thesakshi.com : త్వరలో దేశవ్యాప్తంగా ఖాళీ అవబోతున్న 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయ్యే నాలుగు స్థానాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఈ ఏడాది జూన్ 21తో ముగియనుంది. రాజ్యసభ పదవీకాలం ముగియనున్న వారిలో విజయసాయిరెడ్డి సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌లు, సురేష్ ప్రభులు ఉన్నారు. వీరిలో విజయసాయి రెడ్డి వైసీపీది కాగా.. సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌లు టీడీపీ నుంచి గెలుపొంది ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. ఇక, బీజేపీ నేత సురేష్ ప్రభు అప్పటి టీడీపీ – బీజేపీ పొత్తులో భాగంగా ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లారు.
ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాల ప్రకారం ఆ నాలుగు స్థానాలను కూడా అధికార వైసీపీ సొంతం చేసుకోనుంది. అయితే ఈ నాలుగు స్థానాలను వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఎవరికి కేటాయిస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల కోరి మేరకు రిలయన్స్ ఇండిస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వానీకి వైసీపీ తరఫున టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
నాలుగు రాజ్యసభ స్థానాలకు ఒకటి విజయసాయిరెడ్డిని తిరిగి పంపించాలని జగన్ నిర్ణయం తీసుకోనున్నారు . మరో మూడు స్థానాలుకు నెల్లూరు జిల్లా బీసీ నేత బీద మస్తాన్‌రావును, నిరంజన్ రెడ్డి, ఆర్పి క్రిష్ణ్నయ్య లను ఎంపిక చేశారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలో ఖాళీ అవబోతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి అదానీ గ్రూప్‌నకు కేటాయించినట్లు విస్తృతంగా వార్తలు వచ్చాయి. నాలుగు స్థానాలు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడబోతున్నాయి. అయితే వీటిలో ఒకటి అదానీ గ్రూప్‌నకు కేటాయించారని, ఆయన కుటుంబం నుంచి ప్రీతి అదానీ రాజ్యసభకు ఎంపిక కాబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ కూడా రావడంతో ఆ ప్రచారం కూడా పతాకస్థాయికి చేరింది. అయితే తాము ఏ పార్టీలో చేరడంలేదని, ఏ సభకు తాము వెళ్లబోవడంలేదంటూ అదానీ గ్రూప్ అధికారికంగా ప్రకటించింది.
ఇక, చివరి నిమిషంలో సామాజిక సమీకరణాల లెక్కలు మారితే.. 2024 ఎన్నికల దృష్టిలో ఉంచుకుని నాలుగో స్థానానికి అభ్యర్థి ఎంపికలో మార్పులు చోటుచేసుకునే అవకాశం కూడా ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సోషల్ ఇంజనీరింగ్ లెక్కలు మారితే నాలుగో రాజ్యసభ స్థానాన్ని.. మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థికి లేదా ఎస్సీ ప్రతినిధికి దక్కే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.