుగా వారి తీరు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.