thesakshi.com : నరేంద్ర మోదీ వల్ల ప్రపంచ దేశాల్లో భారత్ పరువు పోతోందని కేసీఆర్ అన్నారు. శ్రీలంకలో మోడీకి వ్యతిరేకంగా ఎందుకు నిరసనలు జరుగుతున్నాయో, రేపటి సభలో మోదీ చెప్పాలంటూ కేసీఆర్ సవాల్ విసిరారు. శ్రీలంక విషయంలో మోడీ సేల్స్ మేన్ లా వ్యవహరించాడని అన్నారు.
మోదీ ఒత్తిడి వల్లే పవర్ కాంట్రాక్ట్ ను భారతీయ వ్యాపారికి ఇవ్వాల్సి వచ్చిందని శ్రీలంక పార్లమెంట్ లో ప్రకటించారని కేసీఆర్ గుర్తు చేశారు. మోదీ తీరుతో అంతర్జాతీయ వేదికలపై భారత్ చులకన అవుతోందని అన్నారు.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రసంగం
యశ్వంత్ సిన్హా గారు ఒక నిజమైన మంచి వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి. వారు అడ్వకేట్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. ఐఎఎస్ అధికారి బాధ్యతలు నిర్వర్తించారు. అధికారిగా కూడా దేశానికి ఎన్నో సేవలు అందించారు. అటు తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. వారు ఆర్థికమంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అంతర్జాతీయ స్థాయిలో ప్యారిస్ లో వారికి అవార్డును అందుకున్నారు. సన్మానాన్ని పొందారు. అలాంటి నేతను స్వాగతించేందుకు మేము గర్విస్తున్నాం. ఇలాంటి వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసుకున్నాందుకు మేము అదృష్టవంతులమని భావిస్తున్నాం. అపూర్వరీతిలో మేము వారికి స్వాగతం పలికాం.
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంటు సభ్యులకు నేనొక విన్నపం చేస్తున్నాను. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. దీనికి ముందు వివి గిరి గారు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటున్న సమయంలో భారతదేశంలో ఒక ఆత్మప్రభోదంతో ఓటు వేయండనే నినాదం వినిపించింది. నినాదానికి అనుగుణంగానే వివి గిరి గారు విజయం సాధించారు. ఇది మన దేశ చరిత్ర. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థులను పోల్చి చూసి మీ ఆత్మప్రభోదానుసారం ఓటు వేయండి. యశ్వంత్ సిన్హాగారు ఈ ఎన్నికల్లో గెలిచి దేశ గౌరవం ఇనుమడిస్తుందని ఆశిస్తున్నాను.
యశ్వంత్ గారు నేను కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను. మీరు విజయం సాధించాలని ఆశిస్తున్నాను. మీ విజయంతో దేశం గౌరవం, ప్రతిష్ట ఇనుమడించాలని కోరుకుంటున్నాను. మీ లాంటి వారు విజయం సాధిస్తే వ్యక్తిగతంగా మీ గౌరవం పెరగడంతో పాటు దేశం గౌరవం, మర్యాద పెరుగుతుంది. కానీ ఈ దేశంలో ఏమవుతున్నది. దేశం సరైన దిశలో పయనించడం లేదు. దేశాన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశం మౌనంగా ఉండకూడదు. దీనికి వ్యతిరేకంగా గళాన్ని వినిపించాల్సి ఉంది. అందరూ ఏకం కావాల్సి ఉంది. దేశానికి మార్పు అవసరం. అది గుణాత్మక మార్పు అయి ఉండాలి. భారతదేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పును తీసుకురావాల్సి ఉంది. ఇది నేడు దేశానికి అవసరం. మన దేశ ప్రధానమంత్రి గారు హైదరాబాద్ కు రానున్నారు. రెండు రోజులు ఇక్కడ ఉండనున్నారు. గొంతు చించుకొని మాకు వ్యతిరేకంగా మాట్లాడనున్నారు. ఎవరికి ఏమనిపిస్తే అది మాట్లాడండి. ఎవరికి ఏం మాట్లాడలంటే అది మాట్లాడండి. ఇదే మన ప్రజాస్వామ్యానికి గుర్తింపు. ప్రధానమంత్రిగారు మీరు గొంతు చించుకొని ప్రతిపక్ష పార్టీల నేతల పై తప్పుడు ఆరోపణలు చేస్తారో… అదే ప్రకారం హైదరాబాద్ సభలో మాట్లాడనున్నారో… అదే విధంగా మా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
