thesakshi.com : గుంటూరు జిల్లా ప్రత్తిపాడు గరం గరం గా మారుతోంది. మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత అయితే తన ఆగ్రహాన్ని దాచుకోలేకపోయారు. ఆమె తనకు మలివిడత క్యాబినెట్ లో బెర్త్ దక్కనందుకు నిరసన తెలియచేస్తూ రాజీనామా అస్త్రాన్ని సంధించారు.
స్పీకర్ ఫార్మెట్ లో ఆమె రాజీనామా చేసేశారు. తనను సముదాయించడానికి ఇంటికి వచ్చిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణకు అందచేశారు. స్పీకర్ ఫార్మెట్ లో తన రాజీనామాను ఆమె మోపిదేవికి ఇవ్వడం సంచలనం సృష్టించింది.
ఆమె వైఎస్సార్ ఫ్యామిలీకి బాగా సన్నిహితురాలు. 2009 ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ ఆమె గెలిచారు. ఆ తరువాత జగన్ పార్టీలో చేరి 2014 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. అలాంటి మేకతోటికి తొలి విడతలో ఏకంగా హోమ్ మంత్రి వంటి కీలకమైన పదవిని జగన్ ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నాడే రెండున్నరేళ్ల తరువాత మంత్రి పదవులు పూర్తిగా మార్చేస్తామని చెప్పామని అయినా ఆమె ఇపుడు రాజీనామా చేయడం నిరసన తెలియచేయడం పట్ల వైసీపీ అగ్ర నాయకత్వం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఇక ఆమెను బుజ్జగించే చర్యలకు పార్టీ పెద్దలు దిగుతున్నారు. సజ్జల రామక్రిష్ణారెడ్డిని పంపించడం ద్వారా ఆమెకు భరోసా ఇచ్చి రాజీనామా వెనక్కి తీసుకునేలా చూడాలని భావిస్తున్నారు.
అయితే మేకతోటి సుచరిత మాత్రం రాజీనామా నిర్ణయం మారదు అని చెబుతున్నారు. దీంతో వైసీపీ వర్గాలు షాక్ తింటున్నాయి. మరో వైపు చూస్తే సుచరిత అనుచరులు ముఖ్య నాయకులు సైతం మోపిదేవిని అడ్డుకున్నారు. తమ నాయకురాలికి అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కార్యకర్తలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు కూడా ప్రయత్నించడం జరిగింది. మొత్తానికి ప్రత్తిపాడు ఉద్రిక్తతలతో వేడెక్కింది.
ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేత తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అవమానంతో రగిలిపోతున్నారు. తనను నమ్మించి మోసం చేశారని ఆయన మండిపడుతున్నారు. ప్రకాశం జిల్లాలో పార్టీని భుజానికి ఎత్తుకుని పనిచేసిన బాలినేనికి మాజీని చేశారు. దాంతో ఆయన తన ఆగ్రహాన్ని దాచుకోలేకపోతున్నారు.
ఇక ఆయన వద్దకు చర్చలకు వచ్చిన సజ్జల రామక్రిష్ణా రెడ్డి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిలతో బాలినేని మాట్లాడుతూ తనను నమ్మించి చివరికి ఏమీ కాకుండా చేశారని మండిపడ్డారని టాక్. అంతే కాదు మంత్రి పదవి విషయంలో తనను పక్కన పెట్టడం మీద కూడా రగిలిపోతున్నారు.
ప్రకాశం జిల్లాలో బాలినేనికి గట్టి పట్టుంది. ఆయన వర్గంగా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో ఆయన వారిని కూడా సముదాయించలేకపోతున్నారు. తనను బుజ్జగించడానికి వచ్చిన హై కమాండ్ ప్రతినిధులుగా వచ్చిన సజ్జల రామక్రిష్ణారెడ్డి శ్రీకాంత్ రెడ్డి కూడా బాలినేని పట్టించుకోవడంలేదు. తన నిర్ణయం తనదే అన్నట్లుగా ఆయన వైఖరి ఉందని అంటున్నారు.
ఇక తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అని బాలినేని వచ్చిన వారితో స్పష్టంగా చెప్పడంతో చర్చలు విఫలం అయ్యాయనే అంటున్నారు. బాలినేని తీవ్ర నిర్ణయం తీసుకోకుండా చూడాలని పార్టీ హై కమాండ్ నుంచి సూచనలు వచ్చినా చర్చలు మాత్రం సక్సెస్ కాకపోవడంతో సజ్జల రామక్రిష్ణారెడ్డి శ్రీకాంత్ రెడ్డి వెనుతిరగాల్సి వచ్చింది. మొత్తానికి బాలినేని తన నిర్ణయం త్వరలోనే తీసుకుంటాను అని అంటున్నారు.
బాలినేని వ్యవహారం చూస్తే వైసీపీ హై కమాండ్ కి షాక్ ఇచ్చేలా ఉందని అంటున్నారు. బాలినేనిని బుజ్జగించి దారికి తెచ్చే మార్గాలను పార్టీ పెద్దలు వెతుకుతున్నారు. మొత్తానికి బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఆయన ఏమి చేస్తారో చూడాలి.
మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ కాదు కానీ చిచ్చు ఒక్క లెక్కలా లేదు. వారూ వీరూ కాదు అందరూ రాజీనామాలు చేయడానికి రెడీ అంటున్నారు. దాంతో పదవుల మీద ఆశలు పెట్టుకున్న వారు ఎంతగా రగిలిపోతున్నారో అర్ధమవుతుంది.
చూసుకుంటే ప్రకాశం జిల్లాలో ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అగ్గి రాజేస్తున్నారు. ఆయన వైసీపీ అధినాయకత్వానికి కంటిలో కునుకు లేకుండా చేస్తున్నారు. ఇపుడు ఆయన జిల్లాకే చెందిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని చెబుతున్నారు.
ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఆయన విస్తరణలో తనకు బెర్త్ కన్ ఫర్మ్ అనుకున్నారు. అయితే ఆ సామాజికవర్గం కోటాలో ఎవరికీ మంత్రి పదవికి ఎంపిక చేయలేదు. దీంతో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం వేళనే తన ముహూర్తంగా పెట్టుకుని మరీ అన్నా రాంబాబు రాజీనామా చేస్తాను అని అంటున్నట్లుగా తెలుస్తోంది.
మరో వైపు ప్రకాశం జిల్లాకు ఒకే ఒక మంత్రి పదవి లభించింది. అది కూడా తాజా మాజీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కి ఇచ్చారు. దాంతో ఆ జిల్లాలో నిరసన తారస్థాయిలో ఉంది. ఈ పరిణామాల క్రమంలో అన్నా రాంబాబు కూడా రాజీనామా లేఖ ఇస్తానని చెప్పడంతో వైసీపీలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్ధం కాని పరిస్థితిగా ఉంది.