thesakshi.com : ఏపీలో తిరుపతి బై పోల్ కాకరేపుతుంది. తిరుపతి ఉప ఎన్నికలలో వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ చివరి పంచ్ ఇవ్వనున్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి ఈ నెల 14న ఆయన తిరుపతి వెళ్లనున్నారు.
ఈ నెల 17న తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. రెండు రోజులు ముందుగా 15న ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ప్రచారం సమాప్తం కావడానికి ఒకరోజు ముందు సీఎం జగన్ ప్రచార పర్యటన ఖరారు కావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉంటే .. మరోవైపు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ నెల 8 నుంచి వారం రోజుల పాటు తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయనున్నారు. రోజుకో నియోజకవర్గంలో రెండు మూడు సభలు నిర్వహించాలని టీడీపీ ప్లాన్ చేస్తుంది.
అయితే అసలు ట్విస్ట్ ఏమిటంటే… చంద్రబాబునాయుడు ఒక్కోరోజు ఒక్కో నియోజకవర్గంలో పర్యటిస్తుంటేసీఎం జగన్ మాత్రం ఒకే రోజు తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తారని వైసీపీ నేతలు చెప్తున్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్రచారానికి రావడం ఇదే తొలిసారి. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి జగన్ రాలేదు. చంద్రబాబు లోకేశ్ మాత్రం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయితే ఆ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకే పట్టం కట్టారు.
అయితే తిరుపతి గెలిచి పరువు నిలబెట్టుకోవాలని టీడీపీ సత్తా చాటాలని బీజేపీ జనసేన చూస్తున్న ఈ తరుణం లో జగన్ తన పర్యటన తో వారి ఆశలకు గండి కొట్టినట్టే. తిరుపతిలో భారీ మెజార్టీ సాధించాలనే పట్టుదలతో వైసీపీ ప్రభుత్వం ఉంది.
ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ ప్రచారానికి వెళుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం జగన్ తిరుపతి ప్రచారానికి వస్తున్నారనే సమాచారం వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. దీనితో వైసీపీ శ్రేణులు ప్రచారంలో మరింత దూకుడు చూపిస్తున్నారు.
బలిజల ఓట్లపైనే అన్నీపార్టీలు దృష్టి..
తిరుపతి లోక్ సభ పరిధిలోని బలిజల ఓట్లపైనే అన్నీపార్టీలు దృష్టి పెట్టాయి. నిజానికి మిగిలిన ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలిజ ఓట్లు ఎలాగున్నా తిరుపతి అసెంబ్లీ పరిధిలో మాత్రం ఎక్కువగానే ఉన్నాయి.
అసలు ఈ ఓట్లను దృష్టిలో పెట్టుకునే జనసేన తరపున అభ్యర్ధిని పోటీ చేయించటానికే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెగ ఆయాసపడింది. ఎంత ప్రయత్నించినా చివరకు లాభం లేకపోయింది లేండి.
మొన్నటికి మొన్న తిరుపతిలో పవన్ రోడ్డుషో తర్వాత బహిరంగసభ కూడా బలిజల ఓట్లను ఆకట్టుకోవటం కోసమే. మరి తన ప్రచారంలో పవన్ ఏ మేరకు సక్సెస్ అయ్యారనేది ఇఫ్పటికైతే సస్పెన్సనే చెప్పాలి. కానీ చరిత్రను చూస్తే గనుక బలిజల ఓట్లు ప్రతిసారి ఒకే పార్టీకి మద్దతుగా ఉన్నట్లు కనిపించదు.
ఒకసారి ఒకపార్టీకి మద్దతుగా ఉంటే మరోసారి ఇంకో పార్టీకి మద్దతుగా ఉంటాయి. తిరపతి అసెంబ్లీ నుండి కాంగ్రెస్ పార్టీ తరపున మబ్బు రామిరెడ్డి రెండుసార్లు గెలిచినపుడు బలిజల ఓట్లు కూడా కీలకమయ్యాయి.
అలాగే టీడీపీ తరపున మోహన్ గెలిచినపుడు బలిజల ఓట్లే కీలకం. అలాగే ఆ తర్వాత టీడీపీ తరపున చదలవాడ కృష్ణమూర్తి వెంకటరమణ గెలుపుకు బలిజల ఓట్లే ఆదుకున్నాయి. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరపున భూమన కరుణాకర్ రెడ్డి టీడీపీ తరపున వెంకటరమణ భార్య సుగుణమ్మ పోటీ చేస్తే భూమన గెలిచారు.
అంటే బలిజల ఓట్లు ఇద్దరికీ దాదాపు సమానంగా పడ్డాయని అర్ధమవుతోంది. భూమనకు పోలైన ఓట్లు 80544. అలాగే సుగుణమ్మకు 79836 ఓట్లుపడ్డాయి.
ఇక జనసేన తరపున పోటీ చేసిన చదలవాడ కృష్ణమూర్తికి పడిన ఓట్లు 12315 మాత్రమే. చదలవాడ బలిజ అభ్యర్ధే అయినా బలిజల ఓట్లు ఆయనకు పడలేదు. సుగుణకన్నా భూమనకు బలిజల ఓట్లతో పాటు ఇతరుల ఓట్లు కూడా పడ్డాయి కాబట్టి వందల మెజారిటితో గెలిచారు.
అంటే ఇక్కడ గమనించాల్సిందేమంటే బలిజల ఓట్లు ముగ్గురి మధ్య చీలిపోయాయి. మరి ప్రస్తుత లోక్ సభ ఉపఎన్నికలో బలిజల ఓట్లు ఎవరివైపు మొగ్గు చూపుతాయి ? అన్నదే అర్ధం కావటంలేదు.
నిజానికి జనసేన అన్నది బలిజలు లేకపోతే కాపుల పార్టీగా వాళ్ళే అనుకోవటంలేదు. లేకపోతే స్వయంగా రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోవటమేంటి ? పైగా కాపులు ఎక్కువగా ఉన్నారని అనుకునే ఉభయగోదావరి జిల్లాల్లో కూడా జనసేన అభ్యర్ధులకు ఓట్లు రాకపోవటం ఏమిటి ? కాబట్టి క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూసిన తర్వాత బలిజల ఓట్లు పవన్ కారణంగా బీజేపీకి పడుతుందనేది శుద్ధ తప్పనే అనుకోవాలి. కాకపోతే ఎవరికి ఎక్కువగా పడతాయన్న విషయాన్ని ఎవరు చెప్పలేకున్నారు.