నేడు దేశం ఈ డిమాండ్ ను చేస్తున్నది. ప్రధానమంత్రిగారు మీరు మొదటిసారి ఎన్నికైనప్పుడు ప్రజలకిచ్చిన వాగ్ధానాల్లో ఒక్కటైన నెరవేర్చారా. నెరవేరిస్తే ఏ హామీ నెరవేర్చారో చెప్పండి. టార్చిలైట్ పెట్టి వెతికినా ఒక్కటి కూడా దొరకదు. ఇది నేను కాదు. యావత్ దేశం అంటున్నది. మిమ్మల్ని మించిన తెలివైన వారు ఎవరూ లేరని మీరు అనుకుంటారు. సరే మంచిది. మనదేశంలో రైతుల భాగస్వామ్యం గొప్పది. దేశానికి అన్నం పెట్టే అన్నదాతల ఆదాయాన్ని డబుల్ చేస్తానని అన్నారు. డబుల్ ఐతే కాలేదు. కానీ ఖర్చు మాత్రం రెండింతలైంది. డీజిల్, పెట్రోల్, విద్యుత్ రేట్లు పెంచారు, ఎరువుల రేట్లు పెంచారు. దీంతో పెట్టుబడి రెండు రెట్లు అయింది.
దేశంలోని ప్రతీ రైతుకు ఈ విషయం తెలుసు. అది వారి వ్యక్తిగత అనుభవం.
మీరు తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మీ చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలలు ఉద్యమం చేపట్టారు. మీరు రైతులపై ఎన్నో దుర్మార్గమైన ఆరోపణలు చేశారు. రైతులను ఉగ్రవాదులన్నారు. ఖలిస్తానీలన్నారు. మీ మనసుకు ఏది తోస్తే అది అన్నారు. మీ మంత్రులు ఆందోళనకారులపై జీపులు, కార్లు ఎక్కించారు. వారిని చంపారు, హత్యలు చేశారు. ఉద్యమం చేస్తూ చేస్తూ 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. మీకు ఈ విషయం పట్ల పట్టింపే లేదు. వారి పట్ల మీకు జాలి లేదు. 700 మంది రైతులు చనిపోవటం నిజం కాదా. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి ప్రాణాలు తిరిగి తీసుకురాలేం.
యశ్వంత్ గారు నేను ఇక్కడి నుంచే వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇక్కడి నుంచే ప్రకటించాను. ఈ మధ్యే నేను పంజాబ్ ప్రభుత్వ సహకారంతో చండీగఢ్ దాకా వెళ్ళి రైతుల కుటుంబాలకు చెక్కులు అందించాను. దీని పై కూడా మన ప్రధానమంత్రి, బిజెపి నేతలు ఎగతాళిగా మాట్లాడారు. మీరు ఇవ్వరు. ఇచ్చే వాళ్ళను ఎగతాళి చేస్తారు. ఇది మీ విధానం. మీ నీతి. మీరు దేశంలో ఈ రకమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మిత్రులారా ఇది ఆలోచించాల్సిన విషయం. ఈ రకంగా రైతులను కించపరుస్తూ వారి పట్ల ప్రధానమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి, బిజెపి సీనియర్ నేతలు అగౌరవపూర్వకమైన మాటలు మాట్లాడారు.
మీరు సరైన వ్యక్తే అయితే, మీరు చేసిన చట్టాలు సరైనవే అయితే చివరకు ఏమైంది…. మీరు దేశం ముందు తలవంచి రైతులకు క్షమాపణ కోరాల్సి వచ్చింది.
ఎన్నికల సమయంలో తీయతీయని మాటలు మాట్లాడటం, ఎన్నికలు ముగిసాక అబద్దపు మాటలు మాట్లాడటం ప్రధానమంత్రి గారి విధానం. దీన్ని దేశం చూస్తోంది. దేశం అనుభూతి చెందుతోంది. మీరు కరక్టే ఐతే రైతులను ఎందుకు క్షమాపణ కోరారు.
