thesakshi.com : సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ లు వచ్చాక సైబర్ మోసగాళ్లు భారీగా విరుచుకుపడి సొమ్మును కాజేస్తున్నారు. కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ సైబర్ నేరగాడి వలలో పడి నిండా మునిగారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. నేటి కాలంలో ప్రతి పనికి ఆన్లైన్ అవసరం ఉంటుంది. ఏదైనా వస్తువు కొనాలన్నా.. అమ్మాలన్నా.. చివరిక ఆహారం తెచ్చుకోవాలన్న ప్రజలు ఆన్లైన్ కు అలవాటు పడ్డారు. ఇదే సైబర్ మోసగాళ్లకు వరంగా మారింది.
మనిషి అత్యాశనే ఆసరాగా చేసుకొని మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్ లైన్ మోసాలకు అసలు కారణం ఇదే. దీన్నే పెట్టుబడిగా పెట్టుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతుంటారు. ఇలా అత్యాశకు పోయిన ఓ వ్యక్తి ఏకంగా 27 లక్షలు పోగొట్టుకున్నాడు. హైదరాబాద్ లో జరిగిన మరో బడా ఆన్ లైన్ మోసం షాకింగ్ గా మారింది.
సికింద్రాబాద్ కు చెందిన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి వ్యాపారం చేస్తుంటారు. ఈ ట్రేడింగ్ కు సంబంధించి సమాచారం కోసం ఆన్ లైన్ లో ఎక్కువగా వెదుకుతుంటారు. అలా ఓ అపరిచితుడు కరుణాకర్ రెడ్డికి పరిచయం చేసుకున్నాడు. తనకు ఒక ట్రేడింగ్ కంపెనీ ఉందని.. పాతికేళ్లుగా లాభాల్లో నడిపిస్తున్నానని నమ్మించాడు. ఆ తర్వాత వాట్సాప్ కాల్ కూడా చేసి మాట్లాడాడు.
ఆ తర్వాత ఆ కేటుగాడు ‘బీటీసీ వెల్త్ ఫేర్ 009’ అనే వాట్సాప్ గ్రూపులో కరుణాకర్ రెడ్డిని చేర్చాడు. ట్రేడింగ్ లో లాభాలు పొందినట్టు కొన్ని స్క్రీన్ షాట్స్ అతడికి షేర్ చేశాడు. అపరిచితుడి మాటలు నమ్మిన కరుణాకర్ రెడ్డి ముందుగా లక్ష రూపాయలు పెట్టాడు. ఈ లక్షకు కళ్లు చెదిరే లాభాలు అందించాడు అపరిచితుడు. దీంతో కరుణాకర్ రెడ్డికి మరింత ఆశపుట్టింది. ఈసారి ఏకంగా 8 లక్షలు పెట్టాడు. ఆ 8 లక్షలకు 90 లక్షలు లాభం చూపించాడు ఆగంతకుడు. అయితే ఆ 90 లక్షలు కావాలంటే 20 శాతం కమీషన్ ను ముందుగా చెల్లించాలని.. 30 శాతం ట్యాక్స్ అడ్వాన్స్ గా కట్టాలని నమ్మబలికాడు..
ఇదంతా నమ్మిన కరుణాకర్ రెడ్డి క్రిప్టో రూపంలో 18 లక్షలు వివిధ రూపాల్లో మరో 9 లక్షలు కట్టాడు. అంతే ఆ వెంటనే మోసగాడు నంబర్ మార్చాడు. వాట్సాప్ ఎత్తివేశాడు. ఫోన్ నంబర్ పనిచేయలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన కరుణాకర్ రెడ్డి నిండా మునిగాక సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. నిందితుడు తెలివిగా ఎక్కడా దొరక్కుండా చూసుకోవడంతో కరుణాకర్ రెడ్డి లబోదిబోమంటున్నాడు.