thesakshi.com : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పార్టీ నిర్ణయించింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ జన్మదినోత్సవం పార్టీ శ్రేణులకే కాకుండా ప్రజలకు కూడా పండుగలాంటిదని, అందుకే ఏదో ఒక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రత్యేకించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు.
గత ఏడాది కరోనా నేపథ్యంలో రక్త నిల్వల కొరత రాకుండా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. మంగళవారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో మొక్కలు నాటడం, రక్తదానం, దుస్తులు, దుప్పట్లు, పేదలకు నిత్యావసరాల పంపిణీ, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు.
సాంస్కృతిక కార్యక్రమాలు, సీఎం జగన్ ఫొటో ఎగ్జిబిషన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరవుతుండగా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నాయకులు పాల్గొంటారు.