మీరు చేసిన రైతు చట్టాలను ఎందుకు ఉపసంహరించుకున్నారు. దాని తర్వాత మీరు రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. ఈ రోజు వరకు వాటి జాడే లేదు. రైతు మిమ్మల్ని బంగారం, వజ్రాలు అడటం లేదు కదా. రైతు తాను పండించిన పంటకు ధర అడుగుతున్నాడు. మద్దతు ధర అడుగున్నాడు. గౌరవప్రదమైన జీవితాన్ని అడుగుతున్నాడు. ఏ రకంగానైతే మీరు లక్షల కోట్ల అప్పులు చెల్లించి పెట్టుబడిదారుల అప్పులు చెల్లిస్తారో అలా కావాలని రైతులు కోరుకోవడం లేదు.
రైతులు వారి హక్కులను కోరుకుంటున్నారు. వారు పండించిన పంటకు సరైన ధరను కోరుకుంటున్నారు. అది ఇచ్చే సామర్థ్యం కూడా మీకు లేదా. మీరు గొంతు పెంచి, మీ మనసుకు తోచినట్టు మాట్లాడుతారు. రానున్న కాలంలో ఇది నడవదు. ఇచ్చిన ఒక్క హామీని కూడా మీరు నెరవేర్చ లేదు. మిమ్మల్ని మీరు పొగుడుకుంటారు. ప్రతీ విషయంలో దేశం గౌరవం, ప్రతిష్ట దిగజారపోతున్నది. మీ నియంతృత్వం రోజు రోజుకీ పెరిగిపోతున్నది. ఇది దేశానికి చాలా ప్రమాదం.
అందుకే నేను అందరితో ఈ విషయం చెప్తూ వస్తున్నాను, రానున్నకాలంలో కూడా చెప్తాను.
రాజకీయపరమైన మార్పుతో ఈ దేశంలో ఎలాంటి మార్పులు జరిగేది లేదు. జరగదు కూడా. ఎవరూ కూడా శాశ్వతం కాదు. మోదీ కంటే ముందే చాలా మంది ప్రధానమంత్రులయ్యారు.
ప్రజలు ఎవరికైతే దేశానికి సేవ చేసే భాగ్యం కల్పిస్తారో వారు ఆ పనిని చేపట్టి వెళ్ళిపోతారు. నేనే శాశ్వతమని మోదీ భావిస్తున్నారు. ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. కాబట్టి మార్పు అనేది తప్పనిసరి. అసంభవం కాదు. మీరు ఏం నడిపిస్తున్నారు. ఏ రకమైన విధానాలను అనుసరిస్తున్నారు. అన్ని విధాలుగా దేశం పరిస్థితి దిగజారుతుంది.
రైతులు పాట్లు పడుతున్నారు. నిరుద్యోగులైన యువత బాధ పడుతున్నారు. పారిశ్రామికవేత్తలు గందరగోళంలో ఉన్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నది. ధరలు పెరుగుతున్నాయి. మీ పరిపాలన స్వభావం ఏమిటి. దీని వల్ల దేశానికి ఏం ఒరిగింది. అన్ని రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం జరిగింది. ప్రతీ రోజు దేశంలో ఇదే జరుగుతున్నది. మీకు ఇది హాబీ. మీరు దాడికి పాల్పడుతున్నారు.
మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని సతాయిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడంలో బిజీగా ఉన్నారు. ఇప్పటివరకు మీరు 9 ప్రభుత్వాలను కూల్చారు. ఇది మీ రికార్డులో ఉంది. దీని పర్యవసానం ఏం కానుంది. దేశంలో ఎటువైపు చూసినా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మీ ప్రభుత్వంలో ఎవరు సంతోషంగా ఉన్నారు. మీ అబద్దపు ప్రసంగాలు, అబద్దపు ప్రచారాలు, అబద్దపు పత్రికా విన్నపాలతో ఎవరు సంతోషంగా ఉన్నారు. వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయమని ప్రధానమంత్రిగారిని నేను కోరుతున్నాను.
సోదరులారా నేను మీకు ఒక విషయం తప్పకుండా చెప్పదలుచుకున్నాను. మోదీ గారు 15 వ ప్రధానమంత్రి. ఇంతకుముందు 14 మంది ప్రధానులుగా పనిచేశారు. మీ పదవికాలంలో దేశ ప్రతిష్ట దిగజారినంతగా ఎవరి కాలంలోనూ జరగలేదు. ప్రధానమంత్రిగారు మీరు ప్రసంగం ప్రారంభించే ముందు భారత్ మాతా కీ జై అంటారు. మీ నినాదంలో సరైన దమ్ముంటే, మీలో ప్రవహించే రక్తంలో నిజాయితీ ఉంటే నేనొక ప్రశ్న అడుగుతాను. సమాధానం ఇవ్వండి.
మీకు వ్యతిరేకంగా శ్రీలంక దేశంలో ఎలాంటి ఉద్యమం జరుగుతుందో చెప్పండి.
ఎందుకు నడుస్తుందో చెప్పండి. మీరు శ్రీలంకకు వెళ్ళి ప్రధానమంత్రి పాత్ర పోషించకుండా, ఒక వ్యాపారికి సేల్స్ మెన్ గా వ్యవహరించారు. ఫలితంగా శ్రీలంక ప్రజలు రోడ్డు పై పడ్డారు. ఇది మన దేశానికి శోభనిస్తుందా. మీ వల్ల దేశానికి తలవంచుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇది నిజం కాదా. మీ మంత్రులు, మీ ప్రతినిధులు, గొంతు చించుకొని మాట్లాడుతారు కదా. శ్రీలంక విషయంలో మీ ప్రతినిధులు ఎందుకు మౌనంగా ఉన్నారు. మీరు ఎందుకు స్పందించడం లేదు. దీని వెనుకున్న కారణాలు ఏంటి. దీనికంటే పెద్ద విషయం ఏముంది. శ్రీలంక పార్లమెంటు కమిటి ముందు భారతదేశ ప్రధానమంత్రి ఒత్తిడి కారణంగా కాంట్రాక్టును భారతదేశ వ్యాపారవేత్తకు కట్టబెట్టినట్లు శ్రీలంక ఎలక్ట్రిసిటి బోర్డు చైర్మన్ ఒప్పకున్నారు. దీంతో దేశ ప్రతిష్ట పెరుగుతుందా. ఇంతకుముందు పనిచేసిని ఏ భారత ప్రధానమంత్రి కాలంలో కూడా దేశంపై ఇలాంటి ఆరోపణలు రాలేదు.
మీరు మౌనంగా ఉంటారు కావచ్చు కానీ మేము మౌనంగా ఉండం. మేము తప్పకుండా పోట్లాడుతూనే ఉంటాం. వ్యక్తిగతంగా మోదీతో నాకు ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు. రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు, నియంతృత్వ పోకడలతో జులును ప్రదర్శిస్తూ, ప్రభుత్వరంగ సంస్థల దుర్వినియోగం పై మేము మాట్లాడుతాం. విధానాల పై మేము మాట్లాడుతాం. మీరు నిజాయితీపరులైతే, సచ్చీలురు ఐతే రేపు జరగనున్న మీటింగ్ లో హైదరాబాద్ వేదికగా దేశ ప్రజలకు సమాధానమివ్వండి. శ్రీలంకలో ఏమైందో స్పష్టంగా చెప్పండి. దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం. లేకపోతే మేము మిమ్మల్ని దోషిగా నిర్ధారించుకోవాల్సి వస్తుంది. తప్పకుండా మిమ్మల్ని తప్పు పడతాం.
మీరు ప్రధాని అయ్యాక మేకిన్ ఇండియా అనే మరో నినాదాన్ని ఇచ్చారు. దీని వల్ల ఏమైన ఫలితాలు వచ్చాయా అని నేను ప్రధానమంత్రిగారిని ప్రశ్నిస్తున్నాను. మీరంటే భయంతో, మీ పద్ధతులతో, మీ విధానాలతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను తీసుకొని దేశం నుంచి పారపోతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన తప్పిదాలతో మన దేశం నుంచి ఇతర దేశాలకు బ్రెయిన్ డ్రెయిన్ (మేధో వలసలు) జరిగింది.
మీ పదవీకాలంలో పెట్టుబడులు తిరిగి పోతున్నాయి. లక్షల కోట్లు ఉపసంహరించుకొని పోతున్నారు. మేకిన్ ఇండియాతో ఏం జరగలేదు. అన్నీ అబద్దాలు చెప్పారు. మేకిన్ ఇండియాతో ఏం ఒరిగిందో రేపటి మీ ప్రసంగంలో చెప్పండి. దేశానికి ఏమైన తరలి వచ్చాయా లేదా ఏమైన తరలి పోయాయా. మీ తప్పుడు విధానాలతో పెద్ద పెద్ద పరిశ్రమలు, పారిశ్రామికేవత్తలు తరలిపోయారు.
కార్మికులు రోడ్డు పై పడ్డారు. హిమాలయాలకు అటు వైపున ఉన్న చైనాలో ఏం జరిగిందో సరిపోల్చి చూడండి. ఒకవేళ మీకు తెలివి లేకుంటే తెలుసుకోవచ్చు. ఇక్కడ మన దగ్గర బోలెడు మాటలు. కానీ చేతలు శూన్యం. చైనాలో ఎలాంటి విప్లవం సంభవించింది. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి. ఎన్ని పెట్టుబడులు వచ్చాయి. చైనా మనకంటే చాలా పేద దేశంగా ఉండేది. మన జీడిపితో పోల్చితే వారిది చాలా తక్కువగా ఉండేది. 16 ట్రిలియన్ డాలర్ల ఎకానమీతో చైనా నిలిచింది.
మీరు 5 ట్రిలియన్ డాలర్ల కలను చూపెట్టి దేశం ప్రతిష్టను మంటగలిపారు. కానీ మనం ఎక్కడున్నాం. మనకంటే వెనుకబడిన చైనా, మనకంటే తక్కువ జిడిపి కలిగిన చైనా, మనకంటే తక్కువ సాగుభూమి కలిగిన చైనా ఎక్కడుంది. 16 ట్రిలియన్ డ్రాలర్ల ఎకానమీ దగ్గర ఉంది. ఈ రోజు మనమెక్కడున్నాం. 3.1 ట్రిలియన్ డాలర్ల దగ్గరున్నాం. మీరన్నట్లుగా 5 ట్రిలియన్ డాలర్లకైనా భారతదేశం చేరుకుంటుందా. చేరుకోదు. అది అసంభవం. మీ పదవీ కాలంలో ప్రతీ అంశంలో దేశం దిగజారిపోయింది. ఇవి నా లెక్కలు కాదు ప్రభుత్వం చెప్తున్న లెక్కలు.
ద్రవ్యోల్బణం పెరుగుతుంది. జిడిపి తగ్గుతుంది. పెరుగుతున్న రేట్లను మీరు నియంత్రించలేరు. మరి మీరు దేన్ని నియంత్రించగలుగుతున్నారు. కోట్లాదిమంది కార్మికులు ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నారు. ఆందోళనలు చేపడుతున్నారు. మీరు వారిని అవమానించే పనిలో బిజీగా ఉన్నారు.
వందేళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు భారత్‌లో ఉన్నాయి. భారతదేశం 5000 మిలియన్ టన్నుల నుండి 10,000 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తోంది. మన దగ్గర పుష్కలంగా బొగ్గు నిల్వలు ఉన్నప్పుడు భారతదేశం ఎందుకు దిగుమతి చేసుకోవాలి. దిగుమతి చేసుకున్న బొగ్గు నిల్వల్లో 10 శాతం బొగ్గును ఎక్కువ ధరకు కొనుగోలు చేయాలని మోదీ ప్రభుత్వం రాష్ట్రాల పై ఎందుకు ఎందుకు ఒత్తిడి చేస్తోంది.
కేంద్రం అనుసరిస్తున్న బొగ్గు విధానాన్ని తెలంగాణ వ్యతిరేకించింది. కోల్ ఇండియా తో పాటు, తెలంగాణలోని సింగరేణి కాలరీస్ భారతదేశానికి బొగ్గును సరఫరా చేస్తోంది. తెలంగాణ తన సొంత బొగ్గు నిల్వలపై ఆధారపడుతున్నది. బొగ్గు దిగుమతులను బీజేపీ ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తోందో వివరించాలని మోదీని డిమాండ్ చేస్తున్నాను. దేశంలోని బడా వ్యాపారులకు మోదీ సేల్స్ మ్యాన్ గా వ్యవహరిస్తున్నారు.
మోదీ సచ్చీలుడే అయితే లేవనెత్తిన అంశాలపై స్పందించాలి. మేక్ ఇన్ ఇండియాను ప్రారంభించిన తర్వాత, చాలా కంపెనీలు దేశంలో కార్యకలాపాలను మూసివేసాయి. ఫియట్, ఫోర్డ్, జీఎం మోటార్స్, డాట్సన్, యునైటెడ్ మోటార్స్, హార్లీ డేవిడ్‌సన్ తమ వ్యాపారాన్ని భారత్‌లో నిలిపివేశాయి. మోదీ పాలనలో భారత్ ఎదగడం అటుంచి పతనమైంది. 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశం పెద్ద దేశం, సంక్షోభ సమయంలో మనం ప్రేక్షకపాత్ర వహించకూడదు.
విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి తెస్తానని మోదీ హామీ ఇచ్చారు. మోదీ ప్రధాని అయ్యాక నల్లధనం రెట్టింపు అయింది. ఇది మోదీ అండ్ కంపెనీ ఎదుగుదల కాదా. 2022 నాటికి అందరికీ ఇళ్లు ఇస్తామని, అవినీతి రహిత భారత్‌ను తీసుకువస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
మోదీ ప్రభుత్వం వ్యాపారులకు సహాయం చేసి వారిని సేల్స్ మెన్ గా ప్రమోట్ చేసింది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో పెద్ద కుంభకోణాలు జరిగాయి. ఎన్‌పీఏలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో రూ. 4 లక్షల కోట్ల నుంచి రూ. 5 లక్షల కోట్ల వరకు మొత్తం ఎన్‌పీఏలు రూ. 18.6 లక్షల కోట్లు దాటిపోయాయని కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో తన ప్రకటనలో అంగీకరించారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానని మోదీ హామీ ఇచ్చారు.
ఉద్యోగాల సృష్టి హామీ ఇప్పటికీ నెరవేరలేదు. మోదీ ప్రభుత్వంలో రూపాయి విలువ ఎన్నడూ లేని విధంగా క్షీణించింది. రూపాయి విలువ ఎందుకు దారుణంగా పడిపోయిందో మోదీ సమాధానం చెప్పాలి. లాభాల్లో ఉన్న ఎల్‌ఐసీని ప్రైవేటీకరించి, నవరత్న హోదా కలిగిన సంస్థలను అమ్మేశారు. మోదీ ప్రభుత్వం ఏ రంగంలోనూ విజయం సాధించలేదు.
దేశంలో కరోనా సంక్షోభ సమయంలో పవిత్ర గంగా నదిలో శవాలు తేలాయి. లక్షల మంది వీధిన పడ్డారు. ప్రజలు నైరాష్యానికి గురయ్యారు. మోదీ ప్రభుత్వం పేదలకు రవాణా సౌకర్యం కల్పించకపోవడం సిగ్గుచేటు. హైదరాబాద్‌లో ఉంటున్న యూపీ, బెంగాల్‌తోపాటు ఇతర రాష్ట్ర కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహాయాన్ని అందించింది. ప్రత్యేక రైళ్లలో ఉచితంగా వారి ఇళ్లకు పంపించాం.
ఉచితంగా రేషన్, మందులు కూడా అందించాం. మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రతి విధానం దేశానికి పెద్ద నష్టం చేసింది. మోదీ పాలనలో అనేక రంగాల్లో భారత్ ర్యాంకు అంతర్జాతీయ స్థాయిలో పడిపోయింది. మానవాభివృద్ధి సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ 80 నుండి 131కి పడిపోయింది.
మానవ హక్కులలో భారతదేశం 85 నుండి 119వ స్థానానికి దిగజారింది. నిరుద్యోగిత రేటు కూడా 8.1 శాతానికి పెరిగింది. గత ప్రభుత్వాల హయాంలో ఇది 5.6 శాతంగా ఉంది. హ్యాపీనెస్ ఇండెక్స్ మరియు ఎన్విరాన్‌మెంట్ ఇండెక్స్ లో కూడా భారతదేశం దారుణమైన ర్యాంకు దిగజారింది. గత 8 ఏళ్లుగా మోదీ ప్రభుత్వ పనితీరు ఎంత దారుణంగా ఉందో ఈ విషయాలు తేటతెల్లం చేస్తున్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థను, సమాఖ్య నిర్మాణాన్ని నిర్వీర్యం చేస్తున్న మోదీ ప్రభుత్వం పాలనను ఖూనీ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలను వేధిస్తోంది. మహారాష్ట్రలో బీజేపీ మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని ఓ కేంద్ర మంత్రి ప్రకటన చేయడం ఆశ్చర్యం కలిగించింది. 119 మంది సభ్యుల తెలంగాణ అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌కు 100 మందికి పైగా సభ్యుల బలం ఉంది.
మేము ఎదురు చూస్తున్నాం. మోదీ నియంతృత్వ పాలనలో తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దె దించనివ్వండి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ కోసం 60 ఏళ్లు పోరాడాం. తెలంగాణ మరో దఫా భారీ పోరుకు సిద్ధమైంది.
మోదీ నిర్ణయాలు, విధానాల వల్ల అంతర్జాతీయ వేదికలపై భారతదేశం అవమానాలకు గురైంది. పెరుగుతున్న ద్వేషం, విభజన రాజకీయాలు అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి పెద్ద అపఖ్యాతిని తెచ్చిపెట్టాయి. భారతదేశం సహనంతో కూడిన దేశం. ఈ దేశ ప్రాథమిక సూత్రం జీవించడం, జీవించనివ్వండి. మోదీ భారతదేశం కోసం ఏం కలలు కన్నాడు. ఏమి సాధించాడు. రాష్ట్రాలు తమ పన్ను వాటాను కోల్పోయాయి.
మోదీ ప్రభుత్వం సెస్ పేరుతో పన్నులు వసూలు చేసి రాష్ట్రాలకు రూ.30 లక్షల కోట్లు ఎగవేస్తోంది. భారతదేశం శాంతి దూత అని, ప్రపంచం మొత్తం మహాత్మా గాంధీని గౌరవిస్తుంది. ఈరోజు బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ గాంధీ ప్రతిష్టను దిగజార్చుతున్నారు. మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారు. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట మసకబారింది. భారత జాతిపిత మహాత్మాగాంధీ మోదీ మనుషులచే పదే పదే అవమానించబడ్డాడు. ప్రధాని తన ప్రసంగంలో దీనికి సమాధానం చెప్పాలి. మోదీ ఇతర దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నారు. అమెరికా ఎన్నికల్లో మోదీ ట్రంప్‌కు మద్దతు పలికారు.
విదేశాలతో సత్సంబంధాలు కొనసాగించడమే భారత విదేశాంగ విధానం. అమెరికా ఎన్నికలు అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికల మాదిరిగానే ఉంటాయని మోదీ భావిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్టను దిగజార్చినందుకు మోదీ క్షమాపణ చెప్పాలి. తనలోని గొప్పతనం ఏమిటో కూడా మోదీ సమాధానం చెప్పాలి. మోదీ తనను తాను దేవుడిగా ప్రచారం చేసుకోవడం విడ్డూరం. మోదీ అసమర్థత తేటతెల్లమవుతున్నది.
భారతదేశంలో 70,000 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో తాగునీరు అందించడంలో మోదీ విఫలమయ్యారు. దేశంలో కరెంటు లేని, నీరు లేని అనేక నివాసాలు కూడా ఉన్నాయి. మోదీ ద్వేషాన్ని పెంచారు. ఈడి, ఆదాయపు పన్ను వంటి రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగపరుస్తూ మోదీ రాష్ట్రాలపై వేధింపులకు పాల్పడుతున్నారు.
తెలంగాణ కోసం పోరాడి ప్రత్యేక రాష్ట్రం ద్వారా చేకూరిన ఫలాలు అనుభవిస్తున్నాం. ఇప్పుడిక మనం సరికొత్త, సచ్చీలత, నిజాయితీ కలిగిన భారతదేశం కోసం పోరాడాలి. ఇవ్వాల్టి నుంచే మనం ఈ పోరాటాన్ని ప్రారంభిద్దాం. ఈ రోజు హైదరాబాద్ లో ప్రజాస్వామ్య కోట ఆవిష్కరించబడింది. ప్రజాస్వామ్యం పట్ల ఎంతటి యిష్టత ఉందో నేడు హైదరాబాద్ లో ప్రదర్శించబడింది. ఇవ్వాళ రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా సమావేశాలు నిర్వహించడం ప్రజాస్వామ్య స్ఫూర్తి భారతదేశంలో ఇంకా సజీవంగా ఉందని రుజువు చేస్తున్నది.
మోదీ భారతదేశ స్వరాన్ని అణచివేయలేరు. రానున్న కాలంలో ఉజ్వలమైన, మహోన్నతమైన, అత్యన్నతమైన భారతదేశం ఆవిష్కరింపబడాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. మరోసారి యశ్వంత్ సిన్హా గారు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు….